విజయనగర సామ్రాజ్యాన్ని బుక్కరాయలు పాలించే కాలంలో నేటి నంద్యాల జిల్లా నందవరం గ్రామంలో నందవరీక బ్రాహ్మణ దంపతులు అయిన శింగప్ప, మేళమ్మ దంపతులకు నందవరం చౌడేశ్వరీ దేవి కృప చేత ఒక మగశిశువు జన్మించాడు. ఆ దంపతులకు చిక్కప్ప అని పేరు పెట్టారు.
ఆ బాలుడికి అయిదు సంవత్సరాల వయస్సు వచ్చే నాటికి శింగప్ప మరణించడంతో, నందవరంలో జీవనోపాది లేక చిక్కప్పను తీసుకుని మేళమ్మ విజయనగర రాజధాని హంపి చేరుకుంది. బాల చిక్కప్ప ఒకనాడు పంపా తీరంలోని కోదండరామ స్వామి ఆలయం సమీపంలో ఒక మర్రిచెట్టు వద్ద ఆడుకుంటూ ఆడుకుంటూ అక్కడే నిద్రకు ఉపక్రమించాడు.
ఆ మర్రిచెట్టు పక్కనే ఒక పాము పుట్ట ఉండేది. ఆ పుట్టలోని పాము బయటకు వచ్చి నిదురిస్తున్న చిక్కప్ప ముఖంపై ఎండ పడుతుండటంతో తన పడగను అడ్డుపెట్టి ఎండ పడకుండా ఆపింది. అటుగా వెళ్తోన్న పాములు అందించే నాగజోగి అనే వాడు ఈ దృశ్యం చూసి ఈ బాలుడు భవిష్యత్తులో గొప్పవాడు అవుతాడు అని తలచాడు.
కొంచెం సేపటికి ఆ పాము పుట్టలోకి వెళ్ళిపోయింది. చిక్కప్ప నిద్ర లేచిన తరువాత, నాగజోగి తన నాగస్వరంతో ఒక మంచి పాట పలికించగా పుట్టలోని పాము బయటకు వచ్చి పడగ విప్పి నాట్యం చేయగా చిక్కప్ప బాగా సంతోష పడ్డాడు. అప్పుడు నాగజోగి ఆ బాల చిక్కప్పతో నీవు ఎప్పటికైనా ధనవంతుడివి అయితే
నా పేర 5 చెరువులు, 5 గ్రామాలు నిర్మించాలి అని మాట తీసుకున్నాడు.నందవరం నుండి వచ్చిన మేళమ్మ, చిక్కప్ప లకు బుక్కరాయల మంత్రి నారాయణప్ప ఆశ్రయం ఇచ్చి, చిక్కప్పకు ఉపనయనం చేయించి, విద్యాబుద్ధులు నేర్పించి మంచి ప్రయోజకుడిగా తీర్చిదిద్దాడు. నారాయణప్పతో పాటు చిక్కప్ప రాచనగరికి వెళ్ళేవాడు
కొన్నాళ్ళకి ఒకరోజు బుక్కరాయలకు ఢిల్లీ సుల్తాను నుండి ఒక ఫర్మాణా వచ్చింది. అది చదవడానికి ఎవరైనా ఉన్నారేమే చూడమని రాజు పురామయించగా వారికి ఎవ్వరూ దొరకలేదు. చివరగా నారాయణప్ప ఇంటి అరుగు మీద పడుకుని ఉన్న చిక్కప్పను లేపి అతనికి ఫర్మానా చదవడం తెలుసునని కనుగొని రాజు దగ్గరకు తీసుకెళ్లారు.
రాజు ఆ ఫర్మాణాను చిక్కప్పకు ఇవ్వగా చిక్కప్ప ఉత్తరం మొత్తాన్ని క్షుణ్ణంగా చదివి వినిపించాడు.
మరుసటినాటి ఉదయం రాజు ఆ ఉత్తరానికి ప్రత్యుత్తరం ఇవ్వదలచి ఆ ఉత్తరం కోసం చూడగా అది కనపడలేదు. అందులోని విషయాలు, సారాంశం గుర్తుకులేక, ఆస్థానంలోని రాయసగాండ్రు మొదలైన వారిని అడగగా
వారు కూడా తమకు అంతగా జ్ఞాపకం లేదు అని చెప్పారు. ఇంతలో నారాయణప్ప తో పాట సభ చేరిన చిక్కప్ప తనకు ఆ ఉత్తరం మొత్తం గుర్తు ఉందని అక్షరం పొల్లు పోకుండా ఢిల్లీ సుల్తాను ఉత్తరం తిరిగి రాసి రాజు అనుమతితో సుల్తానుకు జవాబు కూడా రాసి సభలో అందరి ముందు చదివి వినిపించాడు.
బుక్కరాయలు తన మనస్సులో ఎటువంటి జవాబు ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాడో అదే విషయం చిక్కప్ప తన ఉత్తరంలో కూడా రాశాడు. అతని జ్ఞాపకశక్తికి, ప్రతిభకు రాజుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. మరుసటిరోజు రాజుకు పోయిన ఢిల్లీ సుల్తాను ఉత్తరం దొరికింది.
ఆ ఉత్తరం, చిక్కప్ప రాసిన నకలు ఉత్తరం పక్కన పెట్టుకుని చూడగా అక్షరం పొల్లుపోకుండా సరిపోయాయి. దీనితో చిక్కప్ప గొప్పతనం తెలుసుకున్న బుక్కరాయలు అతనిని సభకు పిలిపించి, ఘనంగా సత్కరించి అతనికి ప్రధాని పట్టం కట్టి అతని పేరును చిక్కప్ప ఒడయరు అని పెట్టాడు.
తను పెంచి విద్యాబుద్ధులు నేర్పించిన చిక్కప్ప ఎదుగుదల చూసి నారాయణప్ప ఎంతగానో ఆనందించాడు.
తన కుశాగ్రబుద్ధితో చిక్కప్ప వడయరు ధర్మబద్ధంగా విధులు నిర్వహిస్తూ రాజ్య ఖాజానాకు ఆదాయం బాగా పెరిగేలా చూశాడు. చిక్కప్పకు వివాహం చేయతలచి బుక్కరాయలు బ్రాహ్మణులను పురామయించాడు.
అయితే అనేక అవాంతరాల వలన, దుశ్శాకునాల వలన ఆ కార్యం నెరవేరలేదు. ఇంతలో బుక్కరాయలు ఒక యుద్ధంలో పాల్గొనవలసి వచ్చింది. బుక్కరాయలు భాద్యతలు, రాజలాంఛనం మొ. అన్నీ చిక్కప్ప కు అప్పగించి, తాను తిరిగివచ్చేవరకు అందరూ చిక్కప్ప మాట వినాలని చెప్పి యుద్ధానికి భారీ సైన్యంతో వెళ్లాడు.
రాజ్యంలో రాజు లేకపోయినా పాలనకు ఏ లోటూ లేకుండా చిక్కప్ప రాజ్యాన్ని పాలించాడు. కొన్నాళ్లకు చిక్కప్ప అనారోగ్యం పాలయ్యాడు. ఎంత మంది వైద్యులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అతని వ్యాధిని నయం చేయలేకపోయారు. ఆ విషయం తెలుసుకున్న బుక్కరాజు యుద్ధ బాధ్యతలను ఇతరులకు అప్పగించి హంపి చేరుకున్నాడు.
చిక్కప్ప తనకు అప్పగించిన రాజ లాంఛనం రాజుకు ఇచ్చిన తరువాత రాజు నీవు ధర్మాత్ముడివి ఏదైనా కోరుకో అనగా చిక్కప్ప "రాజా మీరు సంపాదించిన ఖజానా ఉంది.. నేను సంపాదించి పెట్టిన ఖజానా ఉంది. రెండు ఖజానాలు నాకు అప్పగిస్తే ధర్మకార్యాలు చేస్తాను" అని పలుకగా,
బుక్కరాయలు సంతోషంగా రెండు ఖాజానాలు చిక్కప్ప కు అప్పగించి ఇద్దరి పేర్లు నిలిచేలా ధర్మకార్యాలు చేయమని చెప్పాడు. చిక్క ఓడయరు రాజ ఆస్థానం నుండి వీడ్కోలు తీసుకుని మొదట నాగజోగికి ఇచ్చిన మాట ప్రకారం
నాగసముద్రం చెరువు
నాగలూరు చెరువు
నాగలమడక చెరువు
నాగలాపురం చెరువు
నాగాని చెరువు
అని 5 చెరువులు, వాటి వద్దే 5 ఊర్లు కట్టించి నాగజోగి పేరిట కృష్ణార్పణముగా బ్రాహ్మణులకు సర్వమాన్యాలుగా ఇచ్చాడు. తరువాత మీద పుష్పగిరి వద్ద చెరువు కట్టాలని చూడగా, గంగాదేవి తాను అక్కడ నిలవనని చెప్పెను. ఆ తరువాత పార్నపల్లె వద్ద చెరువు నిర్మించ తలపెట్టగా అది కూడా వీలు కాలేదు.
ఆ తరువాత పండమేరు మీద ఒక చెరువు కట్టి, చెరువుకు రెండు వైపులా ఒక్కో గ్రామం కట్టించి వాటికి తన ప్రభువు అయిన బుక్కరాయలు, ఆయన భార్య అయిన ఆనంతమ్మ పేరిట బుక్కరాయసాగరం, ఆనంతసాగరం అని పేర్లు పెట్టాడు.చిత్రావతి నది మీద ఒక చెరువు కట్టించి దానికి రెండు వైపులా ఒక్కో గ్రామాన్ని కట్టించాడు.
వాటికే బుక్కసాగరం (బుక్కపట్నం), అనంతసాగరం (కొత్త చెరువు ) అని పేరు. ఆ తరువాత చిత్రావతిపై తన తల్లి పేరిట మేళమ్మ చెరువు అని మరో చెరువు నిర్మాణం చేసి అక్కడ ఒక గ్రామం నిర్మించి దేవబ్రాహ్మణులకు సర్వమాన్యంగా ఇచ్చాడు.
ఆ తరువాత బుక్కపట్నానికి సమీపంలోని ఒక అరణ్యంలోకి వెళ్లి అదృశ్యమయినాడ
ు. ధర్మవరంలోని క్రియాశక్తి ఓడయరు ఆ స్థలం చేరుకుని అక్కడ ఒక గ్రామం కట్టించి దానికి కనుమొక్కల అని పేరు పెట్టాడు.
ఈ విధంగా అనంతపురంలో అనేక చెరువులు, గ్రామాలు నిర్మించడమే కాక, జిల్లా కేంద్రమైన అనంతపురం నిర్మాతగా కూడా చిక్కప్ప ఒడయరు చిరస్మరణీయులు
ఈ ఫోటోలోని వ్యక్తి ముండ్లూరి గంగప్ప గారు. బళ్ళారి నియోజకవర్గం నుండి 1952లో మద్రాసు శాసనసభకు ఎన్నికయినవారు.
బళ్ళారిని మైసూరు రాష్ట్రంలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
1955లో మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్ (ఫజల్ అలీ కమీషన్) బళ్లారిని, తుంగభద్రా
ప్రాజెక్టును ఆంధ్రాలో (సీమలో) కాలపాలని చెప్పినప్పటికీ నాటి కేంద్ర ప్రభుత్వం ఆ సిఫార్సును అంగీకరించక బళ్లారిని మైసూరు రాష్ట్రంలోనే కొనసాగించాలని నిర్ణయించడంతో, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి బళ్ళారిని ఆంధ్రాలో కలపాలి అనే నినాదం మీద ఉపఎన్నికలకు వెళ్ళారు
ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్ పాల్గొనలేదు. బళ్ళారిలో ఆంధ్రుల అభ్యర్థిగా గంగప్ప గారు, కన్నడిగుల అభ్యర్థిగా HS గౌడ తలపడ్డారు.
హోరాహోరీగా సాగిన ఆ ఎన్నికలలో గౌడగారికి 31708
వోట్లు రాగా, గంగప్ప గారికి 28917 ఓట్లు రాగా, స్వల్ప ఓట్ల వ్యత్యాసంతో ఆంధ్రుల అభ్యర్థి గంగప్పగారు ఓడిపోయారు.