ఆదిత్య శివశంకర కలకొండ Profile picture
తెలుగుభాష అభిమానిని , తల్లి తెలుగుభాషను బ్రతికించడానికి నావంతు ప్రయత్నం చేస్తున్న ఆశావాదిని... సినిమాలు, పుస్తకపఠనం, సంగీతం, సాహిత్యం ఇష్టమైనవి..

Oct 7, 2022, 41 tweets

వెండితెర చేసుకున్న పుణ్యం – #శంకరాభరణం

సరిగ్గా 41 ఏళ్ళ క్రితం 1979లో…..

"ఏంటి ఈ సినిమాలో ఎవరికి తెలియని ఓ ముసలాయన హీరోనా ?"

"హవ్వ, వేశ్య పాత్రను హీరోయిన్ గా చూపించడం ఏమిటో విడ్డూరం కాకపోతే"

"12 పాటలు పెడితే ఎవడు చూస్తాడు స్వామి"

"శాస్త్రీయసంగీతం మీద కథనా, నిర్మాత ఎవరో పాపం"

"మసాలాలు లేకుండా తీస్తారా, ఏంటి చిత్ర పరిశ్రమలో ఉండాలనే"

జె వి సోమయాజులు గారి జీవితంలో #శంకరాభరణం , #త్యాగయ్య సినిమాలు అద్భుతమనే చెప్పాలి.

శంకరాభరణం సినిమా గురించి ప్రకటన వచ్చినప్పుడు, షూటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీని వందసార్లకు పైగా డిస్ట్రిబ్యూటర్లకు వేసినప్పుడు నిర్మాత

ఏడిద నాగేశ్వర రావుగారు అందుకున్న వ్యాఖ్యలు ఇవి. అప్పుడప్పుడే తొలి అడుగులు వేస్తున్న ఆయనను ఇవేవి భయపెట్టలేదు. వ్యాపారం జరగక పెట్టుబడయినా వెనక్కు వస్తుందో రాదోనన్న అనుమానాల మధ్య తచ్చాడుతున్నారు. విశ్వనాథ్ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయే చిత్రం తీసిచ్చారని తనతో పాటు బృందం మొత్తానికి

తెలుసు. కానీ ఆ నమ్మకం బయటవాళ్లకు లేదు. అసలు విడుదల సవ్యంగా జరుగుతుందా లేదా అనే చర్చలు కొనసాగుతుండగానే ప్రముఖ పంపిణిదారులైన లక్ష్మి ఫిలిమ్స్ వాళ్ళు రెండు ఏరియాలు నిర్మాతకు వదిలేసి మిగిలినవి గంపగుత్తగా తక్కువ రేట్ కు కొనేసుకున్నారు. ఆ విధంగా పురిటి కష్టాలను తట్టుకుని శంకరాభరణం

1980 ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మొదటి వారం వసూళ్లు చాలా నామమాత్రంగా ఉన్నాయి. సగం హాళ్లు కూడా నిండటం లేదు. రెండో వారానికి తీసేయాల్సి రావొచ్చని ఫోన్లు వస్తున్నాయి. ఈ సినిమా ఆడుతున్న థియేటర్ల వద్ద చిన్న స్టేజిలు కట్టి ఇందులో పాటలను వేరే గాయకులతో పాడించేవారు.

ఇదేదో కొత్తగా ఉందని జనం వింతగా చూసి అవి నచ్చి టికెట్ కొని లోపలి వెళ్లేవారు. మెల్లగా మౌత్ టాక్ రావడం మొదలైంది. టికెట్లు తెగుతున్నాయి. సీట్లు నిండుతున్నాయి. దీన్ని ఎవడు చూస్తాడు లెమ్మని నిర్లక్ష్యం చేసిన బ్లాక్ టికెట్ రాయుళ్లు షిఫ్ట్ ల ప్రకారం డ్యూటీలు వేసుకుని మరీ జేబులు

నింపుకోవడం మొదలుపెట్టారు.

చినుకులు వరదలా మారినట్టు జనం శంకరాభరణం చూసేందుకు పోటెత్తడం మొదలుపెట్టారు. మాములుగా #ఎన్టీఆర్ స్థాయి హీరోలకు మాత్రమే కనిపించే విపరీతమైన రద్దీ #శంకరాభరణం థియేటర్ల వద్ద చూసి నోటమాటపడిపోయిన వారెందరో. పది రోజులైనా ఆడుతుందాని అనుమానం వెలిబుచ్చిన వారే కనీసం

ఇరవై సార్లైనా ఈ కళాఖండాన్ని చూడాల్సిందేనని తీర్మానించుకున్నారు. అలా మొదలైన ప్రభంజనం వందరోజులు దాటేసి ఏడాదికి పైగా అలా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఈ ప్రవాహానికి అడ్డుకట్ట పడలేదు. కాకపోతే వీక్షించే మాధ్యమం మారిందే తప్ప తరాలు మారినా శంకరాభరణం దర్శకులకైనా

ప్రేక్షకులైనా ఓ సినిమా భగవద్గీతగా నిలిచింది.

అంత గొప్ప కథేముంది ఇందులో ?

ఇది సినిమాగా తీద్దామని ఎవరైనా కథగా చెబితే రచయితని పైనించి కింది దాకా ఎగాదిగా చూడటం ఖాయం. సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడైన శంకర శాస్త్రి సాంఘిక ఉద్దేశాలకు వ్యతిరేకంగా తల్లి చేసే వృత్తి ససేమిరా ఇష్టం లేని

ఓ వేశ్య కూతురికి అండగా నిలబడతాడు. అప్పటికే బలాత్కారానికి బలైన ఆమె తనవల్ల ఆయనకు అప్రతిష్ట రాకూడదని భావించి దూరంగా వెళ్ళిపోతుంది. కాలచక్రంలో శంకరశాస్త్రి గారి వైభవం తగ్గిపోయి ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందుల్లో పడతారు. ఆ సమయంలో తనకు జీవితాన్నిచ్చిన గురువు కోసం వెనుకే ఉండి

తెలియనివ్వకుండా సహాయం చేస్తూ తన బిడ్డను ఆయన సంగీత వారసుడిగా అప్పగించి, శాస్త్రి గారితో పాటు ఆయన పాదాల వద్ద తనువు చాలించడంతో కథ కంచికి, బరువెక్కిన ప్రేక్షకుల హృదయాలు ఇంటికి చేరతాయి.

#జీవం_పోసిన_పాత్రలు

నిజానికి శంకరాభరణంలో గొప్ప కథ కన్నా మహోన్నతమైన పాత్రలు ఉన్నాయి. అవి ఎన్నో

పాఠాలను నేర్పిస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి దారులు వేస్తాయి. మనం చూసిందే ప్రపంచం, మనకు తెలిసిందే జ్ఞానం అనుకుంటూ అహం మధ్య పోరులో నిత్యం ఓడిపోయే మనం అసలు మనిషిగా బ్రతకాలంటే కావాల్సిన ప్రాధమిక లక్షణాలు ఏమిటనేవి ఈ సినిమా చూసి నేర్చుకోవచ్చు. ఇందులో నేల విడిచి సాము చేసే గారడీ

కమర్షియల్ అంశాలు ఉండవు. గుండెను సుతిమెత్తగా తాకే సన్నని దారపు పోగు లాంటి భావోద్వేగాలు ఉంటాయి. ఇందులో సగటు తెలుగు సినిమా హీరో హీరొయిన్లు ఉండరు. మన ఎదురింట్లోనో పక్క వసారాలోనో నిత్యం మనకు ఎదురయ్యే సగటు మనుషులు ఉంటారు. కానీ ఈ సినిమాకు స్థంభాల్లాంటి ఇద్దరి గురించి

ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి

#శంకరశాస్త్రి

విశిష్ట వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం. తనను ఇంతవాడిని చేసిన సమాజం కులకట్టుబాట్ల పేరుతో నిలదీస్తున్నా తాను చేసింది తప్పు కానప్పుడు ఎవరికి భయపడాల్సిన పనిలేదన్న ధృడ నిశ్చయం ఎంతటి వాడికైనా స్పూర్తినిస్తుంది. పాశ్చ్యాత సంగీత హోరులో

సంప్రదాయానికి తూట్లుపడి తన జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారినా నమ్మిన విలువలు వదిలి పెట్టకుండా కళాసరస్వతికి జీవితాన్ని అంకితం చేసిన చరితార్ధుడు శంకరశాస్త్రి. అందరూ పాపపంకిలంగా భావించే పడుపు కుటుంబానికి చెందిన యువతీని చేరదీసి మానవత్వానికి అర్థం చెప్పిన మహోన్నతుడు. ఆచార వ్యవహారాల పేరిట

ఇంట్లో వాళ్ళతో సహా ఊరంతా కాకులై పొడుస్తున్నప్పుడు చెక్కు చెదరకుండా తను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా వెళ్ళే శాస్త్రి ప్రయాణం ఎందరి గమ్యానికో దారి చూపుతుంది. చివరి శ్వాస వరకు సంగీతానికే అంకితమైపోయి రాజీ లేని బ్రతుకుకు సరైన నిర్వచనం చెప్పిన ఈ పాత్ర గురించే ఒక పుస్తకం రాయొచ్చు.

#తులసి

పేరుకు తగ్గట్టే పవిత్రమైన ఆలోచనలతో గంజాయి వనంలో చిక్కుకున్న ఆధునిక సీత. కన్నతల్లి సంపాదన మీద వ్యామోహంతో కూతురిని వేశ్యగా మార్చేందుకు సిద్ధపడినా దాన్ని ధీటుగా ఎదురుకుని సంగీత నృత్య కళల అపారమైన ప్రేమను వ్యక్తపరిచే మౌన యోగిణి. తన వల్ల అగ్నిహోత్రమంత పవిత్రమైన శాస్త్రి గారి

పరువుకు భంగం కలుగుతుందన్న క్షణమే అతనికి దూరంగా వెళ్ళిపోయి తిరిగి వచ్చాక దయనీయస్థితిలో ఉన్న గురువును చూసి తట్టుకోలేక తెరవెనుక నుంచే ఆయన క్షేమాన్ని తలచే ఉదాత్తమైన మహిళకు ప్రతిరూపం తులసి. కామ వాంఛతో రగిలిపోతున్న మృగాన్ని నిలువునా నరికిపారేసే అపరకాళిగా ఇంకో రూపాన్ని కూడా చూపిస్తుంది.

చిన్నపాటి ఎగుడుదిగుడులకే నూన్యతాభావంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఎందరో యువతులకు తులసి ఒక మార్గదర్శి

#నటవైదుష్యాల_తాండవం

ఒక గొప్ప సినిమా ప్రభావం నటీనటుల మీద ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి శంకరాభరణం కంటే మంచి ఉదాహరణ అక్కర్లేదు. #జెవి_సోమయాజులు గారిని ప్రతివారు తమ ఇంటి పెద్దగా

భావించే స్థాయిలో ఆయన అందరికి స్వంత మనిషి అయిపోయారు. తులసి లాంటి ఉదాత్తమైన పాత్ర పోషించిన #మంజు_భార్గవి ఆ తర్వాత ఆ పాత్ర పవిత్రతను కాపాడే ఉద్దేశంతో నృత్య కళాశాల నెలకొల్పి చాలా కాలం నటనకు దూరం అయ్యారు. చంద్ర మోహన్, అల్లు రామలింగయ్య, నిర్మలమ్మ, రాజ్యలక్ష్మి, సాక్షి రంగారావు

ఒకరా ఇద్దరా అనుభవంతో నిమిత్తం లేకుండా అందరూ శంకరాభరణంలో జీవించారే తప్ప అది నటనే అన్న ఊహ తమ తలంపుకు కూడా రానివ్వలేదు. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలను ఎప్పుడు కదిపినా వీళ్లందరి మొహాల్లో కనిపించే ఆ పులకింత కొలతకు అందనిది మాటల్లో చెప్పలేనిది.

#విశ్వనాథుని_విశ్వరూపం

దర్శకుడిగా అప్పటికే చేసిన

సినిమాల ద్వారా పేరు వచ్చినప్పటికీ శంకరాభరణం విశ్వనాథుడిని మరోసారి కొత్తగా ఆవిష్కరించింది. ఇందులో ఓ సన్నివేశంలో కోర్టులో కేసు గెలిచి నిర్దోషిగా బయటికి వచ్చిన తులసి మీద తల్లి తరఫున గూండా ఒకడు చెయ్యి వేసి లాక్కెళ్ళబోతాడు. అప్పుడే కొన్ని అడుగుల దూరంలో చేతికి గండపెండేరంతో ఆణువణువూ

దర్పం ఉట్టిపడుతున్న శంకరశాస్త్రి వాడివైపే తీక్షణంగా చూస్తాడు. అంతే వాడు క్రమంగా తులసి చేతిని మెల్లగా వదిలేస్తే, ఆమెను వెళ్లి బండిలో కూర్చోమని కళ్ళతోనే చెబుతాడు శంకరశాస్త్రి.

ఒక్క మాట లేకుండా దెబ్బ పడకుండా ఇంత హీరోయిజాన్ని ఒక ముసలి పాత్ర ద్వారా పండించే సీన్ ఒక్కటి చాలు ఎందుకు

శంకరాభరణంకు మాస్ బ్రహ్మరథం పట్టారో అర్థమవుతుంది. జీవితాన్ని గెలిచిన ఓ మహా #విద్వాంసుడికి, దానికి ఎదురీదుతున్న #వేశ్యకు ఓ పవిత్ర బంధాన్ని సృష్టించి సంగీతంతో ముడిపెట్టడమనే ఉదాత్తమైన ఆలోచన చిత్తశుద్దితో తెరకెక్కితే దాని ఫలితం #శంకరాభరణం అంత గొప్పగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు

అదృష్టవంతులు కాబట్టే దీని అమృతాన్ని అందుకుని మనసారా ఆశీర్వదించారు

#మహదేవన్ వారి సుస్వర సంగీత నైవేద్యం

కె. వి. మహదేవన్ పేరులో సాక్షాత్తు సదాశివుని కలిగి ఉన్న సామ వేద సంగీత నాద మూర్తి అందించిన సంగీతం తెలుగు సినిమా చిరస్థాయిగా నిలిచినంత వరకు సంగీత ప్రియుల, రసజ్ఞులైన వారి

గుండెల్లో మారుమ్రోగుతూనే ఉంటుంది. ఓంకారా నాదాను సంధానమౌ గానమూ, రాగం తానం పల్లవి, శంకరా నాదశరీరాపరా, దొరకునా ఇటువంటి సేవా అంటూ గాన గంధర్వులు #ఎస్పి_బాలసుబ్రమణ్యం గాత్రంలో ఊరువాడా వీధులన్నీ పులకరించిపోయాయి. శాస్త్రీయ సంగీతంలో ఇంత గొప్పదనం ఉందా అంటూ సామాన్యులు సైతం అచ్చెరువొందేలా

మామ కూర్చిన స్వరాలకు మధురామృతాలు అనే మాట చాలా చిన్నది. వేటూరి సాహిత్యం గురించి చెప్పాలంటే ఆకాశాన్ని దారపుపోగుతో కొలవడం లాంటిది. రెండు దశాబ్దాలకు పైగా డిజిటల్ విప్లవం రాక ముందువరకు గ్రామ్ ఫోన్ రికార్డులు ఆడియో క్యాసెట్లు అమ్ముడుపోతూనే ఉన్నాయంటే అందులో వీసమెత్తు అబద్దం లేదు.

ఇప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినా ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ లో శంకరాభరణంది ఎప్పటికీ చెక్కుచెదరని స్థానం

#తెరవెనుక_విశేషాలు

ముందు ఈ కథను #కృష్ణంరాజుకు వినిపించారు. కాని ఇమేజ్ దృష్ట్యా ఒకవేళ తనను ప్రేక్షకులు ఆదరించకపోతే ఇలాంటి గొప్ప సినిమాకు అన్యాయం జరిగినట్టు

అవుతుందని ఆయన సున్నితంగా తిరస్కరించారు. #అక్కినేని_నాగేశ్వరరావును కూడా సంప్రదింపులు జరుపగా శంకరశాస్త్రి ఆహార్యం ఆ ఠీవి, గాంభీర్యం, నడక, సాంప్రదాయ కలిగిన ఉత్తమ వర్ణ సంజాతుడైన విద్వాంసుని ఆవిష్కరణ మేకప్ లో తేలిపోవడంతో అక్కినేని కూడ పాత్రకు సరిపోనని తిరస్కరించాడు.

ఎక్కడో వైజాగ్ లో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం చేసుకుంటున్న సోమయాజులు గారికి ఆహ్వానం వెళ్ళింది. చిన్న మేకప్ టెస్ట్ తర్వాత ఎక్కువ ప్రయాస లేకుండా అయన ఓకే అయ్యారు

కమల్ హాసన్ కళ్యాణ రాముడు, శంకరాభరణం ఒకే రోజు విడుదలయ్యాయి. ఓపెనింగ్స్ దానికి బాగా వస్తే, లాంగ్ రన్ లో ఇది నిలబడి పోయింది

అంతకు ముందు నెలలో వచ్చిన అక్కినేని #ఏడంతస్తుల_మేడ సక్సెస్ ఫుల్ రన్ ని #శంకరాభరణం తీవ్రంగా ప్రభావితం చేసింది. కలెక్షన్స్ పరంగానే కాదు అవార్డుల విషయంలోనూ పూర్తిగా వెనక్కు నెట్టేసింది

శంకరాభరణం పుణ్యమాని మ్యూజిక్ టీచర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడి పిలల్లను వీళ్ళ దగ్గర చేర్చడం

మొదలుపెట్టారు తల్లితండ్రులు

ఛాయాగ్రహకుడు (కెమెరా వర్క్) చేసిన బాలు మహేంద్రకు దీని షూటింగ్ మధ్యలో దర్శకుడిగా అవకాశం రావడంతో దర్శక నిర్మాతల అనుమతితో ఆయన అసిస్టెంట్ కస్తూరి ద్వారా పని పూర్తి చేశారు

వేటూరి రాసిన అద్భుత సాహిత్యం సామాన్యులకు పూర్తిగా అర్థం కాకపోయినా పండిత పామర

అనే తేడా లేకుండా అందరూ చెవులు రిక్కించి మరీ ఈ పాటలను వినేవారు.

జాతీయ స్థాయి అవార్డులతో పాటు అత్యున్నతమైన నంది లాంటి రాష్ట్రీయ పురస్కారాలు ఎన్నో అందుకుందీ ఆణిముత్యం

ఫ్రాన్స్, మారిషస్, రష్యా, ఇటలీ లాంటి ఎన్నో దేశవిదేశాల చిత్రోత్సవాల్లో #శంకరాభరణంకు గొప్ప గౌరవం దక్కింది

తమిళ్ లో కూడా ఇంతే విజయం సాధించిన ఈ మాస్టర్ పీస్ ని తమిళనాడులో కొన్నేళ్ళ క్రితం రీ మాస్టర్ వెర్షన్ లో రీ రిలీజ్ చేశారు. మలయాళంలో పాటలు యధాతథంగా ఉంచి డైలాగ్స్ మాత్రమే డబ్బింగ్ చేశారు. అక్కడా ఏడాది ఆడింది.

అప్పట్లోనే నెల రోజులు అమెరికాలో శంకరాభరణం మ్యూజికల్ నైట్స్ నిర్వహిస్తే

ప్రవాసాంధ్రులు వెల్లువలా క్యు కట్టారు

#జంధ్యాల గారి సంభాషణలు ఈ సినిమాకు కంఠాభరణంగా నిలిచాయి. కేవలం పాతిక పేజీలు మాత్రమే ఉండే రైటింగ్ స్క్రిప్ట్ కోసం ఆయనకు ఎక్కువ సమయం పట్టింది. ఒకే దశాబ్దంలో #అడవిరాముడు లాంటి కమర్షియల్ మాస్ సినిమాకు #శంకరాభరణం లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ కు

రాయడం #జంధ్యాల గారికే చెల్లింది. రెండూ ఒకే ఫలితాన్ని అందుకోవడం కన్నా విశేషం ఏముంటుంది

అలనాటి విఖ్యాత విలేకరి "కాగడా శర్మగారు" శంకరశాస్త్రి, తులసి పాత్రలు పోషించి ఆర్టిస్టులు ఇక ముందు ఏ పాత్ర పోషించిన కూడా ఈ క్యారెక్టర్ సరితూగవు మరియు ఆ ఇద్దరు పాత్ర కోసమే పుట్టారని

రూఢి అయింది అని అన్నారు. మును ముందు ప్రేక్షకుల ఏ పాత్ర వారివురు చేసినా వాళ్లు మదిలో ఆ క్యారెక్టర్ లు ముద్ర వేసుకొన్నాయి అలాంటి పాత్రలే వారి నొప్పుతాయి కాని మిగతా సినిమాల్లో ఏ పాత్ర చేసిన వారి ఇద్దరిని ఒప్పుకోరన్న విషయం నిష్కర్షగా నిష్పక్షపాతంగా ఉన్నదున్నట్లు సినిమా సమీక్షలో

నిర్ధారణ చేసారు. ఒక్కసారి ఆలోచించండి తరువాత ఆ ఇద్దరు క్యారెక్టర్లు పరిశ్రమలో ఎలా నిలదొక్కుకొన్నారు మీకే తెలుసు

#చివరిగా_చెప్పాలంటే:

అంత అత్భుతంగా ఈ సినిమా నిలిచిన సినీ చరిత్రలో, ఒక వెలితి సుస్పష్టంగా కనిపిస్తుంది. అది #సుశీలమ్మ ప్లేబ్యాక్ పాడగా పోవటం ఒక పెద్ద డ్రాబాక్. మరి ఏదో

పనిగట్టుకుని సుశీల గారికి ఈ సినిమాకి పని చేయించకుండా ఉన్నారని అందరికి తెలుసు.

#దేవతలు అమృతం తాగడం వల్లే మరణం లేకుండా నిత్య యవ్వనంతో తొణికిసలాడుతూ ఉంటారని పురాణాలు చెబుతాయి. కానీ వాటికి ఆధారాలు లేవు. #తెలుగు_సినిమా నిత్య సజీవంగా ఉండటానికి #శంకరాభరణం లాంటి వెండితెర అమృతాలు అరుదుగా

వస్తుంటాయి. అందుకే తరాలు మారినా సాంకేతికత అభివృద్ధి చెందినా వాటికి కాల దోషం ఉండదు. చూసిన ప్రతిసారి అద్వితీయమైన పులకరింతను కలిగిస్తాయి. పరవశాల డోలికల్లో మనల్ని ముంచెత్తుతాయి. అనిర్వచనీయమైన అనుభూతిని పదే పదే ఆస్వాదించాలంటే #శంకరాభరణంను చూడాల్సిందే. ఇలాంటి అత్యున్నతమైన కళావిలువల

సాగరంలో మళ్ళీ మళ్ళీ మునకలు వేయాల్సిందే. నదులకు పుష్కరాలు పన్నెండేళ్లకోసారి. కానీ సినిమా ప్రేమికులకు ఇలాంటి సినిమా చూసిన ప్రతి సందర్భమూ పుష్కరం కన్నా ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుంది. కావాలంటే ఇంకో సారి చూడండి. కాదని అనలేరు..

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling