ఆదిత్య శివశంకర కలకొండ Profile picture
తెలుగుభాష అభిమానిని , తల్లి తెలుగుభాషను బ్రతికించడానికి నావంతు ప్రయత్నం చేస్తున్న ఆశావాదిని... సినిమాలు, పుస్తకపఠనం, సంగీతం, సాహిత్యం ఇష్టమైనవి..

Sep 24, 2022, 18 tweets

టెన్నిస్ చరిత్ర తన పొత్తిళ్లలో పదిలం గా దాచుకోవాల్సిన క్షణాలివి. మేరునగధీరుల్లా 20 ఏళ్లకు పైగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలిన పోరాట యోధులు ఒకరి కోసం ఒకరు కంట తడి పెట్టిన క్షణాలివి. గుండెలోతుల్లో గూడుకట్టుకున్న భావోద్వేగం.. తెరలు తెరలుగా కంటిని కమ్మేస్తున్న వేళ..

ప్రపంచాన్ని మరిచి ఏడ్చేశారు ఇద్దరూ. వాళ్ల ప్రభంజనానికి ఎర్రమట్టి కోర్టులు సాగిలపడ్డాయి. పచ్చికమైదానాలు పాహిమాం అన్నాయి. అయితే నువ్వు లేదంటే నేను ఇలానే సాగింది వాళ్ల కెరీర్ అంతా. ఆ తర్వాత నవతరం, యువరక్తం దూసుకువచ్చినా సీనియర్లుగా ఈ ఇద్దరి వాడీ వేడి ఎక్కడా తగ్గలేదు. పడిన ప్రతీసారి

కెరటాల్లా లేచారు. ఆడేది వేరే దేశాలకు కావచ్చు. మైదానంలో దిగితే ఇద్దరూ బద్ద శత్రువులే కావచ్చు. కానీ ఆట ముగిసిన ఆ మరుక్షణం ఆ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. #రోజర్_ఫెదరర్, #రఫెల్_నాదల్.. టెన్నిస్ ను ఇష్టపడే ఇప్పటి తరం అభిమానులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేర్లు ఇవి.

భావోద్వేగంతో వీడ్కోలు ప్రసంగం :

మైదానంలో ఆడినంత కాలం బద్ద శత్రువుల్లా, కోర్టు బయట జీవిత కాల స్నేహితుల్లా తిరిగిన ఈ ఇద్దరూ, లావెర్ కప్ లో చివరి మ్యాచ్ తర్వాత పెట్టుకున్న కన్నీళ్లు చూసి క్రీడాభిమానులు కదిలిపోయారు. కారణం టెన్నిస్ గ్రేట్ రోజర్ ఫెదరర్ కు ఇదే లాస్ట్ మ్యాచ్.

41 ఏళ్ల వయస్సులో 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత ఆటకు వీడ్కోలు ప్రకటించిన తర్వాత ఫెడెక్స్ #లావెర్_కప్ లో చివరి మ్యాచ్ ను తన జీవితకాల ప్రత్యర్థి రఫేల్ నాదల్ తో కలిసి ఓ జట్టుగా ఆడాడు. విధి వైచిత్రి ఏంటంటే మ్యాచ్ లో ఓడిపోయారు ఫెదరర్, నాదల్. ఇక అంతే నాదల్ ఏడుస్తూనే ఉన్నాడు.

రోజర్ అతన్ని సముదాయించాడు. తన ఫేర్ వెల్ స్పీచ్ ను ప్రారంభించాడు. ఎప్పుడైతే తన కుటుంబం, తన ప్రత్యర్థి #రఫేల్_నాదల్ ప్రస్తావన వచ్చిందో, #రోజర్_ఫెదరర్ కూడా భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. ఏడు నిమిషాల తన ప్రసంగాన్ని కన్నీళ్లతోనో కొనసాగించాడు, ముగించాడు. మరో వైపు రోజర్ మాట్లాడుతుంటే

వెనక కూర్చున్న నాదల్ కన్నీటి పర్యంతమవుతూనే కనిపించాడు. వీళ్ల తరంలోనే గ్రేట్స్ గా ఎదిగిన నొవాక్ జకోవిచ్, ఆండీ ముర్రే చప్పట్లతో ఫెదరర్ ను ప్రశంసిస్తున్నా, నాదల్ కు ఫెదరర్ కు ఉన్న బంధం వేరే. అందుకే అభిమానులు ఈ దృశ్యాలు చూసి కదిలిపోతున్నారు. సోషల్ మీడియా నాదల్, ఫెదరర్ ఎమోషనల్

వీడియోలతో షేక్ అయిపోతోంది.

సాహో స్విస్ దిగ్గజం :

స్విస్ ఆటగాడిగా ఫెడరర్ 1998లో ప్రొఫెషనల్ గా మారాడు. తన కెరీర్ లో 20 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచాడు. అందులో 8 #వింబుల్డన్. ఓపెన్ ఎరా మొదలయ్యాక ఏ ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడు అందుకోని ఫీట్ ఇది.

ఆరుసార్లు #ఆస్ట్రేలియా_ఓపెన్, ఐదు సార్లు #యూఎస్_ఓపెన్ గెలుచుకుని రికార్డు నెలకొల్పాడు. 2009లో ఫ్రెంచ్ ఓపెన్ ను గెలుచుకోవటం ద్వారా కెరీర్ గ్రాండ్ స్లామ్ ను పూర్తి చేసిన అరుదైన ఆటగాడు, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్. తన కెరీర్ లో ఏకంగా 310 వారాల పాటు వరల్డ్ నంబర్ 1 ర్యాంక్ లో ఉన్నాడు

కెరీర్ లో ఎన్నో సార్లు మోకాళ్లకు శస్త్రచికిత్సలు జరిగాయి. నెలల పాటు మైదానానికి దూరంగా గడిపాడు. కానీ గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చేవాడు. ఆ సర్జరీలే లేవంటే ఫెదరర్ ఇంకెంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించేవాడో. 24 ఏళ్ల కెరీర్ లో 100 పైగా టైటిళ్లు, వెయ్యికి పైగా మ్యాచ్ విజయాలు సాధించిన

ది గ్రేట్ ఇక సెలవంటూ టెన్నిస్ ఆటకు వీడ్కోలు పలికాడు.

మట్టికోర్టు మహారాజు :

అనుభవంలో ఫెదరర్ కంటే రఫేల్ నాదల్ చిన్నోడే. కానీ ఆటలో మాత్రం తక్కువ వాడేం కాదు. 2001 లో ప్రొఫెషనల్ గా మారిన నాదల్, ఇప్పటివరకూ 22 గ్రాండ్ స్లామ్స్ సింగిల్స్ టైటిళ్లు గెలుచుకున్నాడు. అందులో

14 #ఫ్రెంచ్_ఓపెన్ వే. అందుకే రఫేల్ నాదల్ ను మట్టి కోర్టు మహారాజు అంటారు. ఎర్రమట్టి కోర్టులో తనను కొట్టే ఆటగాడు ఇంకా పుట్టలేదు. ప్రత్యేకించి మట్టి కోర్టులో రఫేల్ ను ఓడించేందుకు ఫెదరర్ చూపించే పోరాటం, వింబుల్డన్ లో స్విస్ దిగ్గజాన్ని ఓడించేందుకు స్పెయిన్ బుల్ వేసిన రంకెలు,

ఆహా ఈ తరంలో టెన్నిస్ ఆటను చూసిన వారెవ్వరికీ మర్చిపోలేని అనుభూతి. 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న నాదల్, నాలుగు సార్లు యూఎస్ ఓపెన్, రెండు సార్లు వింబుల్డన్, రెండు సార్లు ఆస్ట్రేలియా ఓపెన్ లు కైవసం చేసుకున్నాడు. టెన్నిస్ చరిత్రలో ఇప్పటివరకూ నలుగురు ఆటగాళ్లు మాత్రమే

డబుల్ కెరీర్ గ్రాండ్ స్లామ్ ను అందుంటే, అందులో #రఫేల్_నాదల్ ఒకడు. తన కెరీర్ లో 209 వారాల పాటు నెంబర్ వన్ గా ఉన్నాడు రఫేల్ నాదల్.

నిప్పు, నీరు, ఓ దోస్తీ :

రోజర్ ఫెదరర్, రఫేల్ నాదల్ ఇద్దరూ తమ కెరీర్ లో 40 మ్యాచ్ లో తలపడ్డారు. అందులో 14 గ్రాండ్ స్లామ్ టోర్నీల్లోనే అంటే

అర్థం చేసుకోవటం పోరాటం ఏ స్థాయిలో ఉండేదో. 24 సార్లు నాదల్ గెలిస్తే..16 సార్లు ఫెదరర్ గెలిచాడు. అందుకే ఫెదరర్ తనకు ఇష్టమైన ప్రత్యర్థి ఆటగాడు అంటే నాదల్ అనే చెబుతాడు. ఆశ్చర్యకరంగా ఇద్దరి ఎత్తు, బరువు ఒకటే. ఇద్దరూ 6.1 అడుగులు ఆజానుబాహులు. ఇద్దరి బరువు 85 కిలోలు. కానీ రోజర్ ఫెదరర్

ప్రధాన బలం అతని ఫోర్ హ్యాండ్ షాట్. సాధారణంగా ఫెదరర్ ఒంటి చేత్తోనే ఆడతాడు అది కూడా కుడి చేత్తోనే. మిగిలిన క్రీడాకారులతో పోలిస్తే ఫెదరర్ ఆట చాలా ఫ్రొపెషనల్ గా కనబడటానికి కారణం అదే. కానీ నాదల్ ప్రధాన బలం బ్యాక్ హ్యాండ్ షాట్. టెన్నిస్ బంతి తనను దాటి వెళ్లిపోయే సమయంలో చేతులు వెనక్కి

నుంచి లాగుతూ పవర్ ను జనరేట్ చేస్తాడు నాదల్. ఎడమచేతి ఆటగాడైన నాదల్ ఆడేప్పుడు రెండు చేతులతో షాట్ ను కొడతాడు. అదే అతడిని ఛాంపియన్ గా నిలిపింది. టెక్నికల్ గా చూస్తే నాదల్ స్ట్రాంగ్, ప్రొఫెషనల్ గా చూస్తే ఫెదరర్ స్ట్రాంగ్. ఇద్దరూ ఆల్ టైం గ్రేట్స్. ఒకరు ఎక్కువా కాదు ఒకరు తక్కువ కాదు.

కానీ నెంబర్స్ పరంగా తన కంటే తక్కువైన #ఫెదరర్ ఆటకు వీడ్కోలు పలుకుతున్న సమయంలో #నాదల్ కూడా పెట్టిన కన్నీళ్లు వాళ్లిద్దరి బంధం ఆటకంటే గొప్పదని చెప్పకనే చెబుతోంది. ఆ స్నేహం దేశాలు దాటి, పరిధులు దాటి, ఆటను దాటి భావితరాలకు స్ఫూర్తిమంతంగా నిలిచింది.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling