ఆదిత్య శివశంకర కలకొండ Profile picture
తెలుగుభాష అభిమానిని , తల్లి తెలుగుభాషను బ్రతికించడానికి నావంతు ప్రయత్నం చేస్తున్న ఆశావాదిని... సినిమాలు, పుస్తకపఠనం, సంగీతం, సాహిత్యం ఇష్టమైనవి..

Oct 5, 2022, 14 tweets

చెట్లు చేమలు
కొండలు కోనలు
వాగులు వంకలు
సెలయేళ్లు నింగి నేల అంటూ ఆకాశమే హద్దుగా ప్రపంచంలోని రంగు రంగులను స్వేచ్ఛగా ఆస్వాదించిన నీ చూపుల్లోని శక్తినంతా ఒకానొక కాళరాత్రి అదృశ్య శక్తి వచ్చి లాగేస్తుంది.

ఉదయం కళ్ళు తెరిచి చూస్తే రాత్రిలాగే ఉంటుంది.

నీ చూపు నువ్వు కోల్పోయిన ఆ క్షణం

నుంచి నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు. కళ్ళు బలవంతంగా విప్పినా కానరాని గాఢాంధకారం

అయినా బతకాలి
ఎవరి కోసమంటే?
ఎందుకోసమంటే?

ఏమో..! నీ చూపుల మకరందాన్ని నా నుంచి బలవంతంగా లాగేసిన ఆ అదృశ్య శక్తి కరుణించకపోదా..! విముక్తి ప్రసాదించకపోదా..!

అది ఆశ కావొచ్చు
నమ్మకం కావొచ్చు

తీరని కోరికే అయ్యిండొచ్చు. కానీ తిరిగి పొందాలనే ప్రయత్నం మాత్రం ఏ క్షణానా విరమించకు.

అచ్చంగా ఇదే. 'ఎలెక్స్ హేలీ' అనే ఒక సంకర జాతి రక్తం పంచుకుని (రచయిత తన ఏడు తరాల ముందటి పూర్వీకుల్ని కలిసిన క్షణాన తనని తాను అలా చెప్పుకున్నాడు) పుట్టిన రచయిత సృష్టించిన 261 పేజీల

అద్భుతం 'ఏడు తరాలు(Roots)' చదువుతున్న ప్రతి పేజీలో, ప్రతి పేరాలో, ప్రతి అక్షరంలో నేను అనుభూతించిన భావం అచ్చంగా ఇదే.

అక్కడెక్కడో ఆఫ్రికా ఖండంలో గాంబియా అనే దేశంలో మాండింకా తెగ ప్రజలు నివసించే జపూర్ అనే ఒక కుగ్రామం. అందులో ఉమరో ఒకడు. వాళ్లది కింటే వంశం. అతని రెండవ భార్యకు పుట్టిన

నలుగురు కొడుకుల్లో 'కుంటా కింటే' పెద్దోడు. సాంప్రదాయ ముస్లిం పద్ధతిలో అన్ని శిక్షణలూ పూర్తి చేసుకుని బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెడతాడు. శరీరంలో కూడా అప్పుడప్పుడే యవ్వనం తాలూకు చలనాలు కలుగుతుంటాయి.

ఒంటరిగా ఎప్పుడూ అడవుల్లో తిరగకు, తెల్లోళ్లు వస్తారు, ఎత్తుకుపోతారు, చంపి

తినేస్తారు అని పెద్దలు పదే పదే చెబుతుంటారు. అయితే ఒకనాటి ఉదయం తమ్ముడు ఆడుకోడానికి చెక్కబొమ్మ కోసమని ఏమరపాటుగా ఒంటరిగా అడివికి వెళ్లిన కుంటా ఇక తిరిగి రాడు. ఏమైందని స్పృహ వచ్చేలోపు ఓడలో ఉంటాడు.

ఓడ దిగువ అరల్లో వెలుగు మొహం ఎరుగుని చిమ్మ చీకటిలో తనలాగే కుక్కబడ్డ తొంభై అభాగ్యుల్లో

ఇతనూ ఒకడు. తిండీ అక్కడే, మల మూత్రాలు అక్కడే. అమెరికా దక్షిణాది రాష్ట్రంలోని ఒకానొక తారం అనాపోలిస్(నాప్లిస్) చేరే రెండున్నర నెలలపాటు అదొక నరక ప్రయాణం. దిగేసరికి పోయిన వాళ్లు పోగా మిగిలిన కొద్దిమందీ అమెరికా తెల్ల భూస్వాముల దగ్గర బానిసలుగా అమ్మబడతారు.

అక్కన్నుంచి బయటపడదామని

రెండడుగులు ముందుకు వేసిన ప్రతిసారీ అంతకు నాలుగింతల వేగంగా వెనక్కి తోయబడతుంటాడు కుంటా. అయినా బయటపడాలనే తన ఆశను, ప్రయత్నాన్ని ఆపడు. అలా అతని తదనంతర నాలుగు తరాల వారసులు చేసిన వీర విఫల బానిస గాథే ఈ 'ఏడు తరాలు'.

బానిసత్వం చేసే నిగ్గరోడు(నల్లోడు) మనిషే
బానిసత్వం చేయించుకునే

ఆ తెల్లోడు మనిషే. అయినా ఎందుకు ఈ దాష్టీకం అంటూ వేల వేల ప్రశ్నలు మదిని తరుముతూనే ఉన్నాయి పుస్తకం చదువుతున్నంతసేపూ.

ఈ బానిసత్వం లోతులు ఎంతలా ఉంటాయంటే 'గర్భవతులైన నిగ్గరు బానిస స్త్రీలు పొరపాటు చేస్తే తెల్ల యజమానులు వేసే శిక్ష ఎలా ఉంటుందంటే ఆ గర్భవతి కడుపు పట్టే మాయిన నేల మింద గుంత

తీసి, ఆ స్త్రీని బోర్లా పడుకోబెట్టి ఆమె పిర్రల పైన, వీపు పైనా కొరుడాలతో కొట్టేంత'.

ఇలాంటివి కొన్ని కొన్ని చదువుతున్నప్పుడు పుస్తకాన్ని పడేసి వాళ్లు అనుభవించిన నరకయాతన తలుచుకుంటూ మౌనంగా ఉండిపొయిన సందర్భాలు కోకొల్లలు. అంతలా వెంటాడింది ఈ 'ఏడు తరాలు'.

ఈ పుస్తకం చదవకముందు అమెరికా

ఉత్తరాది, దక్షణాడి రాజ్యాల అంతర్యుద్ధం నేపథ్యంలో దక్షిణాది భూస్వామ్య కుటుంబపు నేపథ్యంగా మార్గెరెట్ మిచెల్ రాసిన 'గాన్ విత్ ద విండ్' (తెలుగులో ఎం.వీ. రమణా రెడ్డి 'చివరకు మిగిలింది') చదవడం బాగా ఉపయోగపడింది. నిజమే బానిసత్వం తప్పే, అయితే వాళ్లకంటూ స్వేచ్ఛ రాగానేవాళ్ల తెల్ల యజమానుల

పట్ల ఇంత అరాచకంగా ప్రవర్తించాలా అని ఆనాడు మదిలో మెదిలిన ఆలోచనలకు 'వాళ్ల స్వేచ్ఛను కర్కషంగా హరించి వేసిన, వేస్తున్న అదృశ్య శక్తి పట్ల అన్ని నాళ్లూ వాళ్లలో కూడుగట్టుకుపోయిన ఒక తిరుగుబాటు'గా ఈ పుస్తకం సమాధానమిచ్చింది.

కొన్ని పుస్తకాలు వేటాడతాయి. ఎంతలా అంటే ఇన్నాళ్లు మనం చదివినదంతా

ఏంటి? అని నీలో నీకు ప్రశ్నలు సంధించేంతలా. ఇది ఆ కోవకే చెందింది.

గిటార్ ను 'కో', గాంబియాలోని నదిని 'కాంబే బో లాంగ్' అంటూ తన పూర్వీకుడైన 'కిన్-టే' మూలాలు వెతుక్కుంటూ రచయిత చేసిన ప్రయత్నం అద్భుతం. ఈ పుస్తకం రాయడం కోసం పన్నెండేళ్ల పాటు పూర్వీకులు తిరిగిన మూలాల్లో నువ్వు చేసిన

ప్రయాణం ఈ పుస్తక రూపంలో సజీవంగా కనపడుతోంది.

'విజేతలే చరిత్రలు విరచించే వాస్తవం తాలూకు ఆనవాయితీని బద్దలు కొట్టడానికి యీ నా ప్రజల కథ తోడ్పడుతుందని ఆశిస్తాను' - రచయిత.

తోడ్పడటము మాత్రమే కాదు మిస్టర్ ఎలెక్స్ హేలీ... వెంటాడుతోంది కూడా.

#ఏడు_తరాలు #Roots

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling