ఆదిత్య శివశంకర కలకొండ Profile picture
తెలుగుభాష అభిమానిని , తల్లి తెలుగుభాషను బ్రతికించడానికి నావంతు ప్రయత్నం చేస్తున్న ఆశావాదిని... సినిమాలు, పుస్తకపఠనం, సంగీతం, సాహిత్యం ఇష్టమైనవి..

Oct 21, 2022, 14 tweets

#అశోక #వృక్షాలు

-- ముత్తేవి రవీంద్రనాథ్ గారి వ్యాసం

ఇటీవలి మా ఈశాన్య రాష్ట్రాల పర్యటన సందర్భంగా మేము పలు ప్రాంతాలలో అశోక వృక్షాలు చూశాము. ముఖ్యంగా అస్సామ్ లోని #గువాహాటిలోని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో చాలా అశోక వృక్షాలు కనిపించాయి.

'అశోక' అనే సంస్కృత పదానికి శోకము

లేనిది (Sorrow-less) అని అర్థం. రామాయణ కథనం ప్రకారం సీతను చెరబట్టిన రావణుడు ఆమెను లంకా నగరంలోని #అశోకవనం లోనే బందీగా ఉంచాడంటారు. 'అశోకవనమున సీత .. శోకించె వియోగము చేత' అనే పాట మనందరం విన్నదే.

మన్మథునికి 'పంచేషుడు',' పంచబాణుడు', 'పంచశరుడు' అనే పేర్లున్నాయి. సంస్కృతంలో 'పంచ'

అంటే ఐదు అనీ, 'ఇషు' అన్నా 'శర' అన్నా 'బాణము' అని అర్థం. మన్మథుడికి 'పుష్పశరుడు', ' సుమశరుడు' అనే పేర్లు కూడా ఉన్నాయి. అంటే ఆయన పూవులనే బాణాలుగా వేస్తాడన్నమాట. యువతీయువకులపై మన్మథుడు ఐదు రకాల పూలను బాణాలుగా ప్రయోగించి వారిలో కామతాపాన్ని రగులుస్తాడట. ఆయన అమ్ముల పొది(Quiver) లో

ఉండే ఐదు రకాల పుష్పాలలో పరిమళ భరితమైన అశోక పుష్పం కూడా ఒకటి.

అరవిందమశోకం చ చూతం చ నవమల్లికా |
నీలోత్పలం చ పంచైతే పంచబాణస్య సాయకాః ||

అరవిందము (తామర), అశోకము, చూతము (మామిడి), నవమల్లిక (మల్లెలలో ఒక రకం), నీలోత్పలా (నల్ల కలువ లేక నీలికలువ) - ఈ ఐదు పూలూ పంచబాణుడు (మన్మథుడు)

ప్రయోగించే సాయకములు (బాణములు).

అశోక చెట్టు లెగ్యూమినసీ కుటుంబానికి చెందిన సీజాల్పినియాయిడే (Caesalpinioideae) ఉపకుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం #Saraca #asoca. అయితే దీనిని కొందరు తప్పుగా Saraca indica అని కూడా అంటున్నారు. భారత ఉపఖండంలో - ప్రత్యేకించి నేపాల్,

భారతదేశం, శ్రీలంకలలో- అశోక చెట్లు విరివిగా కనిపిస్తాయి. ఆకుపచ్చని గుబురుగా వచ్చే ఆకులు, గుత్తులు గుత్తులుగా పూసే పూలతో అశోక చెట్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఫిబ్రవరి నుండి ఏప్రిల్, మే నెలలవరకు ఈ చెట్లు విరగబూస్తాయి. పూసినప్పుడు ప్రకాశవంతమైన కాషాయ వర్ణంలో ఉండే ఈ పూలు తరువాత

క్రమంగా ఎర్రగా మారిపోతాయి.

భారతీయ శిల్పంలో బౌద్ధ, హిందూ సంప్రదాయాలలో "అశోక వృక్షం కింద నిలిచిన యక్షిణి శిల్పం" సర్వసాధారణంగా కనుపిస్తుంది. బౌద్ధులకూ, హిందువులకూ ఇది పరమ పవిత్రమైన వృక్షం. హిందువులు చైత్ర మాసంలో అశోక వృక్షాన్ని పూజిస్తారు. శాక్య గణానికి చెందిన రాజు శుద్ధోదనుడి

భార్య మాయాదేవి లుంబినీ వనంలోని ఒక అశోక వృక్షం కిందనే గౌతముడిని కన్నది. ఆ గౌతముడే అనంతరకాలంలో జ్ఞానోదయం పొంది బుద్ధుడై బౌద్ధమతాన్ని స్థాపించాడు. ఆ రకంగా బౌద్ధ మతస్థులకూ అశోక వృక్షం పరమ పవిత్రమైనది.

అశోక అనే పేరుతో పిలువబడే #నారమామిడి (Polyalthia longifolia) మన ప్రాంతంలో

సర్వ సాధారణం. ఈ చెట్టు సీతాఫలం, తీగ సంపెంగ జాతి (అనోనేసీ ) కి చెందినది. వీటిలో ఒక వృక్షంలా విస్తరించకుండా కేవలం నిలువుగా, ఎత్తుగా (30 అడుగుల ఎత్తు వరకూ) పెరిగే మరో రకం ఉంది. దానిని Polyalthia longifolia 'pendula' అనే శాస్త్రీయ నామం తో పిలుస్తారు. బారుగా పెరిగి గాలికి

లోలకం (pendulum) లా ఊగులాడడాన్ని బట్టి దీనికి 'pendula' అనే పేరు వచ్చింది. పొడవుగా పెరగడం కారణంగా దీనిని Mast Tree అని కూడా అంటారు. నారమామిడిలోని ఈ రెండు రకాలనూ #False #Ashoka అనే పేరుతో వ్యవహరిస్తారు. అశోక పూలు ఎర్రగా ఉంటే నారమామిడి పూలు యాపిల్ గ్రీన్ వన్నెలో కనపడీ కనపడకుండా

ఉంటాయి.అశోక కాయలు బ్రాడ్ బీన్స్ లా ఉండి, లోపల చాలా గింజలు ఉంటాయి. నారమామిడి కాయలు గుత్తులుగా కాస్తాయి. అవి చిన్నవిగా, గుండ్రంగా, ఆకుపచ్చగా (పండితే నల్లగా నేరేడు పళ్ళలా) ఉంటాయి. వాటిలో ఒకే విత్తనం ఉంటుంది. అశోక చెట్టు దాదాపు పదిహేను - ఇరవై అడుగులకు మించి ఎత్తు పెరగదు.

False ashoka చెట్లు బాగా ఎత్తు పెరుగుతాయి.

అశోక చెట్టు కాండంపై బెరడు అగ్నిమాంద్యానికి, అజీర్ణానికీ దివ్యౌషధం. కడుపు నొప్పి, కడుపులో పుండ్లు మొదలైన వాటికి ఈ బెరడు కషాయం లోనికిస్తారు. దీని ఆకుల రసంలో రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. మొటిమల నివారణకు ఈ ఆకుల రసం బాగా పనిచేస్తుంది.

పచ్చి అశోక పూల రసం రక్త విరేచనాలకు ఔషధంగా పనిచేస్తుంది. ఎండు అశోక పూలు చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుతాయి. సిఫిలిస్ వంటి సుఖ వ్యాధులకే కాక, స్త్రీల అండకోశాలకు సంబంధించిన అన్ని రుగ్మతలకూ అశోక పూలు బాగా పనిచేస్తాయి.

ఆయుర్వేదంలో 'అశోకారిష్ట' వంటి పలు ఔషధాలు అశోక వృక్ష ఉత్పాదనలతోనే తయారు చేస్తారు.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling