ఆదిత్య శివశంకర కలకొండ Profile picture
తెలుగుభాష అభిమానిని , తల్లి తెలుగుభాషను బ్రతికించడానికి నావంతు ప్రయత్నం చేస్తున్న ఆశావాదిని... సినిమాలు, పుస్తకపఠనం, సంగీతం, సాహిత్యం ఇష్టమైనవి..

Oct 7, 2022, 11 tweets

#నల్లీనది #పచ్చడి
- డా. జి.వి పూర్ణచందు గారు
ఆయుర్వేద వైద్య నిపుణులు..

"నల్లీనదీ సంయుక్తం
విచారఫలమేవచ
గోపత్నీ సమాయత్తం
గ్రామ చూర్ణంచ వ్యంజనం" (చాటువు)

ఇది తెనాలి రామకృష్ణ కవి రాసినది. ఇందులో ఓ గొప్ప వంటకం తయారీని అతి రహస్యంగా చెప్పారు. ఒక్కక్క పాదాన్నే జాగ్రత్తగా

అర్ధం చేసుకోవాలి:
1. ‘నల్లీ నదీ సంయుక్తం’ నల్లీనది అంటే నల్లి+ఏరు=నల్లేరుకాడలతో ఈ వంటకం తయారౌతోంది.
2. “విచారఫలమేవచ” విచార ఫలాన్ని తెలుగులోకి మారిస్తే చింతపండు.
3. “గోపత్నీ సమాయత్తం” –గో+పత్ని అంటే, ఆవు+ఆలు=ఆవాలు.
4. “గ్రామచూర్ణం” అంటే ఊరుపిండి. రుబ్బిన పిండిని ఊరుపిండి,

ఊరుబిండి లేక ఊర్బిండి అంటారు.

ఈ మొత్తానికి భాష్యం ఏమంటే, లేతనల్లేరు కాడలు తీసుకుని, కోణాలు చెక్కేసి చింతపండు, ఆవపిండి కలిపి మెత్తగా రుబ్బితే అది నల్లేరు కాడలపచ్చడి అవుతుందని! తింటానికి ఇంకేమీ దొరకలేదా...? నల్లేరుకాడలు తిని బతకాలా..? అనకండి. నల్లేరుకాడలు, బూడిద గుమ్మడికాయలు,

అరటి దూట, అరటి పూలు, అరటి దుంపలు, కలువ దుంపలు, సొరమొక్క ఆకులు ఇలాంటి వాటిని మనలో చాలామంది వండుకోదగిన కూరగాయలనే విషయాన్ని మరిచిపోయారు. #తమిళులు వీటిని శ్రద్ధగా తింటున్నారు.

#నల్లేరు కాడలు రోడ్డు పక్కన కంపల మీద పాకుతూ పెరుగుతాయి. వృక్షశాస్త్ర పరంగా “సిస్సస్ క్వాడ్రాంగ్యులారిస్”

అంటారు దీన్ని. షుగరు వ్యాధి, ఎలర్జీ వ్యాధులు, స్థూలకాయం, చెడ్ద కొలెస్ట్రాల్ పెరగటం, ఆస్తమా, ఎముకలు మెత్తబడిపోవటం, కీళ్లవాతం, గౌట్ వ్యాధి, మొలలు ఈ వ్యాధుల్లో ఇది పనిచేస్తోందని ‘హెల్త్ లైన్’ 2019 మే 15 సంచికలో ఒక నివేదిక ప్రచురితం అయ్యింది.

స్త్రీబాలవృద్ధులందరికీ ఔషధమే ఇది!

విషదోషాలకు విరుగుడుగా పనిచేస్తుంది. సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. లేత నల్లేరు కాడలకు కడుపులో నొప్పి తగ్గించే గుణం ఉంది. ఆగకుండా వచ్చే ఎక్కిళ్ళు తగ్గుతాయి. మొలల తీవ్రతను తగ్గిస్తుంది. విరేచనం అయ్యేలాగా చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.

శరీరానికి కాంతినిస్తుంది. అజీర్తిని, కఫ దోషాలను, కీళ్లవాతాన్ని, గౌట్ వ్యాధిని పైత్యాలను తగిస్తుంది. మెనోపాజ్ వయసులో ఉన్న స్త్రీలు నల్లేరు కాడల్ని తప్పనిసరిగా తింటూ ఉండటం మంచిది. ఆ వయసులోనే ఎముకలు శక్తినీ, ధృఢత్వాన్నీ కోల్పోయి గోగుపుల్లల్లాగా తయారు కాకుండా నిలుపుతుంది.

పళ్లలోంచి, చిగుళ్లలోంచి రక్తం కారుతున్న స్కర్వీ వ్యాధిని కూడా ఇది తగ్గిస్తుంది. అతిగా తింటే వేడి చేస్తుంది. చలవ చేసే వాటితో కలిపి తింటే మంచిది. కొన్ని శరీరతత్వాలకు సరిపడకపోవచ్చు. చూసుకుని తినాలి.

“cissus is known to have gum forming properties” అంటే నల్లేరుకు కడుపులో జిగురును

తయారుచేసే గుణం ఉంది. దీనిని భోజనంలో ముందుగా తీసుకుంటే కడుపు నిండిన భావన కలిగిస్తుంది. తద్వారా స్థూలకాయాన్ని తగ్గిస్తుందని ఆధునిక పరిశోధనలు చెప్తున్నాయి.

ఎముకలు విరిగినచోట అనుభవం మీద కట్లు కట్టే వారిలో చాలామంది నల్లేరు గుజ్జును పట్టించి కట్టు కడుతుంటారు.

నల్లేరులో కాల్షియమ్ ఆగ్జలేట్స్, కెరోటీన్ బాగా ఉన్నాయి. మూత్రంలోంచి కాల్షియం ఆగ్జలేట్స్ పోతున్నవారు తప్ప అందరూ ఈ నల్లీనది పచ్చడి తినవచ్చు.

మినప్పండిని రుబ్బి అందులో ఈ పచ్చడి కలిపి వడియాలు పెడతారు.

‘చాదువడియా’ లంటారు వీటిని. నేతిలో వేయించి తింటే రుచిగా ఉంటాయి. అట్లు పోసుకోవచ్చు. ఇలాంటివి వదులుకుంటే, సాంస్కృతిక వారసత్వాన్నే కాదు, సాంస్కృతిక సంపదను కూడా కోల్పోయిన వాళ్ళం అవుతాం.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling