దర్శక నిర్మాత రచయిత #ఆలూరి_చక్రపాణి గారి వర్ధంతి నేడు..
చక్రపాణి చమక్కు తెలుగు పాఠకులకు భలే ఇష్టం. ఆయన రాసిన అనువాద కథలు చదివి, అవి పరభాష కథలు కావని వాదించినవారూ ఉన్నారు. ఇప్పటికీ చక్రపాణి అనువదించిన రచనలు చదివితే అలాగే అనిపిస్తుంది. వ్రాతగాడు కావడంతో ఆబాలగోపాలాన్నీ అలరించేందుకే
ఆలోచించేవారు చక్రపాణి. ఆయన మేధస్సు నుండి పురుడు పోసుకున్నదే ‘చందమామ’ మాస పత్రిక. ఆ రోజుల్లో పలు భాషల్లో ‘చందమామ’ జనాన్ని ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఆయన నేతృత్వంలో వెలుగు చూసిన ‘యువ’ మాస పత్రిక సైతం పండితపామరులను అలరించింది. ఇక చిత్రసీమలోనూ చక్రపాణి బాణీ భలేగా సాగింది.
‘చెక్కన్న’గా సినీజనం అభిమానం సంపాదించిన చక్రపాణి మిత్రుడు బి.నాగిరెడ్డితో కలసి ‘విజయా సంస్థ’ను నెలకొల్పి, తెలుగువారు మరచిపోలేని చిత్రాలను అందించారు. ఆ రోజుల్లో ఆసియా ఖండంలోనే అతి పెద్ద స్టూడియోగా ‘విజయా-వాహినీ స్టూడియోస్’ను తీర్చిదిద్దడంలోనూ చక్రపాణి పాత్ర ఎంతో ఉంది.
చక్రపాణి అసలు పేరు ఆలూరి వెంకటసుబ్బారావు. 1908 ఆగస్టు 5న తెనాలిలో జన్మించారు. ఆయనకు ముందు తరువాత కూడా ఎందరో సరస్వతీపుత్రులు, సాహితీప్రియులు తెనాలిలో వెలిశారు. చక్రపాణి అన్నది ఆయన కలం పేరు. చిన్నతనం నుంచీ సాహిత్యం అంటే చెప్పలేనంత అభిమానం. 1932లో చక్రపాణి టీబీ బారిన పడ్డారు.
ఆ రోజుల్లో ఆ వ్యాధికి మదనపల్లె శానిటోరియం తగిన చికిత్స అందించేది. అక్కడ చేరిన చక్రపాణికి, అదే వ్యాధితో శానిటోరియం వచ్చిన ఓ బెంగాలీ పరిచయమయ్యారు. ఆయన ద్వారా బెంగాలీ భాష నేర్చుకున్న చక్రపాణి, తరువాతి రోజుల్లో శరత్ బాబు రాసిన బెంగాలీ నవలలు ‘దేవదాసు’, ‘బడీ దీదీ’
తెలుగులోకి అనువదించారు. ఆ తరువాత మరికొందరు శరత్ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించినా, చక్రపాణిలాగా పాఠకులను ఆకట్టుకోలేక పోయారు. చక్రపాణి కలం నాటకాలూ పలికించింది.
పి.పుల్లయ్య ఆహ్వానం మేరకు ఆయన తెరకెక్కించిన ‘ధర్మపత్ని’కి రచన చేశారు చక్రపాణి. బి.యన్.రెడ్డి రూపొందించిన ‘స్వర్గసీమ’కు
కూడా చక్రపాణి రచయిత. సినిమాలకు రచన చేస్తూ, తన రచనలను పుస్తకాలు వేయిస్తూ ఉండేవారు చక్రపాణి. ఆ క్రమంలో బి.యన్.కె. ప్రెస్ నిర్వహిస్తున్న బి.యన్. రెడ్డి తమ్ముడు బి.నాగిరెడ్డి పరిచయమయ్యారు. అది కాస్తా గాఢ స్నేహంగా మారింది. ఈ ఇద్దరు మిత్రులు కలసి ‘విజయా’ సంస్థను నెలకొల్పి, విలువలుగల
చిత్రాలను వినోదంతో నింపి మరీ ప్రేక్షకుల ముందుకు వదిలారు. ఇంకేముంది విజయావారి చిత్రాలను తెలుగు జనం విశేషంగా ఆదరించారు. అలాగే తెలుగు సినిమా స్వర్ణయుగంలో విజయావారి చిత్రాలే అధికంగా విజయం సాధించాయని చెప్పవచ్చు. తొలి చిత్రం ‘షావుకారు’
మొదలు చివరి సినిమా ‘శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ దాకా ఆ ఇద్దరు మిత్రులు అదే తీరున సాగారు. వారు అందించిన “షావుకారు, పాతాళభైరవి, పెళ్ళిచేసిచూడు, చంద్రహారం, మిస్సమ్మ, అప్పుచేసిపప్పుకూడు, జగదేకవీరుని కథ, గుండమ్మకథ, సి.ఐ.డి” చిత్రాలను జనం ‘నవరత్నాలు’గా భావించారు.
చెక్కన్న తాను నిర్మించే చిత్రాల విషయంలో ప్రతీ అంశంలోనూ జోక్యం చేసుకొనేవారు. అది ఎల్.వి.ప్రసాద్ లాంటివారికి ఏ మాత్రం ఇబ్బంది కలిగించలేదు. కానీ, కేవీ రెడ్డి మాత్రం ‘పాతాళభైరవి’ సమయంలో చెక్కన్నతో కలసి పనిచేశారు. ఆ తరువాత నుంచీ విజయా సంస్థలో కేవీ రెడ్డి పనిచేసే సమయంలో ముందుగానే
‘చెక్కన్న జోక్యం చేసుకోరాదు’ అని నియమం పెట్టి మరీ చిత్రాలు తీశారు. దాంతో చెక్కన్నకు దర్శకత్వం అన్నది ఏమీ బ్రహ్మపదార్థం కాదు, స్క్రిప్ట్ సరిగా ఉంటే దర్శకుల గొప్పతనం ఏముంది అనేవారు. ‘గుండమ్మ కథ’ చిత్రాన్ని ఆయన సూచనల మేరకే తెరకెక్కించారు. డి.వి.నరసరాజు రచనతో కమలాకర కామేశ్వరరావు
దర్శకత్వంలో ‘గుండమ్మ కథ’ తెరకెక్కింది. అదే సమయంలో ఈ చిత్రాన్ని తమిళంలో ‘మనిదన్ మారవిల్లై’ పేరుతో చక్రపాణి స్వీయ దర్శకత్వంలో రూపొందించారు.
తెలుగులో ‘గుండమ్మ కథ’ సూపర్ హిట్ కాగా, తమిళ ‘మనిదన్ మారవిల్లై’ పరాజయం పాలయింది. అప్పటి నుంచీ చక్రపాణి ఎక్కడ తేడా వచ్చిందా అన్న
ఆలోచనలో పడ్డారు. పద్నాలుగేళ్ళ తరువాత ‘మిస్సమ్మ’ కథను అటుఇటుగా మార్చి, ‘శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ రూపొందించాలనుకున్నారు. బాపును తన కో-డైరెక్టర్ గా నియమించుకున్నారు. ఆ సినిమా మొదలయిన కొద్ది రోజులకే అంటే 1975 సెప్టెంబర్ 24న చెక్కన్న కన్నుమూశారు.
తరువాత బాపు నిర్దేశకత్వంలో ‘శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ రూపొందింది. ఆ సినిమా ఆట్టే అలరించలేకపోయింది. చెక్కన్న మరణం నాగిరెడ్డిని ఎంతగానో కలచివేసింది. ఆ తరువాత నాగిరెడ్డి కూడా చిత్రనిర్మాణం సాగించలేదు. నాగిరెడ్డితో కలసి చెక్కన్న నెలకొల్పిన విజయా సంస్థ, విజయావాహినీ స్టూడియోస్,
డాల్టన్ పబ్లికేషన్స్ అన్నీ కాలగర్భంలో కలసి పోయాయి. వారి తలపులు మాత్రం జనం మదిలో నిలచే ఉన్నాయి.
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.