చందమామ పత్రిక ఎలాగైతే నా చిన్నతనంలో తెలుగు వైపుకు మళ్ళించి, ఊహకు రెక్కలు తొడిగిందో, అలానే కౌమారానికి, యౌవనానికి మధ్య కాలంలో నన్ను తీర్చిదిద్దడంలో ఎంతో పనికివచ్చినది ఈ హాసం పత్రిక. ఈ అక్టోబరుకు హాసం పత్రిక ప్రారంభమై 20 ఏళ్ళు నిండి 21 ఏడు ప్రారంభమైంది. #అభిరుచి#తెలుగు#పత్రిక
ఇది ప్రారంభమైన ఏడాదికి కానీ నాకు పరిచయం కాలేదు. అప్పటికి నేను తొమ్మిదో క్లాసు చదువుతున్నాను. మా తాడేపల్లిగూడంలోని సత్యసాయి సేవాసమితిలో ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూంటే పాల్గొనడానికి వెళ్ళినప్పుడు, అక్కడ మా సీనియర్ ఒక అబ్బాయి (పదో తరగతి అన్నమాట అతను చదివేది) ఎదురుపడ్డాడు.
అతను ఆశ్చర్యపోయాడు నువ్వూ ఇక్కడికి వస్తావా అని. ఆ తర్వాత నన్ను కాసేపు ఇంటర్వ్యూ చేశాడు, ఇష్టమైన సినిమాలు, నచ్చే సంగీతం, పుస్తకాలేమైనా చదివావా అన్న టైపులో. అప్పుడు నాక్కూడా (అతనికి తన టైపు జనం ఉండరని గట్టి నమ్మకం కలిగినట్టుంది)
మంచి టేస్టు ఉందని హాచ్చెర్యపోయి బహుమతిగా ఆ నెల హాసం పత్రిక సంచిక ఇచ్చి, చదివి వారంలో ఇచ్చెయ్యమన్నాడు. చదివి చూస్తే ఇంకేముంది, అది తేనె ఊరే బావిలో దిగడమే అయింది. ఇక లేవలేదు.
పాటలు పాడే బాలసుబ్రహ్మణ్యం, విలన్ వేషాలు వేసుకునే తనికెళ్ళ భరణి - ఒకరు బాపు రమణల గురించో, సినిమా పాటల్లో తెలుగు పదాల గురించో రాస్తూ, మరొకరు తేనె సోనల్లాంటి వాక్యాలతో ఎందరో మహానుభావులంటూ సంగీత విద్వాంసులను పరిచయం చేస్తూ పుంభావ సరస్వతుల్లా దర్శనమిచ్చారు.
సినిమాలను వెండితెర నవలల్లా సెలబ్రేట్ చేయడం ఎదురయింది.
డాక్టర్ డూ లిటిల్ మొదలుకొని వూడ్‌హౌస్ నవలల వరకూ పలు ఆంగ్ల హాస్య క్లాసిక్స్ పరిచయం కావచ్చాయి.
తెలిసుననుకున్న బాపురమణల్లోనూ, జంధ్యాలలోనూ పలు కొత్త కోణాలు కనిపించసాగాయి. సాలూరి రాజేశ్వరరావు వంటివారు లెజెండ్సనీ, అది కూడా ఇందుకు లెజెండ్సనీ తెలియవచ్చేది.
నవ్వుటద్దాలు అన్న చక్కని శీర్షికలో ఆచార్య తిరుమల చమత్కారాన్ని పుట్టించే పద్యాలెన్నిటినో ఏరుకువచ్చి గుదిగుచ్చి అందించేవారు. కరాజు కథలు పేరుతో మంచి ఆసక్తికరమైన జానపద కథలను రాసేవారు సింగీతం శ్రీనివాసరావు.
పత్రికలో వచ్చే హిందీ పాటల విశేషాలు, కొత్త సినిమా పాటల విశ్లేషణ వంటివన్నీ చాలా బావుండేవి. మా నాన్నగారికి హిందీ పాత పాటలు ఇష్టం. ఈ పత్రికలో ఆ పాటలు చూసి, రాగవరుస తెలియక ఆయనను అడిగితే చాలావరకూ టకీమని పాడి వినిపించగలిగేవారు.
ఇది వారపత్రికా కాదు, మాసపత్రికా కాదు. పక్షపత్రిక. 15 రోజులకు ఒకసారి వచ్చేది. చందా కట్టగలిగేవాళ్ళం కాదు. ఏ పక్షానికి ఆ పక్షం, ఊరు మొత్తానికి ఒకే ఒక కిళ్ళీ కొట్టు ఉంటే వెళ్ళి కొని తెచ్చుకునేవాళ్ళం. నేనూ, నాన్నగారూ, మా చెల్లెలూ, మిగతా కుటుంబసభ్యులూ కూడా చదివేవాళ్ళం.
ఒక సంచిక దొరక్కపోతే ఎంతో బాధపడేవాళ్ళం. ఏం మిస్సవుతున్నామో తెలియదు కదా.
హాసం క్లబ్బులు అని వెలిసాయి అక్కడక్కడా, వాటి వివరాలు హాసం పత్రికలో వచ్చేవి. నేనూ మా నాన్నగారూ కలిసి తాడేపల్లిగూడెంలో ఓ హాసం క్లబ్బు నడపాలని (అవును, 10 తరగతి వయసుకే) నాకు ఎంతో ఉండేది. పడలేదు.
2004లో ఒక చెడ్డరోజున పత్రిక ఆగిపోతున్నట్టు ప్రకటించారు. నేనూ, నాన్నగారూ, చెల్లాయి, ఇంటిల్లిపాదీ చాలా బాధపడ్డాం. నెలనెలా సంచిక కొన్నా కూడా చందా అంటే ఏడాదికి ఒకేసారి కమిట్ అవడం కదా, నాలాంటివాళ్ళు చందా కట్టకపోవడం వల్లనే ఆగిపోయిందేమో అనిపించేది ఆ చిన్నతనంలో!
కానీ, నా రెక్కలు చిన్నవి. నాన్నగారి బాధ్యతలు పెద్దవి. క్రమేపీ, తెలుగువారి నిర్లక్ష్యం వల్లనే ఆగిపోయిందనీ, మరోటనీ అనిపించింది. చాలా చాలా బాధ కలిగింది, ఆ బాధ చాన్నాళ్ళు అలాగే సలిపింది!
హాసం పత్రిక నిర్వహించిన వరప్రసాదరెడ్డి గారు తన తల్లిగారి పేరిట శాంతా బయోటిక్స్ అన్న సంస్థ ద్వారా టీకాలు రూపొందించి తక్కువ ధరకు అందిస్తున్నారనీ, ఆయనే అభిరుచి మేరకు ఈ హాసం నడిపారనీ తెలుసుకున్నాను. నా వరకూ నాకు ఆయన కృష్ణదేవరాయలు, భోజరాజు వంటివారి అంశతో పుట్టినవారు అనిపించేది.
తర్వాత ఏడాది వరప్రసాద్ రెడ్డి గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిందని వార్తలు చదివి కూడా సంతోషించాను. సంపాదకులు రాజా గారూ, మేనేజింగ్ ఎడిటర్ ఎమ్బీయస్ ప్రసాద్ గారూ వివిధ శీర్షికలు నిర్వహించేవారు. వీరందరినీ ఎంతగానో అభిమానించాను.
వరప్రసాద రెడ్డి గారు హాసం పబ్లికేషన్స్ తీసుకువస్తున్నామనీ, ఈ శీర్షికలన్నిటినీ పుస్తకాలుగా వేస్తామనీ రాశారు. ఆ పుస్తకాలను క్రమేపీ కొనుక్కోగలిగాను. కానీ, నా బాధ పోలేదు.
హాసం నిలిపివేసిన కొన్నాళ్ళు తమవద్ద ఉన్న హాసం పత్రిక ఆర్కైవ్స్ అన్నిటినీ అమ్ముతామని రాశారు. కొనుక్కోలేకపోయాను. అది చాన్నాళ్ళు నా మనసులో లోటుగానే ఉండిపోయింది.
ఓ పదో పరకో హాసాలు నా దగ్గర ఉండేవి. తోచనప్పుడు, తోచినప్పుడు కూడా తెరిచి చదివి ఆనందించేవాడిని. తర్వాత్తర్వాత హాసం ఆఖరు సంచికలో ఆర్కైవులు అన్నీ అమ్ముతాం, వీపీపీ ద్వారా తెప్పించుకోవచ్చు అన్న ప్రకటన చూసినప్పుడల్లా గుండె కలుక్కుమనేది. ఏదోకటి చేసి అప్పుడే కొనుక్కోవాల్సింది అనిపించేది.
2016-17 కాలంలో మనసున్న మిత్రులు ఒకరి దగ్గర హాసం పత్రికల కాపీలన్నీ కనిపించాయి. ఎవరివి ఇవి అని అడిగాను - "మనవే, మీకు కావాలంటే ఇకనుంచీ మీవే, పట్టుకుపోవచ్చు. కావాలా?" అన్నారు.
"ఇంతకన్నా ఆనందమేమీ.. ఓ రామ రామా" అనుకుని ఆలస్యం అమృతం విషం అన్నారు కదా అని అర నిమిషంలో అన్నీ మూటకట్టేసి, బ్యాగులో పెట్టేసి నమస్కారం చేశాను. అప్పటి నుంచీ నా వద్ద అన్ని హాసాలూ ఉన్నాయన్నమాట. గొప్ప సంతృప్తి కలిగింది.
వరప్రసాదరెడ్డి గారిని అనుమతి అడిగి పీడీఎఫ్ రూపంలో ఆర్కైవ్.కాంలో హాసం సంచికలన్నీ పెట్టించాడు నాకు తెలిసిన ఒక మిత్రుడు. చాలా ఆనందం కలిగింది. (ఈ లోకోపకారం చేసిన మిత్రుని పేరు చెప్పాలనే ఉంది కానీ ఆయనో కాదో అన్న అనుమానం పీకుతోంది అందుకే చెప్పట్లేదు) archive.org/details/HasamT…
కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో మ్యూజికాలజిస్టు రాజా గారు పరిచయం అయ్యారు. ఫోన్‌లో గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్ళం. ఆయన Quora తెలుగులో రాయడం ప్రారంభించారు. దురదృష్టవశాత్తూ నా ఆనందం ఎంతో కాలం నిలవలేదు. 2021 ఏప్రిల్లో ఆయన పరమపదించారు.
సంగీతం పట్ల నాకున్న అభిరుచికి లోతు పెంచి, నేను చూడాల్సిన సినిమాల జాబితాను విస్తరించి, చూసినవాటిలో కొత్త కోణాలు చూపించి, మహనీయుల పేర్లు, కృషీ తెలిసేలా చేసిన నిధి హాసం. ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించిన బోలెడంతమంది మహానుభావులను వేలుపెట్టి చూపిన చదువులమ్మ హాసం.
అలాంటి హాసం ఆగిపోవడం అప్పట్లో బాధ కలిగినా, వెనుదిరిగి చూస్తే అసలంటూ అది నడవడమూ, నాకు నా సీనియర్ పరిచయం చేయడమూ, నా అభిరుచిని అది పాదుపెట్టి పెంచడమూ తలచుకుంటే ఆనందంగానే ఉంటుంది. జరగని వాటి పట్ల ఆవేదనేనా ఎప్పుడూ, జరిగినదానికి సంతృప్తి కూడా ఉండాలి కదా మనిషికి?!
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
ఇది నేను గతంలో కోరాలో అడిగిన ప్రశ్న.
తెలంగాణ భాషా దినోత్సవం ఈరోజు. ఇప్పటికీ తెలంగాణ అనే మాండలికం ఉర్దూ, పార్సీ సంపర్కం వల్ల తప్ప పుట్టలేదు అనే జనాలు ఉన్నారు. అందువల్ల అందరికీ అర్థమయ్యేలా తెలంగాణ మాండలికంలో ఒక పార్శ్వం చూద్దాం.
జవాబు రాసినవారు పవన్ కళ్యాణ్ వాకిటి. నేను కాదు.
ఈ సమాధానాన్ని పవన్ కళ్యాణ్ వాకిటి గారు నలిమెల భాస్కర్ గారి రచన ఆధారంగా రాశారు. నేను కేవలం పంచుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్తే:
"తెలంగాణ సీమలోని పల్లె ప్రజల మాట్లాడే తీరుకు, వెనుకటి కావ్య భాషకు చానా దగ్గర సంబంధం ఉంది. ఆ సాన్నిహిత్యాన్ని చూసి కొన్ని సార్లు మనం ఆశ్చర్య పోవుడు కద్దు. మచ్చుకు పోతన తన భాగవతంలో వాడిన కొన్ని పదాలకు, తెలంగాణ పలుకులకు వున్న సామిప్యాన్ని చూద్దాం.",
"1.
భాగవతంలోని ఆయా స్కంధాల ప్రారంభంలో పద్యం తరువాత ”మహనీయ గుణ గరిష్ఠులగు నమ్ముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుండు ఇట్లనియె” అని ఉంటది. ఇక్కడ ”సూతుండు ఇట్లనియె” అని చివరన వుంది. ఇప్పటికీ పల్లెల్లో ”వాడు నిన్న నన్ను ఇట్లనె. వీడు నిన్ను అట్లనె. ఇగ ఎట్ల చేద్దాం” అనే తీరు మాటలు వింటాం. ”ఇట్లనియె” అనే ప్రాచీన రూపం తెలంగాణలో ”ఇట్లనె” అవుతున్నది. ”ఇలా అన్నాడు” అనే ఆధునిక రూపం తెలంగాణలో లేదు. ”అనియె” అనే క్రియ కాలక్రమంలో ”అనె”గా మారిపోయింది."
విశ్వనాథ - జాషువాల మధ్య చెప్పే గుర్రం గాడిద జోక్ ఏమిటంటే - విశ్వనాథ సత్యనారాయణ, జాషువాలు ఇద్దరికీ ఒకే వేదిక మీద సన్మానం జరిగిందనీ, దాని గురించి ప్రస్తావిస్తూ "గుర్రాన్నీ గాడిదనీ ఒకే గాటన కట్టేశారు" అన్నారనీ, దానికి రిపార్టీగా జాషువా "కావచ్చు. ఐతే, నేను గుర్రం జాషువాని - మరి గాడిద ఎవరో ఆయనకే తెలియాలి" అన్నారనీ చెప్తారు.
ఈ చెప్పడం అన్నది బస్ స్టేషన్లలో దొరికే 20-30 పేజీలుండే బుల్లి ప్రముఖుల జోకుల్లో చదివాను. కొందరు పెద్దవాళ్ళు అనగా విన్నాను. ఏవేవో సాహిత్య మొర్మొరాల్లో చూశాను. ఫేస్ బుక్ పోస్టులు, బ్లాగులు, కావేవీ అనర్హం. అన్నిటా ఉంటుందిది.
ఐతే ఒకటి - ఎక్కడా ఆ సభ ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్నది చెప్పరు. బాగా ప్రయత్నించగా ఒకచోట నాయని కృష్ణకుమారి గారి వివాహ సందర్భంగా వారిద్దరినీ ఒకే వేదిక మీద సత్కరించారనీ, అక్కడే మైకులో ఆయనలా, ఈయనిలా అన్నారని ఎక్కడో ఉందని పట్టుకుని చెప్పారు మిత్రులు కౌటిల్య చౌదరి గారు. దీనితో- 2014లో నేను, కౌటిల్య గారితో కలిసి నాయని కృష్ణకుమారి గారి ఇంటికి వెళ్లి ఆవిడను కలిశాను.
సహస్ర పూర్ణ చంద్ర దర్శనం పూర్తయినట్టుంది ఆవిడకు అప్పటికే. 85కు చేరువలో ఉన్నారు. నా మనసులో ఉన్నది సింగిల్ పాయింట్ అజెండా, ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోవాలన్నది. కొంత సేపు ఆవిడతో నాయని సుబ్బారావు గారి గురించి, చిన్నతనంలో చదివిన కాశ్మీరు దీపకళిక పాఠం గురించి, ఆవిడ జానపద పరిశోధనల గురించి మాట్లాడి - ఈ విషయం అడిగాను.
ఆవిడ సూటిగా సరళంగా చెప్పారు -
"లేదండీ. నా పెళ్లిలో ఇది జరగలేదు. నా పెళ్లిలో బాపిరాజు గారు ఆనందంతో పాట పాడి నాట్యం చేశారు. కవులందరూ వచ్చి ఆశీర్వదించారు. నాన్నగారి (సుబ్బారావు గారి) స్నేహితులు, ఆ సందడి వల్ల ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ, ఇలా విశ్వనాథ, జాషువా అనుకున్నది మాత్రం లేదు. అదెవరో కల్పించారు."
"మరి మీ పెళ్లిలో కాకపోతే మరెప్పుడైనా జరిగిందా?"
"ఒక విషయం నా కళ్ల ముందు జరిగితే జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే అందుకు సాక్షిని కాబట్టి. జరగనిది ఎవరైనా పుట్టిస్తే అస్సలు జరగలేదని చెప్పడం కష్టం. ఎందుకంటే - నా కళ్ళ ముందు కాక ఎక్కడో జరిగి ఉండవచ్చన్న సందేహం నాకు పీకుతుంది కాబట్టి. కనుక, విశ్వనాథ, జాషువా ఇలా మాట్లాడుకోవడం అన్నది నేను చూసిన ఏ సభలోనూ జరగలేదు, అలానే నాకు తెలిసి జరగలేదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మా నాన్నగారిదీ (నాయని సుబ్బారావు గారు, విశ్వనాథ-జాషువాలిద్దరికీ సాహిత్య మిత్రుడు), నాదీ కేవలం సామాన్యమైన తండ్రీ కూతుళ్ళ సంబంధం మాత్రమే కాదు. ఆయన నాకు మిత్రుడిలాగా ఉండేవారు. ఏ సాహిత్య విశేషం తెలిసినా నాకు చెప్పేవారు. మేం విశ్లేషించుకునేవాళ్ళు, కవిత్వం కలిసి ఆస్వాదించేవాళ్ళం. ఇంత పెద్ద సంఘటన ఆయన కళ్ల ముందు జరిగినా, ఆయనకు జరిగినట్టు తెలిసినా నాకు చెప్పకుండా ఉండేది కల్ల. కాబట్టి, ఆయన ఉన్న ఏ సభలో కూడా జరగలేదనీ, జరిగినట్టూ ఆయనకు తెలీదనీ కూడా ఖచ్చితంగా చెప్పగలను." అన్నారావిడ.
అంతేకాక ఇలా కొనసాగించారు - "ఇదొక జోకు. విశ్వనాథ, జాషువా పోయాక ప్రచారంలోకి వచ్చింది. నవ్వు పుట్టిస్తుంది, చమత్కారం ఉంది కాబట్టి పోతోంది తప్ప నిజానిజాలు ఎవరూ పట్టించుకోవట్లేదు" అని ఊరుకున్నారు.
ఆపైన విశ్వనాథ, జాషువా, నాయని సుబ్బారావుల వ్యక్తిత్వం, సాహిత్యం గురించి ఏవేవో విషయాలు మాట్లాడారు. సుబ్బారావు గారిని తలచుకుని ప్రశంసాపూర్వకంగా ఇంకాస్త మాట్లాడారు.
సారాంశం ఏమంటే - ఆవిడ పెళ్లిలోనూ జరగలేదు, ఆవిడ చూడగా జరగలేదు, ఆవిడకు తెలిసి జరగలేదు, ఆవిడ తండ్రి, ప్రముఖ భావకవి, సాహిత్య వ్యవహారాల్లో చురుగ్గా ఉండే నాయని సుబ్బారావుకు చూడగానూ, తెలిసీ కూడా జరగలేదు.
శంకర్ సినిమాల నుంచి డ్రాయింగ్ రూముల వరకూ జర్మనీ, జపాన్ వంటి దేశాలతో పోల్చి భారతదేశాన్ని, మన జనాల క్రమశిక్షణా రాహిత్యాన్ని, మన నాయకుల అవినీతిని, మన వ్యాపారస్తుల దురాశని, ఇంకా బోలెడన్ని వాటిని తిడుతూ అందువల్లే మనం అభివృద్ధి చెందలేదని వాపోవడం కనిపిస్తుంది.
భారతదేశంతో జపాన్, జర్మనీ వంటి దేశాలను పోల్చడానికి లేదు. సింగపూర్ వంటి దేశాలతోనూ పోలుస్తూ ఉంటారు. అది కూడా సరికాదు. జపాన్, జర్మనీలు ఆ స్థాయిలో అభివృద్ధి చెందడానికి అత్యంత ముఖ్యమైన కారణం ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికా సంపూర్ణ సహాయం చేయడం. దానికి పరిపోషకమైన మరికొన్ని కారణాలు అక్కడి ప్రభుత్వాల ఆర్థిక విధానాలు, రెండో ప్రపంచ యుద్ధంలోని సర్వనాశనం నుంచి ఎదగాలన్న తాపత్రయం, రెండో ప్రపంచ యుద్ధం నాటికే ఆర్థిక శక్తులుగా ఎదిగిన చరిత్ర, సంస్కృతి ఉండడమూ - ఇలాంటివన్నీ వస్తాయి.
అయితే, అమెరికా-సోవియట్ యూనియన్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో ఇవి వ్యూహాత్మకంగా అమెరికాకు చాలా అవసరమైన ప్రదేశాలు కాకపోయి ఉంటే ఈ అభివృద్ధి కష్టం అయ్యేది అని నా అభిప్రాయం. జర్మనీ విషయంలో ఎలా ఉన్నా జపాన్ విషయంలో ఇది ఇంకా వాస్తవం.
రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇంగ్లీష్ పెద్దగా రాని అతి చిన్న దేశాలు (భారత దేశం తో పోలిస్తే) జర్మనీ, జపాన్ అద్భుతంగా అభివృద్ధి చెందడానికి అనుసరించిన విధానాలు ఏమిటన్నది తెలిస్తే భారతదేశంతో పోల్చుకుని మన దేశాన్ని తిట్టుకోవడం ఎందుకు సబబు కాదో అర్థమవుతుంది? కాబట్టి దానితో ప్రారంభిద్దాం.
జపాన్ ఆర్థిక అద్భుతం
జపాన్ 1945 నుంచి అమెరికన్ ఆక్రమణలో ఉంది. 1947 జపాన్ రాజ్యాంగాన్ని ప్రాక్టికల్‌గా అమెరికన్ ప్రభుత్వాధికారులు రాస్తే జపనీస్‌లోకి అనువదించుకుని ఆమోదించుకున్నారు. ఇంతే కాదు, రెండో ప్రపంచ యుద్ధ గాయాల వల్ల దేశం ఇంకెప్పుడూ సైనికీకరణ కాకూడదని ఏకంగా దేశానికి సైన్యమే వద్దని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ రక్షణ బాధ్యత కూడా నాటోకి అప్పగించేశారు.
రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ని ఆక్రమించుకున్న అమెరికా మొదట్లో క్రమేపీ అభివృద్ధి చేద్దామనే అనుకుంది. కానీ, అలా రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిందో లేదో ఇలా అమెరికా - సోవియట్ రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అనే చదరంగపు ఆట మొదలైంది.
కోల్డ్ వార్ లేదా ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికాకు, సోవియట్ రష్యాకు ముఖాముఖీ నేరుగా యుద్ధం జరగలేదు. అందుకు బదులుగా ఈ రెండు సూపర్ పవర్‌లూ తమదైన పద్ధతుల్లో తమ అనుకూలమైన బ్లాక్ దేశాలను మెయింటైన్ చేస్తూ, ప్రపంచంలోని పలు చోట్లు జరిగే యుద్ధాల్లో పాల్గొంటూ ప్రపంచ ఆధిపత్యం కోసం పెనుగులాడాయి.
ఈ చదరంగంలో భాగంగా జపాన్ చాలా కీలకమైన గడిలో ఉందన్నమాట. ఆ గడిలో ఉన్న జపాన్ బలంగా ఉండడం, ఆర్థికంగా సుసంపన్నంగా ఉండడం దాన్ని ఆక్రమించి, తర్వాత మిత్రరాజ్యంగా అయిన అమెరికాకు చాలా అవసరం. ఈ అవసరాలు, పరిస్థితులు వివరంగా చూద్దాం:
కొరియా యుద్ధం:
కొరియన్ ద్వీపకల్పం రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం కొరియాను ఉత్తర, దక్షిణ కొరియాలుగా సోవియట్ రష్యా, అమెరికా దళాలు ఆక్రమించాయి. 1949లో పొరుగునే ఉన్న చైనాలో కమ్యూనిస్టులు అంతర్యుద్ధంలో నెగ్గి మావో నేతృత్వంలో కమ్యూనిస్టు దేశంగా ఏర్పడింది. ఆ తర్వాత చైనా ప్రోత్సాహం, సహకారంతో ప్రారంభమైన కొరియన్ కమ్యూనిస్టు తిరుగుబాటు దాదాపు దక్షిణ కొరియా అంతటినీ ఆక్రమించుకుంది. దక్షిణ కొరియా ప్రభుత్వానికి సాయంగా అమెరికా రంగంలోకి దిగగా పూర్తిస్థాయిలో కొరియన్ యుద్ధంగా పరిణమించింది.
కొరియాకు శాపం అయిన ఈ యుద్ధం జపాన్‌కు వరంలా పరిణమించింది. జపాన్ - దక్షిణ కొరియా మధ్య దూరం అమెరికాతో పోలిస్తే చాలా తక్కువ కదా. అందువల్లనే ఈ యుద్ధానికి అవసరమైన సైనిక సామగ్రి అంతటినీ అమెరికా నుంచి తరలించుకు రావడం కన్నా జపాన్‌లో కొని దిగుమతి చేసుకోవడం మంచిదని అమెరికా నిర్ణయించుకుంది.
అమెరికన్ సైన్యానికి అవసరమైన లాజిస్టిక్ మెటీరియల్, సైనిక సామాగ్రి జపాన్‌లో విపరీతమైన డిమాండ్ సృష్టించింది. జపనీస్ పరిశ్రమలు నిర్విరామంగా పనిచేస్తూ ఆ డిమాండ్ అందుకున్నాయి. ఈ క్రమంలో 1950-53 సంవత్సరాల మధ్య 3.5 బిలియన్ డాలర్లు అమెరికా జపనీస్ కంపెనీలకు ఖర్చుపెట్టింది. ఈ పెట్టుబడి, డిమాండ్ వల్ల జపనీస్ ఆర్థిక వ్యవస్థ బాగా స్థిరపడింది.
ఈ దెబ్బతో జపాన్ రెండవ ప్రపంచ యుద్ధానికి పూర్వం ఉన్న స్థాయికి ఆర్థిక వ్యవస్థ రికవర్ అయిపోయి ఇక బౌన్స్ అవడానికి సిద్ధంగా ఉంది.
ఈరోజు కె.వి.రెడ్డి పుట్టినరోజు. కె.వి.రెడ్డి నాకు అత్యంత ఇష్టమైన దర్శకుడు.
సినిమా దర్శకుడిగా కె.వి.రెడ్డి తనకంటూ ప్రత్యేకించిన కొన్ని పద్ధతులను తయారుచేసుకుని, ఆ ప్రకారం పనిచేశాడు. ఆ విశేషాలు కొన్ని:
ఒక్కసారి స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయాకా ఇక దానిలోని అక్షరాన్ని కూడా షూటింగ్ దశలో మార్చేవాడు కాదు. కె.వి. మాయాబజార్ తమిళ వెర్షన్ కోసం తమిళ హాస్యనటుడు తంగవేలును తీసుకున్నాడు. అప్పటికి ఎన్నో తమిళ సినిమాల్లో స్క్రిప్టులో లేని హాస్య సన్నివేశాలను సెట్లో అప్పటికప్పుడు డైలాగులు కల్పించి పనిచేసే పద్ధతి ప్రకారం పనిచేస్తున్న తంగవేలును అలా జోకులు, డైలాగులు సెట్లోనే కల్పించి చెప్పడానికి అవకాశం ఇమ్మని కోరాడు. కె.వి.రెడ్డి ఆ మాట నేరుగా కొట్టిపారేయకుండా "మీలాంటి సీనియర్ కమెడియన్ సినిమా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తూంటే కాదనే మూర్ఖుడిని కాదు" అంటూనే మాయాబజార్ తమిళ వెర్షన్ బౌండ్ స్క్రిప్ట్ చేతికి ఇచ్చి, పదిహేను రోజులు మీ దగ్గర ఉంచుకుని ఆ జోకులు, డైలాగులు ఏవో ఈ దశలోనే చెప్పండి చర్చించి బావుంటే చేర్చుకుందాం అని తేల్చాడు. చదివిన తంగవేలు స్క్రిప్ట్ ఇస్తూ ఇంత పర్ఫెక్ట్ స్క్రిప్టులో మార్పుచేర్పులు ఏమీ చెప్పలేం అని, అందులో ఉన్నది అక్షరం మార్చకుండా అనుసరించి చేస్తానని చెప్పాడు. ఇలా ఏ స్థాయి వ్యక్తి అయినా స్క్రిప్ట్ దశలో సలహాలు ఇస్తే పరిశీలించేవాడు, తాను మొత్తం సినిమాని దృష్టిలో ఉంచుకుని తుది నిర్ణయం తాను తీసుకునేవాడు. కానీ చిత్రీకరణ దశకు వెళ్ళాక మాత్రం స్క్రిప్ట్ మార్పులకు చాలా వ్యతిరేకి. "ఫాన్ కింద కూర్చుని పదిమంది ప్రశాంతంగా ఆలోచించి స్క్రిప్ట్ దశలో తీసుకునే నిర్ణయాల కన్నా లైట్లు, చెమట, టెన్షన్ మధ్యలో సెట్స్ మీద తీసుకునే నిర్ణయాలు సరైనవి ఎలా అవుతాయని" అడిగేవాడు.
సహకరించని మేధావి కన్నా, సహకరించి పనిచేసే సాధారణమైన వ్యక్తితో పనిచేయడం మేలు అన్నది సాంకేతిక నిపుణులను ఎన్నుకోవడంలో అతని పద్ధతి.
బి.ఎన్.రెడ్డి తనకు మల్లీశ్వరి సినిమాకి పనిచేసిన కవి, రచయిత కృష్ణశాస్త్రిని, సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావును పెద్దమనుషులు సినిమాకి పెట్టుకొమ్మని సలహా ఇస్తే "నాకీ మహాకవులు, జీనియస్సులు వద్దు బ్రదర్" అని సున్నితంగా తిరస్కరించాడు.
ఒక సమయంలో ఒకే సినిమా మీద పనిచేసేవాడు. మిగిలిన వాళ్ళు రెండు సినిమాల మీద ఒకేసారి పనిచేస్తున్నారు కదాని చెప్తే "ఐ డోన్ట్ హావ్ టూ బ్రెయిన్స్" అన్నది అతని సమాధానం. అలాగే తనకు పనిచేసే కథా రచయిత కూడా తన సినిమా పూర్తయ్యేదాకా వేరే సినిమాలకు రాయకూడదన్నది కె.వి.రెడ్డి నియమం. ఆ పద్ధతిలోనే మొదట పనిచేసిన సీనియర్ సముద్రాల, తర్వాత పింగళి, డి.వి.నరసరాజు అదే పద్ధతిలో పనిచేశారు.
సినిమా ఎలా తయారవ్వాలన్న విషయాన్ని చాలా విపులంగా ఆలోచించుకునేవాడు, అది 100 శాతం ఉంటే 99 శాతానికో, 98 శాతానికో సంతృప్తి పడకుండా ఖచ్చితంగా వంద శాతం వచ్చేలా చేసేవాడు. అలా రావడానికి వివిధ పద్ధతులు, విధానాలు రూపొందించుకుని పనిచేసేవాడు. అతను సినిమా ప్రారంభించక ముందు స్క్రిప్టు మీద, పాత్రధారుల ఎంపిక, రూపకల్పన వంటి విషయాల మీద చాలా గట్టి కసరత్తు చేసేవాడు. తాను, తన రచయితల (సాధారణంగా పింగళి నాగేంద్రరావు కానీ, డి.వి.నరసరాజు కానీ), తన సహ దర్శకుడు (చాలా చిత్రాలకు కమలాకర కామేశ్వరరావు) ప్రధానమైన కథా చర్చల బృందం. వీరందరూ అధమపక్షం ఆరునెలలు కూర్చుని తాము అనుకున్న మూల కథాంశాన్ని పూర్తిస్థాయి కథగా అభివృద్ధి చేశాక, స్క్రీన్ ప్లే రాసుకునేవారు.
సూక్ష్మమైన విషయాలను సైతం సినిమా స్క్రీన్ ప్లేలో రాసేవాడు.జగదేకవీరుని కథ స్క్రిప్టులో సెట్ ప్రాపర్టీల వివరాలు నిర్దేశిస్తూ తేలు కావాలని రాసి, అది బతికున్న తేలు అయివుండాలని చేర్చిన వివరణ కూడా కె.వి.రెడ్డి సూక్ష్మతరమైన పరిశీలన, నిర్దేశాలకు మచ్చుతునక.
చెరుకూరి రామోజీరావు. గత అర్థశతాబ్ది కాలంగా తెలుగు రాజకీయాలపై లోతైన ప్రభావం చూపించే మార్పుల్ని, మలుపుల్ని తెచ్చిన గుప్పెడుమంది పేర్లు రాస్తే అందులో ఈ పేరు నిస్సందేహంగా వస్తుంది. ముఖ్యమంత్రులను నిలబెట్టారు, పడగొట్టారు, ముఖ్యమంత్రుల వల్ల పడ్డారు, లేచారు. ఆయన సృష్టించినదొక చరిత్ర. ఈ సందర్భంగా ఆయన గురించి నాకు తెలిసిన, తెలుసుకున్న ఆసక్తికరమైన సంగతులు చెప్తాను.
"ఈనాడు" పేరు - బ్రాండింగ్ సూత్రాలు
పూర్వం ప్రముఖ పత్రికల పేర్లు - "ఆంధ్రపత్రిక", "ఆంధ్రజ్యోతి", "ఆంధ్రప్రభ", "విశాలాంధ్ర", "ప్రజాశక్తి", "గోల్కొండ", "మీజాన్", "కృష్ణాపత్రిక". ఈ పేర్ల మౌలిక లక్షణాలు: 1. చాలావరకూ పొడవు పేర్లు. 4-5 అక్షరాలు, 7-9 మాత్రలు ఉన్నవి ఎక్కువ. 2. చాలావరకూ ప్రదేశాన్నో, ప్రాంతాన్నో సూచిస్తున్నాయి,. అరుదుగా సిద్ధాంతాన్ని. 3. చాలామందికి పలకడానికి కష్టమైన పేర్లు.
"ఈనాడు" అన్న పేరులో ఈ మూడు ఇబ్బందులూ లేవు. తేలికైన పేరు, మూడక్షరాలు, ఐదుమాత్రల సులువైన అచ్చతెలుగు పేరు. వార్తాపత్రిక మౌలిక లక్షణమైన ప్రస్తుతం అన్నదాన్ని సూచించే పేరు.
ఈ పేరును ఇలా పలకలు పలకలుగా ఫాంట్ చేయడం వెనుక కూడా మిగిలిన అన్ని పత్రికల డిజైన్‌కూ దూరంగా స్వంత ముద్ర వేయడం కనిపిస్తుంది.
ఈ ఫాంట్ రూపకల్పన చేసిన వ్యక్తి రాసిన వ్యాసం నా దగ్గర ఎక్కడో ఉండాలి. దొరికితే ఇస్తా.
ఎర్ర స్కెచ్‌పెన్‌తో ఈనాడు మీద నిత్యం నోట్స్
కొన్న దశాబ్దాల పాటు రామోజీరావు దినచర్యలో అత్యంత ముఖ్యమైన భాగం ఈనాడు పేపర్‌లోని ప్రతీ పేజీని క్షుణ్ణంగా చదివి, నిశిత విమర్శనాత్మక దృష్టితో ఎర్ర స్కెచ్‌పెన్‌తో తప్పొప్పులను రాసి పంపడం. "ఈ వార్త ఐదవ పేజీలో ఎందుకుంది? దీని ప్రాధాన్యత మొదటి పేజీ కాదా?", "ఈ పదం వాడొద్దని నిర్ణయించాము", "కంగ్రాచ్యులేషన్స్", "మంచి శీర్షిక", "మొదటి పేజీలో దీన్నెందుకు వేశారు?", "పాఠకులకు అయోమయం కలిగించే ఇంట్రో" అంటూ పత్రిక పాలసీని బట్టి మొదటి పేజీ నుంచి ప్రతీ జిల్లా పేజీ వెతికి వెతికి నోట్స్ రాసేవారు. దాన్ని యంత్రాంగం మథించి, మంచిచెడులకు తగ్గట్టు ఆయా విలేకరులకు పంపించేంది.
కర్ణాటక, తమిళనాడు, కేరళ లకు ప్రదేశ్ లేదు కదా, మరి ఆంధ్ర రాష్ట్రానికి ప్రదేశ్ అని ఎందుకు పెట్టారు?
అని కోరాలో ఒక ప్రశ్న అడిగారు గతంలో. చాలా ఆసక్తికరమైన సంగతి ఇది. దానికి నా జవాబు ఇది:
ప్రదేశ్ అన్న పదం మన భాషల్లో ప్రాంతాన్ని సూచించే పదం కాదు కాబట్టి. అసలైతే, మనమే పెట్టుకుని ఉండకూడదు కాబట్టి. తెలుగు నాడు, ఆంధ్ర దేశం, తెలుగు దేశం (పార్టీ పేరు కాదు లెండి, పార్టీ పెట్టింది 1982లో, రాష్ట్ర ఏర్పాటు 1956లో) - ఇలాంటి పేరు ఏదైనా పెట్టి ఉండవచ్చు. అసలు వీటన్నిటి కన్నా "విశాలాంధ్ర/విశాలాంధ్రం" అన్నది సరైన పేరు. (ఎందుకన్నది తర్వాత చూద్దాం)
ఈనాడు 60 ఏళ్ళ పైచిలుకు విని, దానితో మానసికంగా అనుబంధం పెంచుకున్న ఆంధ్ర ప్రదేశ్ వాసులకు ఆ మాట రుచించకపోవచ్చు కానీ ఆంధ్ర ప్రదేశ్ అన్న పేరు అసమంజసం.
ఎందుకంటే...
ముందుగా కొన్ని చారిత్రక వాస్తవాలు చెప్పుకుంటే స్పష్టంగా ఉంటుంది:
- 1948లో భారత ప్రభుత్వం పోలీసు చర్య జరిపి ఏడవ నిజాంని తొలగించి, హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో కలిపారు. అది హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడింది. అంతకుముందు హైదరాబాద్ రాజ్యం అనేవారు దాన్ని, ఆ పేరే కొనసాగించారు. (నైజాం అన్నది కేవలం జన వ్యవహారం) అందులో నేటి తెలంగాణ, ఈనాడు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ డివిజన్‌గా ఉన్న మరాఠ్వాడా, ప్రస్తుతం కర్ణాటకలో కళ్యాణ్ కర్ణాటక అని పిలుస్తున్న రాయ్‌చూర్-గుల్బర్గా ఇత్యాది జిల్లాలు భాగం.
- 1953లో మద్రాసు రాష్ట్రంలో రాజధాని మద్రాసు వదులుకుని, ఎక్కువశాతం తెలుగు జిల్లాలు విడిపోయి ఏర్పడిన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇందులో ప్రదేశ్ లేదు. తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం గారు.
- తెలుగు వారి కృషి, పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనల ఫలితంగా 1956లో రాష్ట్రాల పునర్విభజన కమీషన్ తుదకు భాషా ప్రయుక్త రాష్ట్రాలను విధానపరంగా ఆమోదించింది. ఆ క్రమంలో హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలు (లేక తెలంగాణ), ఆంధ్ర రాష్ట్రం కలిసి ఆంధ్ర ప్రదేశ్ అవతరించింది. ఇప్పుడు హఠాత్తుగా ప్రదేశ్ వచ్చేసింది.
ఆంధ్ర అన్న పదం వరకూ 1956 నాటికి విస్తృతమైన ఆమోదం ఉంది. ఈనాడు ఆంధ్ర అనే శబ్దానికి కోస్తాంధ్ర, రాయలసీమ వారన్న అర్థం స్థిరపడుతూ వస్తోంది కానీ బ్రిటీష్ పాలనా కాలంలోనూ, స్వాతంత్ర్యం వచ్చిన తొలి దశాబ్దంలోనూ ఆంధ్ర శబ్దం తెలుగుకు పర్యాయపదంగా అటు తెలంగాణ వారు, ఇటు కోస్తాంధ్ర-రాయలసీమ వారూ కూడా వాడేవారు.
ఉదాహరణకు తెలంగాణలో తెలుగు వారు తమ భాషా సంస్కృతులను పరిరక్షించే సంస్థ నెలకొల్పినప్పుడు దాని పేరు ఆంధ్ర మహాసభగా పెట్టారు, 1901లో సుల్తాన్ బజార్‌లో నెలకొల్పిన గ్రంథాలయం పేరు శ్రీకృష్ణదేవరాయాంధ్ర గ్రంథాలయం, తెలంగాణ వారైన సురవరం ప్రతాపరెడ్డి గారు తెలుగువారి సాంఘిక చరిత్ర రాసి దానికి పెట్టిన పేరు "ఆంధ్రుల సాంఘిక చరిత్ర", అసలు హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగువారు తమ సంస్కృతి పరిరక్షణకు ప్రారంభించిన ఉద్యమం పేరే ఆంధ్రోద్యమం, దీని గురించి మాడపాటి హనుమంతరావుగారు "తెలంగాణములో ఆంధ్రోద్యమము" అని రాశారు. ఏతావతా, ఆంధ్ర అన్న పదం అత్యధికులకు ఆనాడు ఆమోదయోగ్యమే.
ఐతే, దీన్ని ఆంధ్ర అని ఊరుకోకుండా మరేదో చేర్చడానికి కారణం బహుశా ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ కలిసినట్టు ఉండకూడదనీ, రెండూ కలిసి కొత్త రాష్ట్రం ఏర్పడిందని సూచించాలని. (మూలం: ఆంధ్రప్రదేశ్ గా కొత్త రాష్ట్రం పేరు మార్చాలని సూచన; ఆంధ్ర ప్రభ, 1956 మార్చి 23, పేజీ 1.)
ఆ ఏర్పడే కొత్త పేరు విశాలాంధ్ర/విశాలాంధ్రం అయితే బాగానే ఉండేది.
నిజానికి, తెలుగువారు రాజకీయంగా ఐక్యత సాధించాలన్న ఉద్యమానికి పెట్టిన పేరు "విశాలాంధ్ర ఉద్యమం". 1949లో విశాలాంధ్ర మహాసభ హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పడినా, ఆ తర్వాత దాశరధి కృష్ణమాచార్యులు మహాంధ్రోదయము కావ్యంలో పలుమార్లు ఉటంకించినా, తెలుగునాట కమ్యూనిస్టులు పరితపించినా దాని పేరు "విశాలాంధ్ర" లేక "విశాలాంధ్రము". పార్టీకి ఆ పదంతో అంత అనుబంధం ఉండబట్టే కమ్యూనిస్టు పత్రిక, ప్రచురణ సంస్థ, పుస్తక విక్రయ కేంద్రాలూ - అన్నీ "విశాలాంధ్ర" పేరుతో ఏర్పడ్డాయి. ఈ పదాన్ని కమ్యునిస్టులు బాగా వాడడంతో క్రెడిట్ వారికి పోతుందని విడిచిపెట్టారో ఏమో తెలియదు. కానీ, సంకుచితంగా పార్టీ దృక్పథంతో ఆలోచించకుండా ఉంటే విశాలాంధ్ర అన్నది మంచి పేరు, ఆంధ్ర ప్రదేశ్ కన్నా మంచి పేరు.
1956 ఫిబ్రవరి నెల వరకూ తెలంగాణ-ఆంధ్ర ప్రాంతాలు కలిసి ఏర్పడాలని ప్రతిపాదిస్తున్న రాష్ట్రాన్ని విశాలాంధ్ర అని ఎన్నో మార్లు పత్రికల్లో ప్రస్తావన కనిపిస్తుంది. ఉదాహరణకు 1956 ఫిబ్రవరి 19-25 ఆంధ్ర పత్రిక మొదటిపేజీలో విశాలాంధ్ర పదం ప్రస్తావనతో తయారు చేసిన బొమ్మ ఈ కింద చూడండి