ఆదిత్య శివశంకర కలకొండ Profile picture
తెలుగుభాష అభిమానిని , తల్లి తెలుగుభాషను బ్రతికించడానికి నావంతు ప్రయత్నం చేస్తున్న ఆశావాదిని... సినిమాలు, పుస్తకపఠనం, సంగీతం, సాహిత్యం ఇష్టమైనవి..

Oct 18, 2022, 9 tweets

#స్వధర్మాచరణయే_శ్రేయస్కరం

పాలకుర్తి రామమూర్తి గారి వ్యాసం..

అయ మమృత నిధానం నాయకో ఔషధీనాం
అమృతమయ శరీరః కాన్తియుక్తో౨పి చంద్రః
భవతి విగత రష్మిః మండలే ప్రాప్య భావః
పరసదన నివిష్టః కో లఘుత్వం న యాతి!
(చాణక్య నీతి)

చంద్రుని శరీరమే అమృతముతో నిండినది.

అతడు ఓషధులకు అధిపతి (సోమః ఓషధీనా మధిపతిః). అసమాన సౌందర్యం అతని స్వంతం. అయినా సూర్యోదయమవగానే చంద్రుడు తేజస్సును కోల్పోతాడు. అతనిలో ఉన్న అమృతము కూడా అతని కళలను నిలుపలేదు. రాత్రనేది చంద్రుని భవనమయితే, పగలు సూర్యుని భవనంగా చెపుతారు. పరాయి ఇంటిలో ఉండవలసి వస్తే ఎవరికయినా ఆశించిన

గౌరవం లభించదు. పరాయి పంచన బ్రతకడం ఎంతవారికయినా దుఃఖమయమే అంటాడు, #చాణక్యుడు.

మన ఇంటిలాంటిది "స్వధర్మం". ఇతరుల ఇంటిలాంటిది "పరధర్మం". ఎంత జాగ్రత్తగా, భయభక్తులతో ఉన్నా పరాయి ఇంటిలో ప్రశాంతత ఉండదు. అదే మన ఇంటిలో మనమెలా ఉన్నా సుఖంగా ఉంటుంది.

"శ్రేయాన్ స్వధర్మః విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్, స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మః భయావహః"!

చక్కగా ఆచరించిన పరధర్మాని కన్నా నిష్ఠగా ఆచరించని మన ధర్మమే మేలైనది. స్వధర్మాచరణలో చావయినా మంచిదే, పరధర్మమెప్పుడూ భయంకరమైనదే, అంటుంది, #భగవద్గీత.

ప్రేయస్సు, శ్రేయస్సు అనే రెండు మార్గాలు

మనముందున్నాయి. సక్రమమా అక్రమమా అనే ఆలోచన లేకుండా ఐహిక భోగభాగ్యాలు పొందేందుకు పరధర్మాన్ని ఆచరించడం ఒక మార్గం. అది ప్రేయోమార్గం. స్వధర్మాచరణలో, న్యాయబద్ధంగా, అర్థకామాలను సాధిస్తూ, వాటిని అర్హులతో, ఆర్తులతో పంచుకుంటూ, సంపదను సద్వినియోగం చేస్తూ మోక్ష మార్గాన్ని ఆశ్రయించడం

రెండవ మార్గం. అది శ్రేయోమార్గం. ఇందులో దేనిని ఎన్నుకుంటావో నీ స్వేచ్ఛ అంటుంది, కఠోపనిషత్తు.

స్వధర్మం అంటే ఏమిటి? "సహజ స్వీకృతి"ని స్వధర్మంగా చెప్పుకోవచ్చు. దేశకాలమాన పరిస్థితులకు, నమ్మకాలకు, విశ్వాసాలకు అతీతంగా, శాశ్వత విలువల ఆధారంగా, సమత్వ దృష్టి కోణంలో ఆవిష్కృతమై,

ఏ ప్రలోభాలకు, భయాలకు లోనుగాని మానసిక సన్నద్ధతయే "స్వధర్మం"గా చెప్పబడుతుంది. స్వార్ధ ప్రయోజనాలకో, ప్రలోభాలకో, భయానికో లొంగిపోయి ధర్మమార్గాన్ని అతిక్రమించడం "పరధర్మం" గా చెప్పుకుంటాము.

"స్వధర్మం" మన ఇంటి లాంటిది. అది ఎలా ఉన్నా, అందులో మనమెలా ఉన్నా హాయిగా ప్రశాంతంగా "జీవించవచ్చు".

"పరధర్మం" పరాయివారి ఇంటిలాంటిది. ఎప్పుడూ భయపడుతూ "బ్రతకాలి". స్వధర్మం శ్రేయస్సు నిస్తుంది. పరధర్మం ప్రేయస్సు నిస్తుంది. ఏ మార్గంలో నడవాలో నిర్ణయం మనదే. కర్తవ్య నిర్వహణలో ఎవరైనా నీతి నిజాయతీతో పనిచేస్తే స్వధర్మాన్ని అనుసరించిన వారవుతారు. స్వార్ధపరులై అక్రమమార్గంలో పయనిస్తే

పరధర్మాన్ని అనుసరించిన వారవుతారు.

భోగభాగ్యాలను ఆశిస్తూ పరుల పంచన అవమానాలను భరించడం కన్నా ఉన్నదానితో తృప్తిగా, శాంతియుతంగా జీవించండని ఆచార్య చాణక్యులు చక్కని ఉదాహరణతో, ఉత్తమ జీవన మార్గాన్ని బోధిస్తున్నారు.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling