పవన్ సంతోష్ (Pavan Santhosh) Profile picture
అన్నిటికన్నా ముందు తెలుగువాడిని! @Wikipedian, Bookworm, Movie buff and a lot of such qualifiers. Tweets are personal.

Oct 9, 2022, 26 tweets

సినిమా రంగంలో అవసరం తీరగానే మరచిపోతారని, విలువలు ఉండవని ఎందరో చెప్తారు. అయితే, కృతజ్ఞత అన్న పదం తలుచుకున్నప్పుడు నాకు గుర్తుకువచ్చే సంఘటన సినిమా రంగంలోనే జరిగింది. ఎన్టీ రామారావుకు, కె.వి.రెడ్డికి మధ్య జరిగిన ఈ సంఘటన కృతజ్ఞత అన్న పదానికే నిర్వచనంగా నిలిచిపోతుంది.
#NTR

కె.వి.రెడ్డి - అలనాటి సినిమాలు ఇష్టపడేవారికే కాక, మాయాబజార్ దర్శకునిగా చాలామందికి, మహానటి, కథానాయకుడు సినిమాల ద్వారా ఈమధ్య ఇంకొందరికీ ఈయన పేరు, తీరు కొంత తెలుసు.

మాయాబజార్, పాతాళ భైరవి, జగదేక వీరుని కథ వంటి సినిమాలు తీసిన దిగ్దర్శకుడు - కెవి రెడ్డి. తెలుగు సినిమా రంగానికి 1940లు, 50ల్లో స్వర్ణయుగాన్ని చవిచూపించిన బ్యానర్‌లలో అగ్రతాంబూలం అందుకునే వాహినీ, విజయా సంస్థలకు ఆయనొక మూలస్తంభం. ఎందరో రచయితలు, నటులను తెరపై వెలిగించిన వ్యవస్థ ఆయన.

కె.వి.రెడ్డి కంటూ కొన్ని పద్ధతులు, విధానాలు ఉండేవి. ఎంతైనా 1942 నుంచి అగ్రదర్శకుడిగా కొనసాగుతూ వచ్చిన వ్యక్తి మరి.
అయితే, ఈ పద్ధతుల వల్లనే ఆయన సినిమాలు ఎక్కువగా తీసిన విజయా సంస్థ అధిపతులు నాగిరెడ్డి-చక్రపాణిలతో వివాదాలు, సమస్యలూ ఉండేవి.

పాతాళ భైరవి విడుదల అయిన నాటి నుంచి కొద్దికొద్దిగా పెరుగుతూ వచ్చిన ఈ మనస్పర్థలు ముదిరి కె.వి.రెడ్డి విజయా బ్యానర్‌లో 1960ల్లో తీసిన చివరి మూడు సినిమాలకు నాగిరెడ్డి-చక్రపాణిల పేర్లు కాకుండా కె.వి.రెడ్డి తన పేరే నిర్మాతగా వేయించుకోవడం దాకా పోయింది.

కె.వి.రెడ్డి పేరు 1942లో భక్త పోతన మొదలుకొని 1964లో శ్రీకృష్ణార్జున యుద్ధం వరకూ తెలుగు సినిమా రంగంలో ఘన విజయాలకు పర్యాయపదంగా సాగింది. దాదాపుగా తీసిన ప్రతీ సినిమా సంచలన విజయమే. కాబట్టి, నాగిరెడ్డి-చక్రపాణిలు ఇదంతా ఎలానో సహించి ఊరుకున్నారు.

కాలం ఎప్పుడూ ఒకతీరున ఉండదు కదా. కె.వి.రెడ్డికి 1965-68 మధ్యకాలంలో వరుసగా మూడు పెద్ద ఫ్లాపులు వచ్చాయి. అందులో రెండు (సత్య హరిశ్చంద్ర, ఉమా చండీ గౌరీ శంకరుల కథ) విజయా సంస్థ నిర్మించినవే.

విజయా ప్రొడక్షన్స్‌లో 1950ల నుంచీ కె.వి.రెడ్డి సాంకేతిక బృందం నెలజీతానికి పనిచేసేవారు. వారిలో- పింగళి, కళాధర్-మా గోఖలే వంటి మహామహులు ఉండేవారు. ఉమా చండీ గౌరీ శంకరుల కథ ఫ్లాప్‌తో కె.వి.రెడ్డి హవా ముగిసిందన్నట్టు ఆ బృందాన్ని మొత్తంగా విజయా ప్రొడక్షన్స్ వారు ఉద్యోగంలోంచి తొలగించారు.

కె.వి.రెడ్డికి పెట్టే ఆఫీసు కారును కూడా వెనక్కి తీసేసుకున్నారని ఆయన సన్నిహితుడైన రచయిత, ఆయన ద్వారానే సినిమా రంగంలోకి ప్రవేశించినవాడూ అయిన డి.వి.నరసరాజు రాసుకున్నారు. అదేమీ జరగలేదని కె.వి.రెడ్డి పిల్లలు అంటారు. ఏమైనా - కె.వి.రెడ్డి ఒక్కసారిగా పెద్ద దెబ్బ తిన్నారని చెప్పక తప్పదు.

ఒకవైపు ఈ అవమానానికి తోడు తన స్వంత బ్యానర్‌లో తీసిన భాగ్యచక్రం సినిమా కూడా పరాజయం పాలయింది. దీనితో ఆయనకు చేతిలో ఒక్క అవకాశమూ లేకుండా పోయింది.

పైగా కె.వి.రెడ్డికి ఎలా పడితే అలా సినిమా తీసే అలవాటు లేదు. శ్రద్ధగా స్క్రిప్టు రాసుకుని, దాన్ని విజువలైజ్ చేసి, రిహార్సల్స్ చేయించుకుని పద్ధతిగా సినిమా తీసి బ్రహ్మాండమైన హిట్ కొట్టడం, ఇంతకన్నా ఈ సబ్జెక్ట్ బాగా తీయలేమన్న పేరు సంపాదించడం ఆయన విధానం. ఇందుకు సమయం, డబ్బు, ఓపిక అవసరం.

దీంతో - ఒకనాడు కె.వి.రెడ్డితో సినిమా తీయించుకోవాలన్న ఆశతో ఏళ్ళ పాటు నిర్మాతలు వేచిచూసిన స్థితి నుంచి, మాయాబజార్ ఆగిపోయిందని తెలిసి మేం తీస్తామని తమిళ చిత్ర సీమలో అగ్రనిర్మాతలు రాయబారాలు పంపిన స్థితి నుంచి - చివరకు సినిమా తీస్తానన్నా పెట్టుబడి పెట్టేవారు కరువైన స్థితి వచ్చింది.

అలా రెండు సంవత్సరాలు గడిచిపోతూ, ఆయన ఆరోగ్యం కూడా క్షీణించిపోతున్న దశలో ఈ సంగతులు ఎన్.టి.రామారావు చెవిన పడ్డాయి. కె.వి.రెడ్డి అంటే రామారావుకు ఎంతో అభిమానమూ, ఇంకెంతో గౌరవమూ ఉన్నాయి.

1951లో నాగేశ్వరరావు అగ్రనటుడిగా దూసుకుపోతున్న సమయంలో అప్పుడే రంగంలోకి వచ్చిన రామారావు ఆవేశాన్ని ఓ టెన్నిస్ మ్యాచ్‌లో చూసి, ఇదీ జానపద నాయకుడికి ఉండాల్సిన ఫోర్సు అని తన పాతాళ భైరవిలో హీరోగా పెట్టుకున్నది- కె.వి.రెడ్డే. ఆ సినిమాతో రామారావు తిరుగులేని మాస్ హీరోగా నిలిచారు.

కృష్ణుడి పాత్రకు నేను తగను అని రామారావు మొత్తుకున్నా వినకుండా పట్టుబట్టి అతనితో కృష్ణ పాత్ర వేయించి కృష్ణుడంటే ఇలానే ఉండాలని మాయాబజార్ సినిమాతో బెంచ్‌మార్క్ సెట్ చేసిందీ కె.వి.రెడ్డే.

కె.వి.రెడ్డికీ రామారావు మీద నటన మీద విశ్వాసం ఎక్కువ, వ్యక్తిగా అతని మీద వాత్సల్యమూ ఎక్కువే. 1951 తర్వాత పాతాళ భైరవి నుంచి భాగ్యచక్రం వరకూ కె.వి.రెడ్డి పది సినిమాలు తీస్తే అందులో ఏడు సినిమాల్లో రామారావే కథానాయకుడు.

రామారావు దర్శకత్వం వహించిన తొలి సినిమా మొదలుకొని చివరిదాకా పాటించింది కె.వి.రెడ్డి విధానాలే. స్క్రిప్టు చాలా సమయం తీసుకుని పక్కాగా రాయించుకోవడం, బాగా వర్క్ చేసి సినిమాను విజువలైజ్ చేయడం, ప్రతీ వివరం ముందుగా రాసిపెట్టుకోవడం, రిహార్సల్స్ చేయించడం - ఇవన్నీ కె.వి.రెడ్డి పద్ధతులే.

అయినా కె.వి.రెడ్డిని దర్శకునిగా పెట్టుకుని స్వంత బ్యానర్‌లో సినిమా తీసే వీలు అంతవరకూ NTRకి దొరకలేదు. కెవి రెడ్డి అప్పట్లో అంత బిజీ.
తిరిగి 1960లు చివరికి వస్తే - కె.వి. అనారోగ్యంతో, ఫ్లాపుల్లో, అవమాన భారంతో ఉన్నారు. ఒక్క అవకాశం దొరికితే మంచి హిట్ ఇచ్చి రిటైర్ అయ్యే ఆశతో ఉన్నారు.

కె.వి.రెడ్డికి రామారావు ఆ అవకాశం ఇచ్చారు. "గురువు గారూ, మీ పింగళి గారే రాసిన స్క్రిప్టులు రెండు ఉన్నాయి నా దగ్గర - చాణక్య చంద్రగుప్త, శ్రీకృష్ణసత్య. ఇందులో ఏదోకటి నా బ్యానర్‌లో చేసిపెట్టండి" అని అడిగారు NTR. పరమానందభరితుడైన కె.వి.రెడ్డి శ్రీకృష్ణ సత్య చేస్తాలే రామారావ్ అన్నారు.

ఆ దర్శకత్వం చెయ్యడం కూడా ఇదివరకులాగా చేసేంత ఆరోగ్యం లేదు. దానితో కె.వి.రెడ్డితో స్క్రిప్టు మీద రామారావు తానే కూర్చొని మొత్తం ఫైనలైజ్ చేశారు.

ఆపైన కె.వి.రెడ్డిని సెట్‌లో కుర్చీ వేసుకుని కూర్చోబెట్టి, మాట్లాడి ఆయన చెప్పినదాని ప్రకారం కెమెరా సెట్ చేసి, ఆయన ముందు రిహార్సల్స్ చేయించి (చేసి) చూపించి, ఆపైన కెమెరాలోంచి పరిశీలించి వచ్చి ఇలా ఉంది గురువు గారూ అంటే ఆయన ఆమోదిస్తే చేసి షాట్ పూర్తిచేయడం. లేదంటే మార్పులు చేయడం.

ఇలా- ఒకటికి రెండు రెట్లు శ్రమ తీసుకుని మరీ "శ్రీకృష్ణ సత్య"ని కె.వి.రెడ్డి సినిమాగానే దాన్ని పూర్తిచేయించారు రామారావు.చివరకు, ఆ సినిమా విడుదలైంది. మంచి విజయాన్ని సాధించింది. కె.వి.రెడ్డికి చెప్పలేనంత సంతృప్తి కలిగింది.

"రామారావు, నన్ను మళ్ళీ నిలబెట్టాడు. ఇన్ని విజయాలు చూసి చివరకు ఫ్లాప్ డైరెక్టరుగానే నా కెరీర్ ముగించాల్సి వస్తుందేమోనని బాధపడ్డాను. ఇప్పుడు ఆ ప్రమాదం లేదు. మరొక్క సినిమా సంతృప్తిగా తీసి, మా తాడిపత్రి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను" అంటూండేవారు.

కాకపోతే, అంతలోనే కె.వి.రెడ్డి అనారోగ్యంతో మరణించారు. కానీ, సంతృప్తిగా మరణించారు.

సినిమా రంగం అంటేనే కృతజ్ఞత లేని రంగం అని అందులోని వారే అంటారు. హిట్లు వస్తున్ననాడు ఎలాంటివాడికైనా నీరాజనం పడతారు. ఫ్లాపులు వస్తే ఎంతటి మహానుభావులనైనా పక్కనపెట్టేస్తారు. మళ్ళీ చనిపోయాకే వాళ్ళ గొప్పదనం గుర్తుకువస్తుంది.
ఆఫ్‌కోర్స్ డబ్బుతో చెలగాటం మరి.

అలాంటి పరిస్థితిలోనూ ఇంతటి నీతిని, ఇంతటి కృతజ్ఞతని ప్రదర్శించాడని తెలియడం ఎన్.టి.రామారావుపై నాకున్న గౌరవాన్ని ఎంతగానో ఇనుమడింపజేసింది. ఈ సంఘటన ఎన్నిసార్లు తలుచుకున్నా తప్పులేదనిపిస్తుంది.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling