చందమామ పత్రిక ఎలాగైతే నా చిన్నతనంలో తెలుగు వైపుకు మళ్ళించి, ఊహకు రెక్కలు తొడిగిందో, అలానే కౌమారానికి, యౌవనానికి మధ్య కాలంలో నన్ను తీర్చిదిద్దడంలో ఎంతో పనికివచ్చినది ఈ హాసం పత్రిక. ఈ అక్టోబరుకు హాసం పత్రిక ప్రారంభమై 20 ఏళ్ళు నిండి 21 ఏడు ప్రారంభమైంది.
#అభిరుచి #తెలుగు #పత్రిక
ఇది ప్రారంభమైన ఏడాదికి కానీ నాకు పరిచయం కాలేదు. అప్పటికి నేను తొమ్మిదో క్లాసు చదువుతున్నాను. మా తాడేపల్లిగూడంలోని సత్యసాయి సేవాసమితిలో ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూంటే పాల్గొనడానికి వెళ్ళినప్పుడు, అక్కడ మా సీనియర్ ఒక అబ్బాయి (పదో తరగతి అన్నమాట అతను చదివేది) ఎదురుపడ్డాడు.
అతను ఆశ్చర్యపోయాడు నువ్వూ ఇక్కడికి వస్తావా అని. ఆ తర్వాత నన్ను కాసేపు ఇంటర్వ్యూ చేశాడు, ఇష్టమైన సినిమాలు, నచ్చే సంగీతం, పుస్తకాలేమైనా చదివావా అన్న టైపులో. అప్పుడు నాక్కూడా (అతనికి తన టైపు జనం ఉండరని గట్టి నమ్మకం కలిగినట్టుంది)
మంచి టేస్టు ఉందని హాచ్చెర్యపోయి బహుమతిగా ఆ నెల హాసం పత్రిక సంచిక ఇచ్చి, చదివి వారంలో ఇచ్చెయ్యమన్నాడు. చదివి చూస్తే ఇంకేముంది, అది తేనె ఊరే బావిలో దిగడమే అయింది. ఇక లేవలేదు.
పాటలు పాడే బాలసుబ్రహ్మణ్యం, విలన్ వేషాలు వేసుకునే తనికెళ్ళ భరణి - ఒకరు బాపు రమణల గురించో, సినిమా పాటల్లో తెలుగు పదాల గురించో రాస్తూ, మరొకరు తేనె సోనల్లాంటి వాక్యాలతో ఎందరో మహానుభావులంటూ సంగీత విద్వాంసులను పరిచయం చేస్తూ పుంభావ సరస్వతుల్లా దర్శనమిచ్చారు.
సినిమాలను వెండితెర నవలల్లా సెలబ్రేట్ చేయడం ఎదురయింది.
డాక్టర్ డూ లిటిల్ మొదలుకొని వూడ్‌హౌస్ నవలల వరకూ పలు ఆంగ్ల హాస్య క్లాసిక్స్ పరిచయం కావచ్చాయి.
తెలిసుననుకున్న బాపురమణల్లోనూ, జంధ్యాలలోనూ పలు కొత్త కోణాలు కనిపించసాగాయి. సాలూరి రాజేశ్వరరావు వంటివారు లెజెండ్సనీ, అది కూడా ఇందుకు లెజెండ్సనీ తెలియవచ్చేది.
నవ్వుటద్దాలు అన్న చక్కని శీర్షికలో ఆచార్య తిరుమల చమత్కారాన్ని పుట్టించే పద్యాలెన్నిటినో ఏరుకువచ్చి గుదిగుచ్చి అందించేవారు. కరాజు కథలు పేరుతో మంచి ఆసక్తికరమైన జానపద కథలను రాసేవారు సింగీతం శ్రీనివాసరావు.
పత్రికలో వచ్చే హిందీ పాటల విశేషాలు, కొత్త సినిమా పాటల విశ్లేషణ వంటివన్నీ చాలా బావుండేవి. మా నాన్నగారికి హిందీ పాత పాటలు ఇష్టం. ఈ పత్రికలో ఆ పాటలు చూసి, రాగవరుస తెలియక ఆయనను అడిగితే చాలావరకూ టకీమని పాడి వినిపించగలిగేవారు.
ఇది వారపత్రికా కాదు, మాసపత్రికా కాదు. పక్షపత్రిక. 15 రోజులకు ఒకసారి వచ్చేది. చందా కట్టగలిగేవాళ్ళం కాదు. ఏ పక్షానికి ఆ పక్షం, ఊరు మొత్తానికి ఒకే ఒక కిళ్ళీ కొట్టు ఉంటే వెళ్ళి కొని తెచ్చుకునేవాళ్ళం. నేనూ, నాన్నగారూ, మా చెల్లెలూ, మిగతా కుటుంబసభ్యులూ కూడా చదివేవాళ్ళం.
ఒక సంచిక దొరక్కపోతే ఎంతో బాధపడేవాళ్ళం. ఏం మిస్సవుతున్నామో తెలియదు కదా.
హాసం క్లబ్బులు అని వెలిసాయి అక్కడక్కడా, వాటి వివరాలు హాసం పత్రికలో వచ్చేవి. నేనూ మా నాన్నగారూ కలిసి తాడేపల్లిగూడెంలో ఓ హాసం క్లబ్బు నడపాలని (అవును, 10 తరగతి వయసుకే) నాకు ఎంతో ఉండేది. పడలేదు.
2004లో ఒక చెడ్డరోజున పత్రిక ఆగిపోతున్నట్టు ప్రకటించారు. నేనూ, నాన్నగారూ, చెల్లాయి, ఇంటిల్లిపాదీ చాలా బాధపడ్డాం. నెలనెలా సంచిక కొన్నా కూడా చందా అంటే ఏడాదికి ఒకేసారి కమిట్ అవడం కదా, నాలాంటివాళ్ళు చందా కట్టకపోవడం వల్లనే ఆగిపోయిందేమో అనిపించేది ఆ చిన్నతనంలో!
కానీ, నా రెక్కలు చిన్నవి. నాన్నగారి బాధ్యతలు పెద్దవి. క్రమేపీ, తెలుగువారి నిర్లక్ష్యం వల్లనే ఆగిపోయిందనీ, మరోటనీ అనిపించింది. చాలా చాలా బాధ కలిగింది, ఆ బాధ చాన్నాళ్ళు అలాగే సలిపింది!
హాసం పత్రిక నిర్వహించిన వరప్రసాదరెడ్డి గారు తన తల్లిగారి పేరిట శాంతా బయోటిక్స్ అన్న సంస్థ ద్వారా టీకాలు రూపొందించి తక్కువ ధరకు అందిస్తున్నారనీ, ఆయనే అభిరుచి మేరకు ఈ హాసం నడిపారనీ తెలుసుకున్నాను. నా వరకూ నాకు ఆయన కృష్ణదేవరాయలు, భోజరాజు వంటివారి అంశతో పుట్టినవారు అనిపించేది.
తర్వాత ఏడాది వరప్రసాద్ రెడ్డి గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిందని వార్తలు చదివి కూడా సంతోషించాను. సంపాదకులు రాజా గారూ, మేనేజింగ్ ఎడిటర్ ఎమ్బీయస్ ప్రసాద్ గారూ వివిధ శీర్షికలు నిర్వహించేవారు. వీరందరినీ ఎంతగానో అభిమానించాను.
వరప్రసాద రెడ్డి గారు హాసం పబ్లికేషన్స్ తీసుకువస్తున్నామనీ, ఈ శీర్షికలన్నిటినీ పుస్తకాలుగా వేస్తామనీ రాశారు. ఆ పుస్తకాలను క్రమేపీ కొనుక్కోగలిగాను. కానీ, నా బాధ పోలేదు.
హాసం నిలిపివేసిన కొన్నాళ్ళు తమవద్ద ఉన్న హాసం పత్రిక ఆర్కైవ్స్ అన్నిటినీ అమ్ముతామని రాశారు. కొనుక్కోలేకపోయాను. అది చాన్నాళ్ళు నా మనసులో లోటుగానే ఉండిపోయింది.
ఓ పదో పరకో హాసాలు నా దగ్గర ఉండేవి. తోచనప్పుడు, తోచినప్పుడు కూడా తెరిచి చదివి ఆనందించేవాడిని. తర్వాత్తర్వాత హాసం ఆఖరు సంచికలో ఆర్కైవులు అన్నీ అమ్ముతాం, వీపీపీ ద్వారా తెప్పించుకోవచ్చు అన్న ప్రకటన చూసినప్పుడల్లా గుండె కలుక్కుమనేది. ఏదోకటి చేసి అప్పుడే కొనుక్కోవాల్సింది అనిపించేది.
2016-17 కాలంలో మనసున్న మిత్రులు ఒకరి దగ్గర హాసం పత్రికల కాపీలన్నీ కనిపించాయి. ఎవరివి ఇవి అని అడిగాను - "మనవే, మీకు కావాలంటే ఇకనుంచీ మీవే, పట్టుకుపోవచ్చు. కావాలా?" అన్నారు.
"ఇంతకన్నా ఆనందమేమీ.. ఓ రామ రామా" అనుకుని ఆలస్యం అమృతం విషం అన్నారు కదా అని అర నిమిషంలో అన్నీ మూటకట్టేసి, బ్యాగులో పెట్టేసి నమస్కారం చేశాను. అప్పటి నుంచీ నా వద్ద అన్ని హాసాలూ ఉన్నాయన్నమాట. గొప్ప సంతృప్తి కలిగింది.
వరప్రసాదరెడ్డి గారిని అనుమతి అడిగి పీడీఎఫ్ రూపంలో ఆర్కైవ్.కాంలో హాసం సంచికలన్నీ పెట్టించాడు నాకు తెలిసిన ఒక మిత్రుడు. చాలా ఆనందం కలిగింది. (ఈ లోకోపకారం చేసిన మిత్రుని పేరు చెప్పాలనే ఉంది కానీ ఆయనో కాదో అన్న అనుమానం పీకుతోంది అందుకే చెప్పట్లేదు)
archive.org/details/HasamT…
కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో మ్యూజికాలజిస్టు రాజా గారు పరిచయం అయ్యారు. ఫోన్‌లో గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్ళం. ఆయన Quora తెలుగులో రాయడం ప్రారంభించారు. దురదృష్టవశాత్తూ నా ఆనందం ఎంతో కాలం నిలవలేదు. 2021 ఏప్రిల్లో ఆయన పరమపదించారు.
సంగీతం పట్ల నాకున్న అభిరుచికి లోతు పెంచి, నేను చూడాల్సిన సినిమాల జాబితాను విస్తరించి, చూసినవాటిలో కొత్త కోణాలు చూపించి, మహనీయుల పేర్లు, కృషీ తెలిసేలా చేసిన నిధి హాసం. ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించిన బోలెడంతమంది మహానుభావులను వేలుపెట్టి చూపిన చదువులమ్మ హాసం.
అలాంటి హాసం ఆగిపోవడం అప్పట్లో బాధ కలిగినా, వెనుదిరిగి చూస్తే అసలంటూ అది నడవడమూ, నాకు నా సీనియర్ పరిచయం చేయడమూ, నా అభిరుచిని అది పాదుపెట్టి పెంచడమూ తలచుకుంటే ఆనందంగానే ఉంటుంది. జరగని వాటి పట్ల ఆవేదనేనా ఎప్పుడూ, జరిగినదానికి సంతృప్తి కూడా ఉండాలి కదా మనిషికి?!
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.