ఆదిత్య శివశంకర కలకొండ Profile picture
తెలుగుభాష అభిమానిని , తల్లి తెలుగుభాషను బ్రతికించడానికి నావంతు ప్రయత్నం చేస్తున్న ఆశావాదిని... సినిమాలు, పుస్తకపఠనం, సంగీతం, సాహిత్యం ఇష్టమైనవి..

Oct 5, 2022, 7 tweets

దసరా ప్రత్యేకం - విజయదశమి ప్రత్యేకం - నటరత్నకు నివాళి, వీరార్జునుడిగా అన్నగారు #యన్టీఆర్

వాఖ్యనం కీ.శే.లు శ్రీధర్ ముప్పిరాల గారు..

అర్జునుడు... వీరార్జునుడు... బీభత్సుడు..!!కురువంశోద్ధారకుడి పాత్రలో అన్నగారి రూప లావణ్య విజయ విలాసాలు అపూర్వాలు!!

త్రిదశపాలతనూజుని గా ముచ్చటగా

అన్నగారు రాణించిన మూడు చిత్రాలను ముచ్చటించుకుందాం.

అమరేంద్ర తనయునిగా అన్నగారి వీర విజృంభణకు పరాకాష్ట #నర్తనశాల!! త్రినేత్రునెదిర్చి ఆ దేవదేవునిచే పాశుపతాస్త్రము పొందిన విజయుని అమరలోకానికి అతిథిగా ఆహ్వానిస్తాడు దేవేంద్రుడు. ఆ సన్నివేశంలో అన్నగారి వీరోత్సాహము, పాకారి

అర్థ సింహాసనాలంకరణ, ఊర్వశిని తిరస్కరించి శాపగ్రస్తుడు అయిన సన్నివేశాలలో ఆ చెదరని ఆత్మవిశ్వాసము, ఆ ధీరోద్ధత ఆయన ముఖారవిందంలో ప్రతిఫలించిన తీరు అమోఘము. తదుపరి గోగ్రహణ సందర్భంలో వెనుతిరిగి పారజూచిన ఉత్తరకుమారునికి ధైర్యాన్నిచ్చి.. "శతృసంహార సమయం లో నీ ధనస్సు నా బీభత్స వీర విహారాన్ని

భరించలేదు! దానితో విజయం సాధించటం కష్టం.

సతతరత్న సంస్థూయమాన పటిష్టమైన అర్జునుని గాండీవం అందులో ఉంది. అందుకో!!"... గాండీవాన్ని అందుకున్నంత నిజరూపుడైన పార్థుని రూపరేఖా విలాసాలు, దేవదత్త పూరణము, గురుదేవులకు, పితామహులకు నమస్కారబాణ సమర్పణము, రాధేయ, రారాజ గర్వభంగము.. ఈ సన్నివేశాలలో

అన్నగారి అభినయము మాటలకందనిది. ప్రేక్షకలోకము (కురు సైన్యము తో పాటుగా) సమ్మోహితమైపోతుంది!! ఏమా అందము.. ఏమా వీరము!! నభూతో!! భీష్ముల వారన్నట్టు "అందుకే ఆ చిరంజీవి జనప్రియుడైనాడు!" అనే డైలాగ్ అక్షరసత్యము. ఆ కోరమీసము, నుదుటన నామము చాలు.. ఆ ముఖారవిందములో కవ్వడి కనిపిస్తాడు.

ఆహా.. ఏమి రూపమయ్యా మీది!!

ఇలా ఒకే పాత్రలో, వివిధ అంశాలను ఆయా సందర్భానుసారంగా అన్నగారు అర్జునుని పాత్రను ఆవిష్కరించిన రీతి అనన్యసామాన్యము.

ఆ మహానటుని అభినయ విస్తృతి, పరిధులెరిగిన ఆ అభినయ కౌశల్యము ఏమని వర్ణించగలం!!

ద్రోణుని లాంటి గురువు శిష్యరికంలో ఆరితేరినాడు ఆ సవ్యసాచి.. మరి

కవిసామ్రాట్ లాంటి ఉత్కృష్ట గురువుల శిష్యరికంలో ఆరితేరినాడీ తెలుగు భాషాశిలీముఖప్రయోగ నట సవ్యసాచి!!

"నేడు దశమి.. విజయ! దశమి.." అని గాండీవమందిన వీరార్జుని పాత్రలో మన మనస్సులు గెలిచిన అన్నగారికి ఈ విజయ దశమి పర్వదినాన స్మరించుకుందాం!!

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling