అనయంబు మేము విద్యాభ్యాసమునకు
అయ్యవారిని చాల ఆశ్రయించితిమి
ఈనాటికిని మహానవమి యేతెంచు
ఈడుజోడగువార మెల్ల బాలురము
గురునకు దక్షిణల్ కోరి యీదలచి
వెరవు తోడ మిమ్ము వేడవచ్చితిమి
పాటించి మా ముద్దు పాటలు వినుడు
మేటి కానుకలిచ్చి మెప్పు పొందరయ్య.
సెలవియ్యుడీ మాకు శీఘ్రంబుగాను
పట్టుపచ్చడమిచ్చి పది మాడలిచ్చి
గట్టి శాలువలిచ్చి కడియంబులిచ్చి
అయ్యవారికి చాలు ఐదు వరహాలు
పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు
కొబ్బరి కురిడీలు కుండబెల్లంబు
ఏ దయా మీ దయా మా మీద లేదు
ఇంత సేపుంచుట ఇది మీకు తగదు
దసరాకు వస్తిమనీ విసవిసలు పడక
చేతిలో లేదనక అప్పివ్వరనక
రేపురా మాపురా మళ్ళి రమ్మనక
ఇరుగుపొరుగు వారు ఇస్తారు సుమ్మి
గొప్పగా చూడండి తప్పక మీరు
పావలా బేడయితే పట్టేది లేదు
ముప్పావలా అయితే ముట్టేది లేదు
హెచ్చు రూపాయైతే పుచ్చుకుంటాము
అయ్య వారికి చాలు ఐదు వరహాలు
పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు
జయీభవా...దిగ్విజయీభవా
ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై
పరమామ్నాయము లెల్ల వందిగణమై బ్రహ్మాండమాకారమై
సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై
వరసన్నీ ఘన రాజసంబు నిజమై వర్థిల్లు నారాయణా
జయీభవా విజయీ భవా
రాజాధిరాజ శ్రీరాజ మహారాజ
రాజ తేజోనిధి రాజ కందర్ప
రాజ కంఠీరవా రాజ మార్తాండ
రాజ రత్నాకరా రాజకుల తిలక
రాజ విద్వత్సభా రంజన మనోజ
రాజీవ ముఖ హంస లక్ష్మీ నివాస
సుజన మనోధీశ సూర్యప్రకాశ
నిఖిల లోకేశ శ్రీ నిగమ సంకాశ
ప్రకటిత రిపుభంగ పరమాత్మ రంగ
పరహిత మది చిత్ర పావన చరిత్ర
ఉభయ విద్యాధుర్య ఉద్యోగధుర్య
వివిధ సద్గుణధామ విభవాభిరామ
జయీ భవా దిగ్విజయీ భవ!