సినిమా రంగంలో అవసరం తీరగానే మరచిపోతారని, విలువలు ఉండవని ఎందరో చెప్తారు. అయితే, కృతజ్ఞత అన్న పదం తలుచుకున్నప్పుడు నాకు గుర్తుకువచ్చే సంఘటన సినిమా రంగంలోనే జరిగింది. ఎన్టీ రామారావుకు, కె.వి.రెడ్డికి మధ్య జరిగిన ఈ సంఘటన కృతజ్ఞత అన్న పదానికే నిర్వచనంగా నిలిచిపోతుంది.
#NTR
కె.వి.రెడ్డి - అలనాటి సినిమాలు ఇష్టపడేవారికే కాక, మాయాబజార్ దర్శకునిగా చాలామందికి, మహానటి, కథానాయకుడు సినిమాల ద్వారా ఈమధ్య ఇంకొందరికీ ఈయన పేరు, తీరు కొంత తెలుసు.
మాయాబజార్, పాతాళ భైరవి, జగదేక వీరుని కథ వంటి సినిమాలు తీసిన దిగ్దర్శకుడు - కెవి రెడ్డి. తెలుగు సినిమా రంగానికి 1940లు, 50ల్లో స్వర్ణయుగాన్ని చవిచూపించిన బ్యానర్‌లలో అగ్రతాంబూలం అందుకునే వాహినీ, విజయా సంస్థలకు ఆయనొక మూలస్తంభం. ఎందరో రచయితలు, నటులను తెరపై వెలిగించిన వ్యవస్థ ఆయన.
కె.వి.రెడ్డి కంటూ కొన్ని పద్ధతులు, విధానాలు ఉండేవి. ఎంతైనా 1942 నుంచి అగ్రదర్శకుడిగా కొనసాగుతూ వచ్చిన వ్యక్తి మరి.
అయితే, ఈ పద్ధతుల వల్లనే ఆయన సినిమాలు ఎక్కువగా తీసిన విజయా సంస్థ అధిపతులు నాగిరెడ్డి-చక్రపాణిలతో వివాదాలు, సమస్యలూ ఉండేవి.
పాతాళ భైరవి విడుదల అయిన నాటి నుంచి కొద్దికొద్దిగా పెరుగుతూ వచ్చిన ఈ మనస్పర్థలు ముదిరి కె.వి.రెడ్డి విజయా బ్యానర్‌లో 1960ల్లో తీసిన చివరి మూడు సినిమాలకు నాగిరెడ్డి-చక్రపాణిల పేర్లు కాకుండా కె.వి.రెడ్డి తన పేరే నిర్మాతగా వేయించుకోవడం దాకా పోయింది.
కె.వి.రెడ్డి పేరు 1942లో భక్త పోతన మొదలుకొని 1964లో శ్రీకృష్ణార్జున యుద్ధం వరకూ తెలుగు సినిమా రంగంలో ఘన విజయాలకు పర్యాయపదంగా సాగింది. దాదాపుగా తీసిన ప్రతీ సినిమా సంచలన విజయమే. కాబట్టి, నాగిరెడ్డి-చక్రపాణిలు ఇదంతా ఎలానో సహించి ఊరుకున్నారు.
కాలం ఎప్పుడూ ఒకతీరున ఉండదు కదా. కె.వి.రెడ్డికి 1965-68 మధ్యకాలంలో వరుసగా మూడు పెద్ద ఫ్లాపులు వచ్చాయి. అందులో రెండు (సత్య హరిశ్చంద్ర, ఉమా చండీ గౌరీ శంకరుల కథ) విజయా సంస్థ నిర్మించినవే.
విజయా ప్రొడక్షన్స్‌లో 1950ల నుంచీ కె.వి.రెడ్డి సాంకేతిక బృందం నెలజీతానికి పనిచేసేవారు. వారిలో- పింగళి, కళాధర్-మా గోఖలే వంటి మహామహులు ఉండేవారు. ఉమా చండీ గౌరీ శంకరుల కథ ఫ్లాప్‌తో కె.వి.రెడ్డి హవా ముగిసిందన్నట్టు ఆ బృందాన్ని మొత్తంగా విజయా ప్రొడక్షన్స్ వారు ఉద్యోగంలోంచి తొలగించారు.
కె.వి.రెడ్డికి పెట్టే ఆఫీసు కారును కూడా వెనక్కి తీసేసుకున్నారని ఆయన సన్నిహితుడైన రచయిత, ఆయన ద్వారానే సినిమా రంగంలోకి ప్రవేశించినవాడూ అయిన డి.వి.నరసరాజు రాసుకున్నారు. అదేమీ జరగలేదని కె.వి.రెడ్డి పిల్లలు అంటారు. ఏమైనా - కె.వి.రెడ్డి ఒక్కసారిగా పెద్ద దెబ్బ తిన్నారని చెప్పక తప్పదు.
ఒకవైపు ఈ అవమానానికి తోడు తన స్వంత బ్యానర్‌లో తీసిన భాగ్యచక్రం సినిమా కూడా పరాజయం పాలయింది. దీనితో ఆయనకు చేతిలో ఒక్క అవకాశమూ లేకుండా పోయింది.
పైగా కె.వి.రెడ్డికి ఎలా పడితే అలా సినిమా తీసే అలవాటు లేదు. శ్రద్ధగా స్క్రిప్టు రాసుకుని, దాన్ని విజువలైజ్ చేసి, రిహార్సల్స్ చేయించుకుని పద్ధతిగా సినిమా తీసి బ్రహ్మాండమైన హిట్ కొట్టడం, ఇంతకన్నా ఈ సబ్జెక్ట్ బాగా తీయలేమన్న పేరు సంపాదించడం ఆయన విధానం. ఇందుకు సమయం, డబ్బు, ఓపిక అవసరం.
దీంతో - ఒకనాడు కె.వి.రెడ్డితో సినిమా తీయించుకోవాలన్న ఆశతో ఏళ్ళ పాటు నిర్మాతలు వేచిచూసిన స్థితి నుంచి, మాయాబజార్ ఆగిపోయిందని తెలిసి మేం తీస్తామని తమిళ చిత్ర సీమలో అగ్రనిర్మాతలు రాయబారాలు పంపిన స్థితి నుంచి - చివరకు సినిమా తీస్తానన్నా పెట్టుబడి పెట్టేవారు కరువైన స్థితి వచ్చింది.
అలా రెండు సంవత్సరాలు గడిచిపోతూ, ఆయన ఆరోగ్యం కూడా క్షీణించిపోతున్న దశలో ఈ సంగతులు ఎన్.టి.రామారావు చెవిన పడ్డాయి. కె.వి.రెడ్డి అంటే రామారావుకు ఎంతో అభిమానమూ, ఇంకెంతో గౌరవమూ ఉన్నాయి.
1951లో నాగేశ్వరరావు అగ్రనటుడిగా దూసుకుపోతున్న సమయంలో అప్పుడే రంగంలోకి వచ్చిన రామారావు ఆవేశాన్ని ఓ టెన్నిస్ మ్యాచ్‌లో చూసి, ఇదీ జానపద నాయకుడికి ఉండాల్సిన ఫోర్సు అని తన పాతాళ భైరవిలో హీరోగా పెట్టుకున్నది- కె.వి.రెడ్డే. ఆ సినిమాతో రామారావు తిరుగులేని మాస్ హీరోగా నిలిచారు.
కృష్ణుడి పాత్రకు నేను తగను అని రామారావు మొత్తుకున్నా వినకుండా పట్టుబట్టి అతనితో కృష్ణ పాత్ర వేయించి కృష్ణుడంటే ఇలానే ఉండాలని మాయాబజార్ సినిమాతో బెంచ్‌మార్క్ సెట్ చేసిందీ కె.వి.రెడ్డే.
కె.వి.రెడ్డికీ రామారావు మీద నటన మీద విశ్వాసం ఎక్కువ, వ్యక్తిగా అతని మీద వాత్సల్యమూ ఎక్కువే. 1951 తర్వాత పాతాళ భైరవి నుంచి భాగ్యచక్రం వరకూ కె.వి.రెడ్డి పది సినిమాలు తీస్తే అందులో ఏడు సినిమాల్లో రామారావే కథానాయకుడు.
రామారావు దర్శకత్వం వహించిన తొలి సినిమా మొదలుకొని చివరిదాకా పాటించింది కె.వి.రెడ్డి విధానాలే. స్క్రిప్టు చాలా సమయం తీసుకుని పక్కాగా రాయించుకోవడం, బాగా వర్క్ చేసి సినిమాను విజువలైజ్ చేయడం, ప్రతీ వివరం ముందుగా రాసిపెట్టుకోవడం, రిహార్సల్స్ చేయించడం - ఇవన్నీ కె.వి.రెడ్డి పద్ధతులే.
అయినా కె.వి.రెడ్డిని దర్శకునిగా పెట్టుకుని స్వంత బ్యానర్‌లో సినిమా తీసే వీలు అంతవరకూ NTRకి దొరకలేదు. కెవి రెడ్డి అప్పట్లో అంత బిజీ.
తిరిగి 1960లు చివరికి వస్తే - కె.వి. అనారోగ్యంతో, ఫ్లాపుల్లో, అవమాన భారంతో ఉన్నారు. ఒక్క అవకాశం దొరికితే మంచి హిట్ ఇచ్చి రిటైర్ అయ్యే ఆశతో ఉన్నారు.
కె.వి.రెడ్డికి రామారావు ఆ అవకాశం ఇచ్చారు. "గురువు గారూ, మీ పింగళి గారే రాసిన స్క్రిప్టులు రెండు ఉన్నాయి నా దగ్గర - చాణక్య చంద్రగుప్త, శ్రీకృష్ణసత్య. ఇందులో ఏదోకటి నా బ్యానర్‌లో చేసిపెట్టండి" అని అడిగారు NTR. పరమానందభరితుడైన కె.వి.రెడ్డి శ్రీకృష్ణ సత్య చేస్తాలే రామారావ్ అన్నారు.
ఆ దర్శకత్వం చెయ్యడం కూడా ఇదివరకులాగా చేసేంత ఆరోగ్యం లేదు. దానితో కె.వి.రెడ్డితో స్క్రిప్టు మీద రామారావు తానే కూర్చొని మొత్తం ఫైనలైజ్ చేశారు.
ఆపైన కె.వి.రెడ్డిని సెట్‌లో కుర్చీ వేసుకుని కూర్చోబెట్టి, మాట్లాడి ఆయన చెప్పినదాని ప్రకారం కెమెరా సెట్ చేసి, ఆయన ముందు రిహార్సల్స్ చేయించి (చేసి) చూపించి, ఆపైన కెమెరాలోంచి పరిశీలించి వచ్చి ఇలా ఉంది గురువు గారూ అంటే ఆయన ఆమోదిస్తే చేసి షాట్ పూర్తిచేయడం. లేదంటే మార్పులు చేయడం.
ఇలా- ఒకటికి రెండు రెట్లు శ్రమ తీసుకుని మరీ "శ్రీకృష్ణ సత్య"ని కె.వి.రెడ్డి సినిమాగానే దాన్ని పూర్తిచేయించారు రామారావు.చివరకు, ఆ సినిమా విడుదలైంది. మంచి విజయాన్ని సాధించింది. కె.వి.రెడ్డికి చెప్పలేనంత సంతృప్తి కలిగింది.
"రామారావు, నన్ను మళ్ళీ నిలబెట్టాడు. ఇన్ని విజయాలు చూసి చివరకు ఫ్లాప్ డైరెక్టరుగానే నా కెరీర్ ముగించాల్సి వస్తుందేమోనని బాధపడ్డాను. ఇప్పుడు ఆ ప్రమాదం లేదు. మరొక్క సినిమా సంతృప్తిగా తీసి, మా తాడిపత్రి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను" అంటూండేవారు.
కాకపోతే, అంతలోనే కె.వి.రెడ్డి అనారోగ్యంతో మరణించారు. కానీ, సంతృప్తిగా మరణించారు.
సినిమా రంగం అంటేనే కృతజ్ఞత లేని రంగం అని అందులోని వారే అంటారు. హిట్లు వస్తున్ననాడు ఎలాంటివాడికైనా నీరాజనం పడతారు. ఫ్లాపులు వస్తే ఎంతటి మహానుభావులనైనా పక్కనపెట్టేస్తారు. మళ్ళీ చనిపోయాకే వాళ్ళ గొప్పదనం గుర్తుకువస్తుంది.
ఆఫ్‌కోర్స్ డబ్బుతో చెలగాటం మరి.
అలాంటి పరిస్థితిలోనూ ఇంతటి నీతిని, ఇంతటి కృతజ్ఞతని ప్రదర్శించాడని తెలియడం ఎన్.టి.రామారావుపై నాకున్న గౌరవాన్ని ఎంతగానో ఇనుమడింపజేసింది. ఈ సంఘటన ఎన్నిసార్లు తలుచుకున్నా తప్పులేదనిపిస్తుంది.

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with పవన్ సంతోష్ (Pavan Santhosh)

పవన్ సంతోష్ (Pavan Santhosh) Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @santhoo9

Sep 9
ఇది నేను గతంలో కోరాలో అడిగిన ప్రశ్న.
తెలంగాణ భాషా దినోత్సవం ఈరోజు. ఇప్పటికీ తెలంగాణ అనే మాండలికం ఉర్దూ, పార్సీ సంపర్కం వల్ల తప్ప పుట్టలేదు అనే జనాలు ఉన్నారు. అందువల్ల అందరికీ అర్థమయ్యేలా తెలంగాణ మాండలికంలో ఒక పార్శ్వం చూద్దాం.
జవాబు రాసినవారు పవన్ కళ్యాణ్ వాకిటి. నేను కాదు. Image
ఈ సమాధానాన్ని పవన్ కళ్యాణ్ వాకిటి గారు నలిమెల భాస్కర్ గారి రచన ఆధారంగా రాశారు. నేను కేవలం పంచుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్తే:
"తెలంగాణ సీమలోని పల్లె ప్రజల మాట్లాడే తీరుకు, వెనుకటి కావ్య భాషకు చానా దగ్గర సంబంధం ఉంది. ఆ సాన్నిహిత్యాన్ని చూసి కొన్ని సార్లు మనం ఆశ్చర్య పోవుడు కద్దు. మచ్చుకు పోతన తన భాగవతంలో వాడిన కొన్ని పదాలకు, తెలంగాణ పలుకులకు వున్న సామిప్యాన్ని చూద్దాం.",
"1.

భాగవతంలోని ఆయా స్కంధాల ప్రారంభంలో పద్యం తరువాత ”మహనీయ గుణ గరిష్ఠులగు నమ్ముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుండు ఇట్లనియె” అని ఉంటది. ఇక్కడ ”సూతుండు ఇట్లనియె” అని చివరన వుంది. ఇప్పటికీ పల్లెల్లో ”వాడు నిన్న నన్ను ఇట్లనె. వీడు నిన్ను అట్లనె. ఇగ ఎట్ల చేద్దాం” అనే తీరు మాటలు వింటాం. ”ఇట్లనియె” అనే ప్రాచీన రూపం తెలంగాణలో ”ఇట్లనె” అవుతున్నది. ”ఇలా అన్నాడు” అనే ఆధునిక రూపం తెలంగాణలో లేదు. ”అనియె” అనే క్రియ కాలక్రమంలో ”అనె”గా మారిపోయింది."
Read 16 tweets
Jul 15
విశ్వనాథ - జాషువాల మధ్య చెప్పే గుర్రం గాడిద జోక్ ఏమిటంటే - విశ్వనాథ సత్యనారాయణ, జాషువాలు ఇద్దరికీ ఒకే వేదిక మీద సన్మానం జరిగిందనీ, దాని గురించి ప్రస్తావిస్తూ "గుర్రాన్నీ గాడిదనీ ఒకే గాటన కట్టేశారు" అన్నారనీ, దానికి రిపార్టీగా జాషువా "కావచ్చు. ఐతే, నేను గుర్రం జాషువాని - మరి గాడిద ఎవరో ఆయనకే తెలియాలి" అన్నారనీ చెప్తారు.

ఈ చెప్పడం అన్నది బస్ స్టేషన్లలో దొరికే 20-30 పేజీలుండే బుల్లి ప్రముఖుల జోకుల్లో చదివాను. కొందరు పెద్దవాళ్ళు అనగా విన్నాను. ఏవేవో సాహిత్య మొర్మొరాల్లో చూశాను. ఫేస్ బుక్ పోస్టులు, బ్లాగులు, కావేవీ అనర్హం. అన్నిటా ఉంటుందిది.Image
ఐతే ఒకటి - ఎక్కడా ఆ సభ ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్నది చెప్పరు. బాగా ప్రయత్నించగా ఒకచోట నాయని కృష్ణకుమారి గారి వివాహ సందర్భంగా వారిద్దరినీ ఒకే వేదిక మీద సత్కరించారనీ, అక్కడే మైకులో ఆయనలా, ఈయనిలా అన్నారని ఎక్కడో ఉందని పట్టుకుని చెప్పారు మిత్రులు కౌటిల్య చౌదరి గారు. దీనితో- 2014లో నేను, కౌటిల్య గారితో కలిసి నాయని కృష్ణకుమారి గారి ఇంటికి వెళ్లి ఆవిడను కలిశాను.

సహస్ర పూర్ణ చంద్ర దర్శనం పూర్తయినట్టుంది ఆవిడకు అప్పటికే. 85కు చేరువలో ఉన్నారు. నా మనసులో ఉన్నది సింగిల్ పాయింట్ అజెండా, ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోవాలన్నది. కొంత సేపు ఆవిడతో నాయని సుబ్బారావు గారి గురించి, చిన్నతనంలో చదివిన కాశ్మీరు దీపకళిక పాఠం గురించి, ఆవిడ జానపద పరిశోధనల గురించి మాట్లాడి - ఈ విషయం అడిగాను.
ఆవిడ సూటిగా సరళంగా చెప్పారు -

"లేదండీ. నా పెళ్లిలో ఇది జరగలేదు. నా పెళ్లిలో బాపిరాజు గారు ఆనందంతో పాట పాడి నాట్యం చేశారు. కవులందరూ వచ్చి ఆశీర్వదించారు. నాన్నగారి (సుబ్బారావు గారి) స్నేహితులు, ఆ సందడి వల్ల ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ, ఇలా విశ్వనాథ, జాషువా అనుకున్నది మాత్రం లేదు. అదెవరో కల్పించారు."

"మరి మీ పెళ్లిలో కాకపోతే మరెప్పుడైనా జరిగిందా?"

"ఒక విషయం నా కళ్ల ముందు జరిగితే జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే అందుకు సాక్షిని కాబట్టి. జరగనిది ఎవరైనా పుట్టిస్తే అస్సలు జరగలేదని చెప్పడం కష్టం. ఎందుకంటే - నా కళ్ళ ముందు కాక ఎక్కడో జరిగి ఉండవచ్చన్న సందేహం నాకు పీకుతుంది కాబట్టి. కనుక, విశ్వనాథ, జాషువా ఇలా మాట్లాడుకోవడం అన్నది నేను చూసిన ఏ సభలోనూ జరగలేదు, అలానే నాకు తెలిసి జరగలేదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మా నాన్నగారిదీ (నాయని సుబ్బారావు గారు, విశ్వనాథ-జాషువాలిద్దరికీ సాహిత్య మిత్రుడు), నాదీ కేవలం సామాన్యమైన తండ్రీ కూతుళ్ళ సంబంధం మాత్రమే కాదు. ఆయన నాకు మిత్రుడిలాగా ఉండేవారు. ఏ సాహిత్య విశేషం తెలిసినా నాకు చెప్పేవారు. మేం విశ్లేషించుకునేవాళ్ళు, కవిత్వం కలిసి ఆస్వాదించేవాళ్ళం. ఇంత పెద్ద సంఘటన ఆయన కళ్ల ముందు జరిగినా, ఆయనకు జరిగినట్టు తెలిసినా నాకు చెప్పకుండా ఉండేది కల్ల. కాబట్టి, ఆయన ఉన్న ఏ సభలో కూడా జరగలేదనీ, జరిగినట్టూ ఆయనకు తెలీదనీ కూడా ఖచ్చితంగా చెప్పగలను." అన్నారావిడ.

అంతేకాక ఇలా కొనసాగించారు - "ఇదొక జోకు. విశ్వనాథ, జాషువా పోయాక ప్రచారంలోకి వచ్చింది. నవ్వు పుట్టిస్తుంది, చమత్కారం ఉంది కాబట్టి పోతోంది తప్ప నిజానిజాలు ఎవరూ పట్టించుకోవట్లేదు" అని ఊరుకున్నారు.

ఆపైన విశ్వనాథ, జాషువా, నాయని సుబ్బారావుల వ్యక్తిత్వం, సాహిత్యం గురించి ఏవేవో విషయాలు మాట్లాడారు. సుబ్బారావు గారిని తలచుకుని ప్రశంసాపూర్వకంగా ఇంకాస్త మాట్లాడారు.

సారాంశం ఏమంటే - ఆవిడ పెళ్లిలోనూ జరగలేదు, ఆవిడ చూడగా జరగలేదు, ఆవిడకు తెలిసి జరగలేదు, ఆవిడ తండ్రి, ప్రముఖ భావకవి, సాహిత్య వ్యవహారాల్లో చురుగ్గా ఉండే నాయని సుబ్బారావుకు చూడగానూ, తెలిసీ కూడా జరగలేదు.
Read 7 tweets
Jul 9
శంకర్ సినిమాల నుంచి డ్రాయింగ్ రూముల వరకూ జర్మనీ, జపాన్‌ వంటి దేశాలతో పోల్చి భారతదేశాన్ని, మన జనాల క్రమశిక్షణా రాహిత్యాన్ని, మన నాయకుల అవినీతిని, మన వ్యాపారస్తుల దురాశని, ఇంకా బోలెడన్ని వాటిని తిడుతూ అందువల్లే మనం అభివృద్ధి చెందలేదని వాపోవడం కనిపిస్తుంది.

భారతదేశంతో జపాన్, జర్మనీ వంటి దేశాలను పోల్చడానికి లేదు. సింగపూర్ వంటి దేశాలతోనూ పోలుస్తూ ఉంటారు. అది కూడా సరికాదు. జపాన్, జర్మనీలు ఆ స్థాయిలో అభివృద్ధి చెందడానికి అత్యంత ముఖ్యమైన కారణం ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికా సంపూర్ణ సహాయం చేయడం. దానికి పరిపోషకమైన మరికొన్ని కారణాలు అక్కడి ప్రభుత్వాల ఆర్థిక విధానాలు, రెండో ప్రపంచ యుద్ధంలోని సర్వనాశనం నుంచి ఎదగాలన్న తాపత్రయం, రెండో ప్రపంచ యుద్ధం నాటికే ఆర్థిక శక్తులుగా ఎదిగిన చరిత్ర, సంస్కృతి ఉండడమూ - ఇలాంటివన్నీ వస్తాయి.

అయితే, అమెరికా-సోవియట్ యూనియన్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో ఇవి వ్యూహాత్మకంగా అమెరికాకు చాలా అవసరమైన ప్రదేశాలు కాకపోయి ఉంటే ఈ అభివృద్ధి కష్టం అయ్యేది అని నా అభిప్రాయం. జర్మనీ విషయంలో ఎలా ఉన్నా జపాన్ విషయంలో ఇది ఇంకా వాస్తవం.

రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇంగ్లీష్ పెద్దగా రాని అతి చిన్న దేశాలు (భారత దేశం తో పోలిస్తే) జర్మనీ, జపాన్ అద్భుతంగా అభివృద్ధి చెందడానికి అనుసరించిన విధానాలు ఏమిటన్నది తెలిస్తే భారతదేశంతో పోల్చుకుని మన దేశాన్ని తిట్టుకోవడం ఎందుకు సబబు కాదో అర్థమవుతుంది? కాబట్టి దానితో ప్రారంభిద్దాం.Image
జపాన్ ఆర్థిక అద్భుతం

జపాన్ 1945 నుంచి అమెరికన్ ఆక్రమణలో ఉంది. 1947 జపాన్ రాజ్యాంగాన్ని ప్రాక్టికల్‌గా అమెరికన్ ప్రభుత్వాధికారులు రాస్తే జపనీస్‌లోకి అనువదించుకుని ఆమోదించుకున్నారు. ఇంతే కాదు, రెండో ప్రపంచ యుద్ధ గాయాల వల్ల దేశం ఇంకెప్పుడూ సైనికీకరణ కాకూడదని ఏకంగా దేశానికి సైన్యమే వద్దని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ రక్షణ బాధ్యత కూడా నాటోకి అప్పగించేశారు.

రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ని ఆక్రమించుకున్న అమెరికా మొదట్లో క్రమేపీ అభివృద్ధి చేద్దామనే అనుకుంది. కానీ, అలా రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిందో లేదో ఇలా అమెరికా - సోవియట్ రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అనే చదరంగపు ఆట మొదలైంది.

కోల్డ్ వార్ లేదా ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికాకు, సోవియట్ రష్యాకు ముఖాముఖీ నేరుగా యుద్ధం జరగలేదు. అందుకు బదులుగా ఈ రెండు సూపర్‌ పవర్‌లూ తమదైన పద్ధతుల్లో తమ అనుకూలమైన బ్లాక్ దేశాలను మెయింటైన్ చేస్తూ, ప్రపంచంలోని పలు చోట్లు జరిగే యుద్ధాల్లో పాల్గొంటూ ప్రపంచ ఆధిపత్యం కోసం పెనుగులాడాయి.

ఈ చదరంగంలో భాగంగా జపాన్ చాలా కీలకమైన గడిలో ఉందన్నమాట. ఆ గడిలో ఉన్న జపాన్ బలంగా ఉండడం, ఆర్థికంగా సుసంపన్నంగా ఉండడం దాన్ని ఆక్రమించి, తర్వాత మిత్రరాజ్యంగా అయిన అమెరికాకు చాలా అవసరం. ఈ అవసరాలు, పరిస్థితులు వివరంగా చూద్దాం:
కొరియా యుద్ధం:

కొరియన్ ద్వీపకల్పం రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం కొరియాను ఉత్తర, దక్షిణ కొరియాలుగా సోవియట్ రష్యా, అమెరికా దళాలు ఆక్రమించాయి. 1949లో పొరుగునే ఉన్న చైనాలో కమ్యూనిస్టులు అంతర్యుద్ధంలో నెగ్గి మావో నేతృత్వంలో కమ్యూనిస్టు దేశంగా ఏర్పడింది. ఆ తర్వాత చైనా ప్రోత్సాహం, సహకారంతో ప్రారంభమైన కొరియన్ కమ్యూనిస్టు తిరుగుబాటు దాదాపు దక్షిణ కొరియా అంతటినీ ఆక్రమించుకుంది. దక్షిణ కొరియా ప్రభుత్వానికి సాయంగా అమెరికా రంగంలోకి దిగగా పూర్తిస్థాయిలో కొరియన్ యుద్ధంగా పరిణమించింది.

కొరియాకు శాపం అయిన ఈ యుద్ధం జపాన్‌కు వరంలా పరిణమించింది. జపాన్ - దక్షిణ కొరియా మధ్య దూరం అమెరికాతో పోలిస్తే చాలా తక్కువ కదా. అందువల్లనే ఈ యుద్ధానికి అవసరమైన సైనిక సామగ్రి అంతటినీ అమెరికా నుంచి తరలించుకు రావడం కన్నా జపాన్‌లో కొని దిగుమతి చేసుకోవడం మంచిదని అమెరికా నిర్ణయించుకుంది.

అమెరికన్ సైన్యానికి అవసరమైన లాజిస్టిక్ మెటీరియల్, సైనిక సామాగ్రి జపాన్‌లో విపరీతమైన డిమాండ్ సృష్టించింది. జపనీస్ పరిశ్రమలు నిర్విరామంగా పనిచేస్తూ ఆ డిమాండ్ అందుకున్నాయి. ఈ క్రమంలో 1950-53 సంవత్సరాల మధ్య 3.5 బిలియన్ డాలర్లు అమెరికా జపనీస్ కంపెనీలకు ఖర్చుపెట్టింది. ఈ పెట్టుబడి, డిమాండ్ వల్ల జపనీస్ ఆర్థిక వ్యవస్థ బాగా స్థిరపడింది.

ఈ దెబ్బతో జపాన్ రెండవ ప్రపంచ యుద్ధానికి పూర్వం ఉన్న స్థాయికి ఆర్థిక వ్యవస్థ రికవర్ అయిపోయి ఇక బౌన్స్ అవడానికి సిద్ధంగా ఉంది.
Read 13 tweets
Jul 1
ఈరోజు కె.వి.రెడ్డి పుట్టినరోజు. కె.వి.రెడ్డి నాకు అత్యంత ఇష్టమైన దర్శకుడు.

సినిమా దర్శకుడిగా కె.వి.రెడ్డి తనకంటూ ప్రత్యేకించిన కొన్ని పద్ధతులను తయారుచేసుకుని, ఆ ప్రకారం పనిచేశాడు. ఆ విశేషాలు కొన్ని:

ఒక్కసారి స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయాకా ఇక దానిలోని అక్షరాన్ని కూడా షూటింగ్ దశలో మార్చేవాడు కాదు. కె.వి. మాయాబజార్ తమిళ వెర్షన్ కోసం తమిళ హాస్యనటుడు తంగవేలును తీసుకున్నాడు. అప్పటికి ఎన్నో తమిళ సినిమాల్లో స్క్రిప్టులో లేని హాస్య సన్నివేశాలను సెట్లో అప్పటికప్పుడు డైలాగులు కల్పించి పనిచేసే పద్ధతి ప్రకారం పనిచేస్తున్న తంగవేలును అలా జోకులు, డైలాగులు సెట్లోనే కల్పించి చెప్పడానికి అవకాశం ఇమ్మని కోరాడు. కె.వి.రెడ్డి ఆ మాట నేరుగా కొట్టిపారేయకుండా "మీలాంటి సీనియర్ కమెడియన్ సినిమా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తూంటే కాదనే మూర్ఖుడిని కాదు" అంటూనే మాయాబజార్ తమిళ వెర్షన్ బౌండ్ స్క్రిప్ట్ చేతికి ఇచ్చి, పదిహేను రోజులు మీ దగ్గర ఉంచుకుని ఆ జోకులు, డైలాగులు ఏవో ఈ దశలోనే చెప్పండి చర్చించి బావుంటే చేర్చుకుందాం అని తేల్చాడు. చదివిన తంగవేలు స్క్రిప్ట్ ఇస్తూ ఇంత పర్ఫెక్ట్ స్క్రిప్టులో మార్పుచేర్పులు ఏమీ చెప్పలేం అని, అందులో ఉన్నది అక్షరం మార్చకుండా అనుసరించి చేస్తానని చెప్పాడు. ఇలా ఏ స్థాయి వ్యక్తి అయినా స్క్రిప్ట్ దశలో సలహాలు ఇస్తే పరిశీలించేవాడు, తాను మొత్తం సినిమాని దృష్టిలో ఉంచుకుని తుది నిర్ణయం తాను తీసుకునేవాడు. కానీ చిత్రీకరణ దశకు వెళ్ళాక మాత్రం స్క్రిప్ట్ మార్పులకు చాలా వ్యతిరేకి. "ఫాన్ కింద కూర్చుని పదిమంది ప్రశాంతంగా ఆలోచించి స్క్రిప్ట్ దశలో తీసుకునే నిర్ణయాల కన్నా లైట్లు, చెమట, టెన్షన్ మధ్యలో సెట్స్ మీద తీసుకునే నిర్ణయాలు సరైనవి ఎలా అవుతాయని" అడిగేవాడు.Image
సహకరించని మేధావి కన్నా, సహకరించి పనిచేసే సాధారణమైన వ్యక్తితో పనిచేయడం మేలు అన్నది సాంకేతిక నిపుణులను ఎన్నుకోవడంలో అతని పద్ధతి.

బి.ఎన్.రెడ్డి తనకు మల్లీశ్వరి సినిమాకి పనిచేసిన కవి, రచయిత కృష్ణశాస్త్రిని, సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావును పెద్దమనుషులు సినిమాకి పెట్టుకొమ్మని సలహా ఇస్తే "నాకీ మహాకవులు, జీనియస్సులు వద్దు బ్రదర్" అని సున్నితంగా తిరస్కరించాడు.

ఒక సమయంలో ఒకే సినిమా మీద పనిచేసేవాడు. మిగిలిన వాళ్ళు రెండు సినిమాల మీద ఒకేసారి పనిచేస్తున్నారు కదాని చెప్తే "ఐ డోన్ట్ హావ్ టూ బ్రెయిన్స్" అన్నది అతని సమాధానం. అలాగే తనకు పనిచేసే కథా రచయిత కూడా తన సినిమా పూర్తయ్యేదాకా వేరే సినిమాలకు రాయకూడదన్నది కె.వి.రెడ్డి నియమం. ఆ పద్ధతిలోనే మొదట పనిచేసిన సీనియర్ సముద్రాల, తర్వాత పింగళి, డి.వి.నరసరాజు అదే పద్ధతిలో పనిచేశారు.Image
సినిమా ఎలా తయారవ్వాలన్న విషయాన్ని చాలా విపులంగా ఆలోచించుకునేవాడు, అది 100 శాతం ఉంటే 99 శాతానికో, 98 శాతానికో సంతృప్తి పడకుండా ఖచ్చితంగా వంద శాతం వచ్చేలా చేసేవాడు. అలా రావడానికి వివిధ పద్ధతులు, విధానాలు రూపొందించుకుని పనిచేసేవాడు. అతను సినిమా ప్రారంభించక ముందు స్క్రిప్టు మీద, పాత్రధారుల ఎంపిక, రూపకల్పన వంటి విషయాల మీద చాలా గట్టి కసరత్తు చేసేవాడు. తాను, తన రచయితల (సాధారణంగా పింగళి నాగేంద్రరావు కానీ, డి.వి.నరసరాజు కానీ), తన సహ దర్శకుడు (చాలా చిత్రాలకు కమలాకర కామేశ్వరరావు) ప్రధానమైన కథా చర్చల బృందం. వీరందరూ అధమపక్షం ఆరునెలలు కూర్చుని తాము అనుకున్న మూల కథాంశాన్ని పూర్తిస్థాయి కథగా అభివృద్ధి చేశాక, స్క్రీన్ ప్లే రాసుకునేవారు.

సూక్ష్మమైన విషయాలను సైతం సినిమా స్క్రీన్ ప్లేలో రాసేవాడు.జగదేకవీరుని కథ స్క్రిప్టులో సెట్ ప్రాపర్టీల వివరాలు నిర్దేశిస్తూ తేలు కావాలని రాసి, అది బతికున్న తేలు అయివుండాలని చేర్చిన వివరణ కూడా కె.వి.రెడ్డి సూక్ష్మతరమైన పరిశీలన, నిర్దేశాలకు మచ్చుతునక.
Read 9 tweets
Jun 9
చెరుకూరి రామోజీరావు. గత అర్థశతాబ్ది కాలంగా తెలుగు రాజకీయాలపై లోతైన ప్రభావం చూపించే మార్పుల్ని, మలుపుల్ని తెచ్చిన గుప్పెడుమంది పేర్లు రాస్తే అందులో ఈ పేరు నిస్సందేహంగా వస్తుంది. ముఖ్యమంత్రులను నిలబెట్టారు, పడగొట్టారు, ముఖ్యమంత్రుల వల్ల పడ్డారు, లేచారు. ఆయన సృష్టించినదొక చరిత్ర. ఈ సందర్భంగా ఆయన గురించి నాకు తెలిసిన, తెలుసుకున్న ఆసక్తికరమైన సంగతులు చెప్తాను.Image
"ఈనాడు" పేరు - బ్రాండింగ్ సూత్రాలు
పూర్వం ప్రముఖ పత్రికల పేర్లు - "ఆంధ్రపత్రిక", "ఆంధ్రజ్యోతి", "ఆంధ్రప్రభ", "విశాలాంధ్ర", "ప్రజాశక్తి", "గోల్కొండ", "మీజాన్", "కృష్ణాపత్రిక". ఈ పేర్ల మౌలిక లక్షణాలు:
1. చాలావరకూ పొడవు పేర్లు. 4-5 అక్షరాలు, 7-9 మాత్రలు ఉన్నవి ఎక్కువ.
2. చాలావరకూ ప్రదేశాన్నో, ప్రాంతాన్నో సూచిస్తున్నాయి,. అరుదుగా సిద్ధాంతాన్ని.
3. చాలామందికి పలకడానికి కష్టమైన పేర్లు.
"ఈనాడు" అన్న పేరులో ఈ మూడు ఇబ్బందులూ లేవు. తేలికైన పేరు, మూడక్షరాలు, ఐదుమాత్రల సులువైన అచ్చతెలుగు పేరు. వార్తాపత్రిక మౌలిక లక్షణమైన ప్రస్తుతం అన్నదాన్ని సూచించే పేరు.

ఈ పేరును ఇలా పలకలు పలకలుగా ఫాంట్ చేయడం వెనుక కూడా మిగిలిన అన్ని పత్రికల డిజైన్‌కూ దూరంగా స్వంత ముద్ర వేయడం కనిపిస్తుంది.

ఈ ఫాంట్ రూపకల్పన చేసిన వ్యక్తి రాసిన వ్యాసం నా దగ్గర ఎక్కడో ఉండాలి. దొరికితే ఇస్తా.Image
ఎర్ర స్కెచ్‌పెన్‌తో ఈనాడు మీద నిత్యం నోట్స్
కొన్న దశాబ్దాల పాటు రామోజీరావు దినచర్యలో అత్యంత ముఖ్యమైన భాగం ఈనాడు పేపర్‌లోని ప్రతీ పేజీని క్షుణ్ణంగా చదివి, నిశిత విమర్శనాత్మక దృష్టితో ఎర్ర స్కెచ్‌పెన్‌తో తప్పొప్పులను రాసి పంపడం. "ఈ వార్త ఐదవ పేజీలో ఎందుకుంది? దీని ప్రాధాన్యత మొదటి పేజీ కాదా?", "ఈ పదం వాడొద్దని నిర్ణయించాము", "కంగ్రాచ్యులేషన్స్", "మంచి శీర్షిక", "మొదటి పేజీలో దీన్నెందుకు వేశారు?", "పాఠకులకు అయోమయం కలిగించే ఇంట్రో" అంటూ పత్రిక పాలసీని బట్టి మొదటి పేజీ నుంచి ప్రతీ జిల్లా పేజీ వెతికి వెతికి నోట్స్ రాసేవారు. దాన్ని యంత్రాంగం మథించి, మంచిచెడులకు తగ్గట్టు ఆయా విలేకరులకు పంపించేంది.Image
Read 11 tweets
Jun 2
కర్ణాటక, తమిళనాడు, కేరళ లకు ప్రదేశ్ లేదు కదా, మరి ఆంధ్ర రాష్ట్రానికి ప్రదేశ్ అని ఎందుకు పెట్టారు?
అని కోరాలో ఒక ప్రశ్న అడిగారు గతంలో. చాలా ఆసక్తికరమైన సంగతి ఇది. దానికి నా జవాబు ఇది:

ప్రదేశ్ అన్న పదం మన భాషల్లో ప్రాంతాన్ని సూచించే పదం కాదు కాబట్టి. అసలైతే, మనమే పెట్టుకుని ఉండకూడదు కాబట్టి. తెలుగు నాడు, ఆంధ్ర దేశం, తెలుగు దేశం (పార్టీ పేరు కాదు లెండి, పార్టీ పెట్టింది 1982లో, రాష్ట్ర ఏర్పాటు 1956లో) - ఇలాంటి పేరు ఏదైనా పెట్టి ఉండవచ్చు. అసలు వీటన్నిటి కన్నా "విశాలాంధ్ర/విశాలాంధ్రం" అన్నది సరైన పేరు. (ఎందుకన్నది తర్వాత చూద్దాం)

ఈనాడు 60 ఏళ్ళ పైచిలుకు విని, దానితో మానసికంగా అనుబంధం పెంచుకున్న ఆంధ్ర ప్రదేశ్‌ వాసులకు ఆ మాట రుచించకపోవచ్చు కానీ ఆంధ్ర ప్రదేశ్ అన్న పేరు అసమంజసం.

ఎందుకంటే...Image
ముందుగా కొన్ని చారిత్రక వాస్తవాలు చెప్పుకుంటే స్పష్టంగా ఉంటుంది:

- 1948లో భారత ప్రభుత్వం పోలీసు చర్య జరిపి ఏడవ నిజాంని తొలగించి, హైదరాబాద్‌ రాష్ట్రాన్ని భారతదేశంలో కలిపారు. అది హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడింది. అంతకుముందు హైదరాబాద్ రాజ్యం అనేవారు దాన్ని, ఆ పేరే కొనసాగించారు. (నైజాం అన్నది కేవలం జన వ్యవహారం) అందులో నేటి తెలంగాణ, ఈనాడు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ డివిజన్‌గా ఉన్న మరాఠ్వాడా, ప్రస్తుతం కర్ణాటకలో కళ్యాణ్ కర్ణాటక అని పిలుస్తున్న రాయ్‌చూర్-గుల్బర్గా ఇత్యాది జిల్లాలు భాగం.

- 1953లో మద్రాసు రాష్ట్రంలో రాజధాని మద్రాసు వదులుకుని, ఎక్కువశాతం తెలుగు జిల్లాలు విడిపోయి ఏర్పడిన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇందులో ప్రదేశ్ లేదు. తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం గారు.

- తెలుగు వారి కృషి, పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనల ఫలితంగా 1956లో రాష్ట్రాల పునర్విభజన కమీషన్ తుదకు భాషా ప్రయుక్త రాష్ట్రాలను విధానపరంగా ఆమోదించింది. ఆ క్రమంలో హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలు (లేక తెలంగాణ), ఆంధ్ర రాష్ట్రం కలిసి ఆంధ్ర ప్రదేశ్ అవతరించింది. ఇప్పుడు హఠాత్తుగా ప్రదేశ్ వచ్చేసింది.

ఆంధ్ర అన్న పదం వరకూ 1956 నాటికి విస్తృతమైన ఆమోదం ఉంది. ఈనాడు ఆంధ్ర అనే శబ్దానికి కోస్తాంధ్ర, రాయలసీమ వారన్న అర్థం స్థిరపడుతూ వస్తోంది కానీ బ్రిటీష్‌ పాలనా కాలంలోనూ, స్వాతంత్ర్యం వచ్చిన తొలి దశాబ్దంలోనూ ఆంధ్ర శబ్దం తెలుగుకు పర్యాయపదంగా అటు తెలంగాణ వారు, ఇటు కోస్తాంధ్ర-రాయలసీమ వారూ కూడా వాడేవారు.

ఉదాహరణకు తెలంగాణలో తెలుగు వారు తమ భాషా సంస్కృతులను పరిరక్షించే సంస్థ నెలకొల్పినప్పుడు దాని పేరు ఆంధ్ర మహాసభగా పెట్టారు, 1901లో సుల్తాన్ బజార్‌లో నెలకొల్పిన గ్రంథాలయం పేరు శ్రీకృష్ణదేవరాయాంధ్ర గ్రంథాలయం, తెలంగాణ వారైన సురవరం ప్రతాపరెడ్డి గారు తెలుగువారి సాంఘిక చరిత్ర రాసి దానికి పెట్టిన పేరు "ఆంధ్రుల సాంఘిక చరిత్ర", అసలు హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగువారు తమ సంస్కృతి పరిరక్షణకు ప్రారంభించిన ఉద్యమం పేరే ఆంధ్రోద్యమం, దీని గురించి మాడపాటి హనుమంతరావుగారు "తెలంగాణములో ఆంధ్రోద్యమము" అని రాశారు. ఏతావతా, ఆంధ్ర అన్న పదం అత్యధికులకు ఆనాడు ఆమోదయోగ్యమే.

ఐతే, దీన్ని ఆంధ్ర అని ఊరుకోకుండా మరేదో చేర్చడానికి కారణం బహుశా ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ కలిసినట్టు ఉండకూడదనీ, రెండూ కలిసి కొత్త రాష్ట్రం ఏర్పడిందని సూచించాలని. (మూలం: ఆంధ్రప్రదేశ్ గా కొత్త రాష్ట్రం పేరు మార్చాలని సూచన; ఆంధ్ర ప్రభ, 1956 మార్చి 23, పేజీ 1.)Image
ఆ ఏర్పడే కొత్త పేరు విశాలాంధ్ర/విశాలాంధ్రం అయితే బాగానే ఉండేది.

నిజానికి, తెలుగువారు రాజకీయంగా ఐక్యత సాధించాలన్న ఉద్యమానికి పెట్టిన పేరు "విశాలాంధ్ర ఉద్యమం". 1949లో విశాలాంధ్ర మహాసభ హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పడినా, ఆ తర్వాత దాశరధి కృష్ణమాచార్యులు మహాంధ్రోదయము కావ్యంలో పలుమార్లు ఉటంకించినా, తెలుగునాట కమ్యూనిస్టులు పరితపించినా దాని పేరు "విశాలాంధ్ర" లేక "విశాలాంధ్రము". పార్టీకి ఆ పదంతో అంత అనుబంధం ఉండబట్టే కమ్యూనిస్టు పత్రిక, ప్రచురణ సంస్థ, పుస్తక విక్రయ కేంద్రాలూ - అన్నీ "విశాలాంధ్ర" పేరుతో ఏర్పడ్డాయి. ఈ పదాన్ని కమ్యునిస్టులు బాగా వాడడంతో క్రెడిట్ వారికి పోతుందని విడిచిపెట్టారో ఏమో తెలియదు. కానీ, సంకుచితంగా పార్టీ దృక్పథంతో ఆలోచించకుండా ఉంటే విశాలాంధ్ర అన్నది మంచి పేరు, ఆంధ్ర ప్రదేశ్ కన్నా మంచి పేరు.

1956 ఫిబ్రవరి నెల వరకూ తెలంగాణ-ఆంధ్ర ప్రాంతాలు కలిసి ఏర్పడాలని ప్రతిపాదిస్తున్న రాష్ట్రాన్ని విశాలాంధ్ర అని ఎన్నో మార్లు పత్రికల్లో ప్రస్తావన కనిపిస్తుంది. ఉదాహరణకు 1956 ఫిబ్రవరి 19-25 ఆంధ్ర పత్రిక మొదటిపేజీలో విశాలాంధ్ర పదం ప్రస్తావనతో తయారు చేసిన బొమ్మ ఈ కింద చూడండిImage
Read 8 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us!

:(