ఆదిత్య శివశంకర కలకొండ Profile picture
తెలుగుభాష అభిమానిని , తల్లి తెలుగుభాషను బ్రతికించడానికి నావంతు ప్రయత్నం చేస్తున్న ఆశావాదిని... సినిమాలు, పుస్తకపఠనం, సంగీతం, సాహిత్యం ఇష్టమైనవి..

Oct 22, 2022, 6 tweets

#బీద పుట్టుక..

వాడు పుడితే
ఇరుకు తడికిల్లు ఖాళీ లేక మూలిగింది...!!
వాడు కడుపు తడుంకుంటే
పేగుల్లో విశ్వం విశ్వరూపం దాల్చింది..!!
వాడు బట్ట కడితే,
వెలుతురూ, గాలీ వంటిమీద కొట్లాడుకున్నాయి..!
వాడు పడుకుంటే,
గోనేపట్టా, ఇంటికప్పూ పడీ పడీ నవ్వుకున్నాయి..!
చెరువుగట్టు మీద నిలిచి

“నీళ్ళో” అని అరిచాడు..
చెరువు ప్రతిధ్వనించింది..
అడవిలో కూర్చుని
“కూడో” అని పొలికేక పెట్టాడు..
అడవిలో వెన్నెల కాచింది...
దొర్లే పేలికలు చుట్టుకుంటే
పొడుగు కొమ్ములతో ఎద్దు పొడిచింది..
తాటాకు క్రింద తల దాచుకుంటే
మొరట గిట్టలతో దున్న తొక్కింది..

రాలిపడ్డ మెతుకులు తినబోతే
కోరపళ్ళతో కుక్క కరిచింది..
ఊపిరి లేక యాలగిలబడితే
బ్రతికుండగానే పీక్కుతింటుంది నక్క..
శబ్ధంలేని నోరు తెరిచి
బలం లేని చేతులెత్తి
చూపులేని కళ్ళు విప్పి
అరిస్తే,
పిలిస్తే,
చూస్తే,
మబ్బుముక్క ఘోషించింది
మట్టిగడ్డ రోదించింది

సూర్యుళ్ళాంటి ఎర్రకళ్ళతో
పొద్దుట్నుంచి సాయంకాలం దాకా
ఆకాశం చూస్తూ రోదిస్తూ
చెమటను పేలిస్తే
చైతన్యం కూరిస్తే
బిగించిన పిడికిట్లో
బంగారం మొలిచింది..
మట్టిని పట్టుకుంటే
మాణిక్యం పడింది..
రంకేసిన ఎద్దు
తోకముడిచింది..!!
తొక్కిన దున్న
తల వంచింది.. !!

మొరిగిన కుక్క
కాలు నాకింది.. !!
పీకిన నక్క
పళ్ళికిలించింది.. !!
ఈ నాలిగింటినీ అడ్డంగా నరకాలని
ఎత్తిన గండ్ర గొడ్డలి
ఏడుస్తుంటే
వాడు పైకి చూశాడు..
ఆకాశం కుండపోతగా కన్నీరు కురిసింది..
నేలంతా కన్నీరు..
నింగంతా కన్నీరే..
కన్నీటితో పొలమంతా
కడిగిన ముత్యంలా ఉంది.

కన్నీటితో బ్రతుకంతా
కడిగిన పుణ్యంలా ఉంది..!!
ఎద్దు చుట్టుకున్న బట్ట,
దున్న వున్న పాక
కుక్క తినే కూడు
నక్క పొందే గూడు
వాడు కొనిపెట్టాడు..
వాడు నిలబెట్టాడు..
ఇంతకంటే మహితాత్ముడు
ఉంటాడా..??
అదే వాడు..
ఓ బీదవాడు..
బడుగువాడు..
బలహీనమైన వాడు.. !!

రచన : అన్నిబోయిన బాబీ..

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling