మొన్న విఖ్యాత తెలుగు నిఘంటుకారుడు, రచయిత, విద్యావేత్త, భాషా శాస్త్రవేత్త ఆచార్య జి.ఎన్. రెడ్డి గారి ౯౪వ జయంతి. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా, ఉపకులపతిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులుగా కూడా ఉండేవారు.
ఆయన సంపాదకత్వంలో "తెలుగు పర్యాయపద నిఘంటువు," "తెలుగు నిఘంటువు (౧౯౭౩)," "ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు (౧౯౭౮)," "మాండలిక వృత్తి పదకోశం (కుమ్మర, వడ్రంగం)" వంటి పదకోశాలు వెలువడ్డాయి.
ఆయన ఆంగ్లంలో "ఎ స్టడీ ఆఫ్ తెలుగు సెమాంటిక్స్," "ది ఇన్‍ఫ్లుయన్స్ ఆఫ్ ఇంగ్లిష్ ఆన్ తెలుగు లిటరేచర్" లాంటి సిద్ధాంత గ్రంథాలను రచించారు. ఈ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన తెలుగు భాషా శాస్త్రంకు, నిఘంటు నిర్మాణ శాస్త్రంకు చేసిన విశిష్ట కృషిని గుర్తుచేసుకుందాం.
జి.ఎన్. రెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు. జై తెలుగు తల్లి.
It was the 94th jayanthi (birth anniversary) of an eminent Telugu lexicographer, writer, educationist and linguist Acharya G.N. Reddy garu two days ago. He served as a Telugu professor and vice-chancellor at Sri Venkateswara University.
He was also a member of Andhra Pradesh Sahitya Akademi and Kendra Sahitya Akademi.
Telugu dictionaries such as "Telugu Paryayapada Nighantuvu," "Telugu Nighantuvu (1973)," "English - Telugu Nighantuvu (1978)," "Mandalika Vrutti Pada Kosam (Kummara, Vadrangam)" were compiled under his editorship.
He also wrote research books in English such as "A Study of Telugu Semantics," "The Influence of English on Telugu literature."
On this personality's jayanthi, let's remember his outstanding contribution to Telugu linguistics and lexicography. G.N. Reddy gaari jayanthi subhaakaankshalu. Jai Telugu Thalli.
మొన్న ప్రఖ్యాత తెలుగు కవి, నాటకకర్త, రంగస్థల నటుడు, భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి ౧౪౦వ జయంతి. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గా ప్రసిద్ధిచెందిన ఆయన తెలుగు సినీవినీలాకాశంలో నటుడిగా, కథా రచయితగా, సంభాషణ రచయితగా, గేయ రచయితగా కూడా పేరుపొందారు.
ఆయన రచించిన తెలుగు నాటకం "సత్యహరిశ్చంద్రీయము" ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఇంకా ఆయన రాసిన ప్రముఖ నాటకాలు ఏమిటంటే, "సాత్రాజితీయము," "ఉత్తరరాఘవము," "బుద్దిమతీ విలాసము." గుంటూరులో ఫస్టు కంపెనీ అనే నాటక సమాజాన్ని స్థాపించిన ఆయన "పుంభావ సరస్వతి," "కవితా కళానిధి" లాంటి బిరుదులను పొందారు.
ఆది శంకరాచార్యులు వారు రచించిన "శివానందలహరి" ని తెలుగులోకి "శివానందలహరి శతకం" గా అనువాదించారు. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి జయంతి సందర్భంగా ఆయన తెలుగు సినీ, రంగస్థల, నాటక, సాహిత్య రంగాలకు చేసిన సేవల్ని స్మరించుకుందాం. బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి జయంతి శుభాకాంక్షలు. జై తెలుగు తల్లి.
ఈరోజు పీవీ నరసింహారావు గారి ౧౭వ వర్ధంతి. "పీవీ" గా, "పీవీఎన్నార్" గా మనందరికీ చిరపరిచితులైన పాములపర్తి వెంకట నరసింహారావు గారిని బహుముఖ ప్రజ్ఞాశాలి అనచ్చు అలాగే బహుముఖ మేధావి అని కూడా పిలవచ్చు ఎందుకంటే ఆయన అనేక రంగాల్లో మేధావి కనుక.
పీవీ నరసింహారావు గారు న్యాయవాది, పాత్రికేయుడు, నిజాంకి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు, భారత రాజకీయాల్లో తలపండిన దురంధురుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ఆయన భారతదేశ ప్రధాని పదవిని అలంకరించిన ఏకైక తెలుగు వ్యక్తి.
తన రాజనీతితో అపర చాణక్యుడిగా పేరొందిన ఆయనను భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా కూడా పరిగణిస్తారు. పీవీ గారి సాహితీ అన్వేషణ గమనిస్తే ఆయన బహుభాషా కోవిదుడు, పదిహేడు భాషలు మాట్లాడగలరు. అనేక పుస్తకాల్ని రాశారు, అనువాద రచనలు చేశారు.
నిన్న ప్రఖ్యాత తెలుగు చరిత్రకారుడు, రచయిత, శాసన పరిష్కర్త మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి ౧౩౦వ జయంతి.
ఆయన చారిత్రిక పరిశోధన చేసి, రాసిన పుస్తకాల్లో "ముసునూరి నాయకులు - ఆంధ్రదేశ చరిత్రలో ఒక విస్మృత అధ్యాయం"(ఏ ఫర్ గాటెన్ చాప్టర్ ఆఫ్ ఆంధ్ర హిస్టరీ), "రెడ్డి రాజ్యాల చరిత్ర"(హిస్టరీ ఆఫ్ ది రెడ్డి కింగడమ్స్) చాలా విశిష్టతను సంతరించుకున్నాయి.
ఇంకా ఆయన చేసిన చారిత్రిక రచనల్లో ప్రముఖమైనవి ఏమిటంటే, "ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము," "అమరావతీ స్తూపము," "చారిత్రక వ్యాసమంజరి," "బౌద్ధయుగము." సుప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త సి. నారాయణరెడ్డి గారు "కర్పూర వసంతరాయలు" అనే గేయకావ్యాన్ని రచించి మల్లంపల్లి గారికి అంకితమిచ్చారు.
ఈరోజు విఖ్యాత తెలుగు కవి, ఆధ్యాత్మిక వేత్త భైరవయ్య గారి ౭౯వ జయంతి. తెలుగు సాహిత్యంలో "దిగంబర కవులు" గా ప్రఖ్యాతిగాంచిన ఆరుగురి కవుల్లో "భైరవయ్య" గారు ఒకరు. ఆయన అసలు పేరు "మన్‌మోహన్ సహాయ్." ఆయన "నవత" త్రైమాసిక పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు.
"రా," "విషాద భైరవం" అనే గ్రంథాల్ని రచించిన ఆయన "ఎముకుల కేకలు," "దిగంబరి," "అగ్ని ప్రవేశం," "కరువు బిచ్చం," "నరమాంసం రుచి మరిగి," "నేను దేవుణ్ణి నమ్ముతున్నాను" అనే కవితలను రాశారు. పిమ్మట "భైరవానంద స్వామి" అనే పేరుతో ఆధ్యాత్మిక వేత్తగా మారిన ఆయన ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఈ సాహితీవేత్త జయంతి సందర్భంగా ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన కృషిని గుర్తుచేసుకుందాం. భైరవయ్య గారి జయంతి శుభాకాంక్షలు. జై తెలుగు తల్లి.
నేడు తెలుగు విప్లవ సాహిత్యంలో పేరుమోసిన కవి, రచయిత, అనువాదకుడు, కమ్యూనిస్టు చలసాని ప్రసాద్ గారి ౮౯వ జయంతి. "విరసం" అనగా విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆయన దానికి అధ్యక్షులుగా కూడా పనిచేశారు. "సాహిత్య వ్యాసాలు," "చలసాని ప్రసాద్ రచనలు" లాంటి రచనా సంకలనాలను ఆయన రాశారు.
మహాకవి శ్రీ శ్రీ గారి సమగ్ర సాహిత్యం "శ్రీ శ్రీ సాహిత్య సర్వస్వం" అనే పేరుతో ఇరవై సంపుటాలుగా వెలువడింది. దానికి సంపాదకత్వం వహించింది చలసాని ప్రసాద్ గారే. శ్రీ శ్రీ గారి సాహిత్యం మీద "చిరంజీవి శ్రీ శ్రీ" అనే పుస్తకాన్ని కూడా రచించారు.
ఈ సాహితీవేత్త జయంతి సందర్భంగా ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవల్ని మననం చేసుకుందాం. చలసాని ప్రసాద్ గారి జయంతి శుభాకాంక్షలు. జై తెలుగు తల్లి.
నేడు తెలుగువారికి బహుముఖ ప్రజ్ఞాశాలిగా, తెలంగాణ వైతాళికుడిగా సుపరిచితులైన సురవరం ప్రతాపరెడ్డి గారి ౬౮వ వర్ధంతి. నిజాం నిరంకుశత్వ పాలనలో మ్రగ్గుతున్న తెలంగాణ ప్రజలకు అండగా నిలిచిన "గోల్కొండ పత్రిక" కు ఆయన సంపాదకత్వం వహించారు.
తెలంగాణలో అసలు తెలుగు కవులు లేరంటూ ఎవరో విమర్శిస్తే, దానికి సమాధానంగా ఆయన తెలంగాణ ప్రాంతమంతటా పర్యటించి, ౩౫౪ మంది కవుల, రచయితల వివరాలను సేకరించి "గోల్కొండ కవుల సంచిక" అనే పేరుతో ప్రచురణ చేశారు.
తెలుగువారి సాంఘిక చరిత్రను తెలుపుతూ ఆయన పరిశోధన చేసి, రాసిన మహత్తరమైన సాధికారిక గ్రంథం "ఆంధ్రుల సాంఘిక చరిత్ర" గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ పుస్తకం కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకున్న తొలి తెలుగు పుస్తకంగా చరిత్రగాంచింది.