#వేటూరి #ఆణిముత్యాలు
తెలుగులో కవిత్వం చెప్పిన వాళ్ళల్లో దాదాపు సగంమంది పైన #గోదావరి మీద పద్యాలూ, గేయాలూ, పాటలూ వ్రాశారు. ఇదే సినిమాలలో కూడా జరిగింది. ఎంతమంది కవులు ఎంత గొప్పగా వ్రాసినప్పటికీ శ్రీనాథునికి మాత్రమే గోదావరి విషయంలో అగ్రతాంబూలం. అలాగే సినిమా పాటలలో వేటూరికి మాత్రమే
అగ్రాసనం. దాదాపు 1600కి.మీ. గోదావరి ప్రయాణం. ఈ ప్రయాణాన్నంతటినీ ఒక్క పాటలో ఇమిడ్చేసిన ఘనత కేవలం వేటూరిదే!!
వేటూరి ఎంతటి నేర్పరి...!!! ఈ పాటతో భౌగోళికంగా మొత్తం గోదావరి పరిక్రమ చేయించేశారు. గోదావరి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు పారింది ఏ ఏ సీమల్లో ఏ ఏ కవులకు ప్రాణం పోసింది,
ఏ ఏ సంస్కృతులకు ఊపిరులూదింది ఒక్క పాటలో వివరించేశారు వేటూరి.
గోదావరిని కాళేశ్వరం మొదలగు స్థలాల్లో చూస్తే ఒకలా, కోనసీమ దగ్గర చూస్తే మరొకలా అనిపిస్తుంది. ధవళేశ్వరం దగ్గర గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప అని ఏడుపాయలుగా విడిపోతుంది. సప్తఋషులగా పిలవబడే ఆ పాయలు
గోదావరిని అంతర్వేది నరసింహుడి సమక్షంలో కన్యాదానం చేయగా బంగాళాఖాతంతో సంగమిస్తుంది.
'మహారాష్ట్ర లావణీల మంజీరం కట్టి' అన్నచోట, 'సప్త ఋషులు సాగనంప సాగరాన మెట్టి' అన్నప్పుడు తన కలాన్ని బహుశా అమృతంలో అద్ది ఉంటారేమో వేటూరి. ఇంతటి చరిత్రనూ నాలుగు నిముషాలలో సరళమైన భాషలో, అలతి అలతి పదాలలో
ఎంతో అందంగా గోదావరిని వర్ణించగల గొప్పకవి వేటూరి గారు. ఇది వింటున్నంత సేపూ మనసు గోదావరి ప్రవాహంలా గలగలా పరుగులు పెడుతుంది. గోదావరిని చిరంజీవి, సౌభాగ్యవతి, మా ఇంటి మాలక్ష్మిగా, తల్లిగా, ఇలవేల్పుగా కీర్తించారు వేటూరి. ఈ పాటకు బాలూ గారు తన గాత్రంతో ప్రాణం పోయగా, కె.వి. మహదేవన్ గారు
సంగీతం అందించారు. శ్రీనాథుడు భీమఖండంలో చేసినదంతా వేటూరి ఈ పాటలో చేసేశారు. సినిమా ప్లాప్ కావడంతో ఇంత మంచి పాట ప్రజాదరణకు నోచుకోలేదు.
పల్లవి:
చిరంజీవి గోదావరి పడమటింట పుట్టింది
సౌభాగ్యవతి తాను తెలుగునాట మెట్టింది
దక్షిణాది గంగగా దయతో ఉప్పొంగుతూ...
కల్యాణిగా తాను కడలిలో కలిసింది
మా ఇల్లు అత్తిల్లుగా... చల్లగా వర్ధిల్లు గోదావరి
మా ఇల్లు అత్తిల్లుగా... చల్లగా వర్ధిల్లు గోదావరి
చరణం 1:
నాసికా త్రియంబకాన గోముఖాన పుట్టి
మహారాష్ట్ర లావణీల మంజీరం కట్టి
నాసికా త్రియంబకాన గోముఖాన పుట్టి
మహారాష్ట్ర లావణీల మంజీరం కట్టి
సీతమ్మ సిగలోనా మందారం చుట్టి...
శబరి తల్లి ఫలహారం రామయ్యకు పెట్టి
భవభూతి శోకమై... శ్రీనాథుడి సీసమై
మా ఇంటి మాలక్ష్మివై తల్లివై... వర్ధిల్లు గోదావరి
మా ఇంటి మాలక్ష్మివై తల్లివై... వర్ధిల్లు గోదావరి
చరణం 2 :
చాళుక్యుల వైభవాలు జగమంతా చాటి
నన్నయ్యకు తెలుగు కవిత ఉగ్గుపాలు పట్టి
చాళుక్యుల వైభవాలు జగమంతా చాటి
నన్నయ్యకు తెలుగు కవిత ఉగ్గుపాలు పట్టి
కోనసీమ పచ్చదనం కోకలుగా చుట్టి
సప్తఋషులు సాగనంప సాగరాన మెట్టి
రామదాసు కీర్తనై.. పంచవటి గానమై
మా పాలి ఇలవేల్పువై వెల్లువై... వర్ధిల్లు గోదావరి
మా పాలి ఇలవేల్పువై వెల్లువై... వర్ధిల్లు గోదావరి
చిరంజీవి గోదావరి పడమటింట పుట్టింది
సౌభాగ్యవతి తాను తెలుగునాట మెట్టింది
దక్షిణాది గంగగా దయతో ఉప్పొంగుతూ
కల్యాణిగా తాను కడలిలో కలిసింది
మా ఇల్లు అత్తిల్లుగా చల్లగా... వర్ధిల్లు గోదావరి
మా ఇల్లు అత్తిల్లుగా చల్లగా... వర్ధిల్లు గోదావరి
చిత్రం : గోదావరి పొంగింది (1985)
సంగీతం : కె.వి. మహదేవన్ గారు
గీతరచయిత : వేటూరి గారు
నేపథ్య గానం : బాలు గారు
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.