సేకరణ :- రవీంద్ర గారు
ప్రతి మనిషిలోనూ తప్పనిసరిగా ఉండాల్సిన గుణం "కృతజ్ఞత".. అది రానురానూ ప్రజలలో తగ్గిపోతుంది. తనకు సహాయం చేసినవారి పట్ల ఎలా కృతజ్ఞత చూపాలో తెలియజేసిన ఒక ఆదర్శపురుషుడి గురించి తెలుసుకుందాం!!
"#పుణ్యమూర్తుల_అప్పలరాజు, పశ్చమగోదావరి జిల్లా నర్సాపూర్ నివాసి.
సన్నగా వుండేవాడు పిల్లాడు. అయితే బాగా హుషారుగా వుండేవాడు. బుర్రకథలంటే ఇష్టం. అందువలన పాఠశాలలో చదివేకాలంలోనే బుర్రకథలు చెప్పడం నేర్చుకున్నాడు. బుర్రకథలను తనదైన స్టైల్ లో రిక్షావాళ్ళకు చెప్పేవాడు. వారు ఆ అబ్బాయి చెప్పే జోక్స్ కు నవ్వుతూ అభినందించేవారు. వారు అలా మెచ్చుకోవడంతో ఇంకా
రెచ్చిపోయేవాడు ఆ అబ్బాయి.
పదవ తరగతి అయిపోయింది. ఇంటర్ కు కళాశాలలో చేరాడు. ఇంటర్ అయిన తరువాత టీచర్ ట్రైనింగ్ చేసి తెలుగు పంతులుగా చేరాడు. అయినా నాటకాలపై మక్కువ తగ్గలేదు. మళ్ళీ కళావేదికపై కాలుమోపాడు. అద్భుతంగా నటిస్తుండటంతో ఒక స్నేహితుడు సినిమాలలో చేరమన్నాడు. అంతే
సినిమాలలో నటించాలని కలలు కనసాగాడు. ఒకరోజు ఇంట్లో చెప్పాపెట్టకుండా చెన్నై చెక్కేశాడు.
అయితే అక్కడేమీ అవకాశాలు తన్నూకురాలేదు. సార్ పర్సనాలిటీ చూసి పెదవి విరిచారు సినీపెద్దలు. ఒకప్రక్క ఆకలిబాధ. సినిమాలు లేవు. ఊరికి వెళ్ళలేడు. అలా ఆలోచిస్తూ నటి రాజసులోచన ఇంటిదగ్గరకు
వచ్చాడో రోజు. ఆకలితో కళ్ళు తిరుగుతున్నాయి. ఆమె ఇంటి ముందుకొచ్చి నీరసంగా కుర్చొండిపోయాడు. అది గమనించి ఆ ఇంటి వాచ్ మన్ ఆయన దగ్గరకు వచ్చాడు. అతని పరిస్థితి జాలేసి త్రాగడానికి నీళ్ళు, బిస్కెట్ ఇచ్చాడు. కృతజ్ఞతగా చూసాడు అతని వైపు అప్పలరాజు. ఇంతలో రాజారావు అనే నటుడి పిల్లలకు ట్యూషన్
చెప్పేందుకు చేరాడు. అయితే నాటకాలు మాత్రం మానలేదు..
ఒకరోజు రాజారావు అతనికి ఒక సినిమాలో అవకాశం ఇప్పించాడు. చాలా సంతోషపడిపోయాడు. సినిమా పేరు "సమాజం". అది ఫెయిల్యూర్. తర్వాత కులగోత్రాలు, పుణ్యవతిలాంటి సినిమాలలో చిన్న, చిన్న పాత్రలు వేశాడు. పేరురాలేదు.
అయితే 1960లో జగపతి ఆర్ట్స్
అధినేత వి.బి రాజేంద్రప్రసాద్ తన సొంతసినిమా "అంతస్థులు" లో అప్పలరాజుకు ఒకపాత్ర ఇచ్చారు. పారితోషికం ₹1300. అంతస్థులు సూపర్ హిట్ అయింది. అప్పలరాజు #రాజబాబు గా మారిపోయాడు. అంతే ఇంక వెనుక తిరిగి చూడలేదతను. తనకే సొంతమైన, ఎవరూ అనుకరించలేని హాస్యనటనతో తెలుగుప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.
ఒకానొక సమయంలో అగ్రహీరోలతో సమానంగా పారితోషికం తీసుకొనే స్థాయికి ఎదిగారు రాజబాబు.
ఉదాహరణకు యన్ టి రామారావు, రాజబాబు గారు ఒక సినిమాలో నటిస్తున్నారు. రామారావుగారికి పారితోషికం₹ 30000 కాగా, రాజబాబుకు ₹20000 ఇస్తామన్నారు. కానీ రాజబాబు నాకూ ₹30000 కావాల్సిందేనని పట్టుబట్టాడు.
ఇవ్వక తప్పింది కాదు నిర్మాతకి. అంత స్థాయికి ఎదిగాడు ఆయన.
ఎంత ఎత్తుకెదిగినా తనకు సహాయం చేసినవారిని మరిచిపోలేదు. తనకు నీళ్ళు ఇచ్చి దప్పిక తీర్చిన వాచ్ మేన్ దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళాడు, తనకు నటనలో మెళకువలు నేర్పిన బాలకృష్ణ(అంజిగాడు)ను సన్మానించి ,ఆర్థికంగా చాలా సహాయం చేశాడు.
అలాగే ఒక ట్రష్ట్ ను ఏర్పరిచి ప్రతి సంవత్సరం ఒక్కొక్క నటుడిని సన్మానించేవాడు. రేలంగి, సావిత్రి, రాజనాల, రాజారావు, చిత్తూరు నాగయ్యలాంటివారు సన్మానం పొందినవారిలో వున్నారు.
అంతేకాకుండా చిన్నప్పడు తమ చప్పట్లతో ప్రోత్సహించిన రిక్షావాళ్ళకు కొత్తరిక్షాలు, నగదు అందజేశాడు.
రాజమండ్రిలో వీధులు ఊడ్చే పనివాళ్ళకు "దానవాయిపేటలో పొలం కొని వారికి ఇచ్చాడు". కోరుకొండలో జూనియర్ కళాశాలను కట్టించాడు. అది ఆయన పేరు మీదనే "రాజబాబు జూనియర్ కళాశాల"గా ఉంది.
నటుడిగా నిలదొక్కుకునే సమయంలో తనకు సహాయపడిన వాళ్ళందరినీ గుర్తుంచుకొని కృతజ్ఞతాభావం చూపిన మహామనిషి రాజబాబుగారు.
పద్మశ్రీ పొందిన తొలి హాస్యనటుడు రాజబాబుగారే. ఏడుసార్లు ఉత్తమ హాస్యనటుడి అవార్డు పొందారు. 1983లో అకస్మాత్తుగా ఆనారోగ్యం పాలై మరణించారు. 20 వ శతాబ్ధపు ఉత్తమ హాస్యనటుడిగా గుర్తింపుపొందిన రాజబాబు, నిజజీవితంలో "రాజునే".. ఆయనలోని "కృతజ్ఞత" మనందరికీ ఆదర్శం....
వారికి జయంతి నివాళులు..
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.