#నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చింది. చాలమందిమి ఎంతో సంతోషించాం. ఐతే, కొందరు ఈ పాట అంత గొప్ప పాటా?ఈ అవార్డు వచ్చే అర్హత ఉందా అన్న ప్రశ్న వేశారు. సంతోషించిన కొందరి మనసుల్లో ఎక్కడో ఉండి ఉండొచ్చునని నా గమనిక. అందుకే ఈ థ్రెడ్. @ssrajamouli@mmkeeravaani@kanchi5497
సినిమా పాటల గురించి, వాటి గొప్పదనం మనకు ఏళ్ళ తరబడి ఉన్న ఆలోచనలను ఈ పాటకు పురస్కారం రావడం సవాలు చేస్తుంది. కాబట్టి దీనిని అర్థం చేసుకోవడానికి కొత్త చూపు అవసరం.
మొదట - ఈ పాట ప్రత్యేకత ఏమిటో చెప్పుకుందాం.
తర్వాత - ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం ఎంతవరకూ సబబు అన్నదీ చూద్దాం.
"నాటు నాటు" పాట ఒక స్థాయిలో చూస్తే "శివ శంకరీ" (జగదేకవీరుని కథ - 1961), "తకిట తథిమి" (సాగర సంగమం - 1983) వంటివాటికి సరి సమానమైనది. ముఖ్యంగా ఈ పోలిక దర్శకుల ఇమేజినేషన్, ఎగ్జిక్యూషన్, అవి ప్రేక్షకుల్లో కలిగించే స్పందన అన్న అంశాల్లో ఒప్పుతుంది.
దర్శకుల రూపకల్పన చేసిన పద్ధతి చూస్తే - ఈ పాటలు స్పష్టంగా 3-యాక్ట్ స్ట్రక్చర్లో ఉంటాయి. సినిమా స్క్రీన్‌ప్లే విషయంలో ప్రాచుర్యంలో ఉన్న 3-యాక్ట్ స్ట్రక్చర్‌లో పాటలు రాయడం వల్ల వీటికొక ప్రత్యేకత ఏర్పడింది. దర్శకులు కావాలనుకున్న ఎఫెక్ట్ రావడానికి వీలు పెరిగింది.
మీకు తెలిసి ఉండొచ్చు. కానీ 3 యాక్ట్ స్ట్రక్చర్ క్లుప్తంగా -
3 యాక్ట్ స్ట్రక్చర్ సినిమాని 3 యాక్ట్స్‌గా విభజిస్తుంది.
1వ యాక్ట్ - Set up. ప్రోటాగనిస్ట్‌కి ఒక సమస్య ఏర్పడడం, ఒక లక్ష్యం ఏర్పడడం ఇందులోనే. పాత్రల నుంచి కథా ప్రపంచం వరకూ పరిచయం. మన సినిమాల్లో మొదటి 30-35 ని.ల దాకా.
2వ యాక్ట్‌లో - సినిమాకు సంబంధించిన ప్రధానాంశాలు ఇక్కడ జరుగుతాయి. హీరో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేయడం, తదితర విషయాలు ఇక్కడ జరుగుతాయి. హీరో యత్నాలు, ఎదురయ్యే విషయాలు ప్రేక్షకులను అలరిస్తాయి.
మన సినిమాల్లో 30 నిమిషాల నుంచి, ఇంటర్వెల్, తర్వాత మరో అరగంట ఇక్కడే గడుస్తుంది.
యాక్ట్ 3- the resolution ఇక విజయం పొందే అవకాశం లేదన్న స్థాయికి యాంటీ క్లైమాక్స్ తీసుకెళ్ళడం, దాన్నుంచి విజయానికి లాక్కుపోవడం - ఇలా క్లైమాక్స్ దిశగా తీసుకెళ్తుందట యాక్ట్ 3.
ఇది simplification. లోపాలు ఉండొచ్చు. అయితే, మనం మన నాటు నాటు పాట విషయం మాట్లాడుకోవడానికి ఈ బండ వివరణ చాలు.
ఇలాంటి ఒక 3-యాక్ట్ స్ట్రక్చర్‌తో ఈ పాట ఉంటుంది. అది కూడా పాట నేపథ్యం ఏమిటి? దాదాపు సినిమా నేపథ్యమే దీనిది కూడాను. ఒక జానపద వీరగాథ లాంటి థీమ్స్ రెంటివీ.
ఈ పాటకు 3 యాక్ట్స్ ఇలా ఉంటాయి:
రామ్, భీమ్‌లను జాతి వివక్షతో ఒక తెల్లవాడు అవమానించి, డ్యాన్స్‌కి వచ్చే అర్హత ఉందా అని రెచ్చగొట్టి, మీకు డ్యాన్స్ తెలుసా అని మొదలుపెడతాడు. ఇలాంటి ఒక అవమానాన్ని ఎదుర్కోవడం లక్ష్యం. ఆ ఎదుర్కోవడానికి డ్యాన్సే మార్గం.
రెండవ యాక్ట్ రూపంలో "నాటు నాటు" పాట వస్తుంది. దుమ్మురేపే డ్యాన్సుతో, కాలు నిలవనివ్వని ట్యూనుతో ప్రేక్షకులను లీనం చేసుకుంటుంది. ఇక్కడ రెండవ యాక్టు ద్వారా ప్రేక్షకులను ఎంతగా రంజింపజేయాలో అంతా చేశారు ఆ పాట బీటు ద్వారా, నాటు డ్యాన్సు ద్వారా.
ఇక 3వ యాక్ట్‌లో సరదా డోసు పెరుగుతుంది. britisherని ఓడించడం అన్నది సాధించడమే కాదు అది చిన్నదై లక్ష్యం మారిపోతుంది. హీరోలిద్దరిలో ఎవరు గెలుస్తారన్న పోటీగా తయారవుతుంది. చివరకు జెన్నీ మనసును భీమ్ గెలవాలని రామ్ తనంత తాను ఓడిపోవడంగా ముగుస్తుంది. తెరపైనా, ఎదుట అందరి మనసులు గెలుస్తారు.
అలా ఇది "కేవలం" ఒక పాట కాదు. ఐదు నిమిషాల్లో సాగే ఒక పూర్తి నిడివి కథనం. ఈ కథనం రక్తి కట్టడానికి దర్శకుడు, రచయిత రాసుకున్న ఊహా సౌధం ఒక్కటీ సరిపోదు. దానికి రక్తమాంసాలిచ్చేవాళ్ళు కావాలి. పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అవసరం. అప్పుడే తెరమీదికి సాంకేతిక నిపుణులు, నటీనటులు వస్తారు.
ఆ ఎగ్జిక్యూషన్ గురించి చెప్పుకోవడానికి ముందు మళ్ళీ నేను చేసిన పోలిక సంగతి చూద్దాం. నేను పైన రెండు పాటలు ప్రస్తావించాను కదా - "శివశంకరీ", "తకిట తథిమి". ఈ రెండు పాటలు కూడా ఇలానే పూర్తి నిడివి కథలు చెప్తాయి. వీటి రెంటికీ సినిమాకి వర్తించే స్క్రీన్‌ప్లే సూత్రాలు స్థూలంగా వర్తిస్తాయి.
"శివశంకరీ" పాటలో ప్రతాప్ (ఎన్టీఆర్) ఒక శిలను కరిగితే కానీ ఒక ముని అందులోంచి శాపవిముక్తుడు కాడు, అది సాధించాలంటే శిలలు కరిగేలా పాటపాడాలి. హీరోకి అప్పటికే ఉన్న వరాన్ని ఉపయోగించుకుని ఒక్కడే ఐదుగురిగా మారి పాట పాడతాడు. శిల కరుగుతుంది.
తకిట తథిమి పాటలో చెప్పే కథ వేరు. దర్శకుడు కె.విశ్వనాథ్‌ని నేను "మాస్టర్ ఆఫ్ డ్రామా" అంటాను. ఆయన డ్రామాని రూపకల్పన చేయడంలోనూ, పండించడంలోనూ వేరే స్థాయిలోని దర్శకుడు.
తాగుబోతుగా మారిన నాట్యాచార్యుడు hero, హీరోయిన్ తన భర్త పోయిన విషయం తెలియకుండా ఉంటుంది కదా. ఇది ప్రిమైస్.
హీరో పూర్తిగా తాగేసి హోరుమన్న వానలో బావి మీద నాట్యం చేస్తూంటాడు. పనివాడు ఎంత చెప్పినా వినడు. ఆమె ఎదురైతే బొట్టులేదన్నది తెలుస్తుంది. అలాగని ఊరుకోలేదు. అతను నాట్యం చేస్తూండడం సాగుతూ పరిస్థితి క్షణక్షణంలో ముదురుతూ ఉంటుంది. ఆమె ఏం చేసిందన్నది రిజల్యూషన్.
మూడు పాటల్లో కథ వేరు. రాబట్టాలనుకున్న ఎమోషన్ వేరు. అందువల్ల వాళ్ళది రాబట్టేందుకు చేసినవి వేరు.
- కె.వి.రెడ్డి తన పాటని రక్తి కట్టించడానికి సంగీతాన్ని ఎంచుకున్నారు ఘంటసాల ఆ పాటకు హీరో. పెండ్యాల సంగీతమూ అద్భుతం. NTR, పింగళి సాయపడ్డారు. సినీ చరిత్రలో ఆ గానం అజరామరం.
కె. విశ్వనాథ్ ప్రధానంగా స్క్రీన్‌ప్లే రచనా బలాన్ని నమ్ముకుని, ఆపైన సంగీతం-సాహిత్యం-నటన-నాట్యం అన్న స్తంభాలపై దాన్ని నిలబెట్టారు. ఇందులో వేటూరి, ఇళయరాజా, కమల్, జయప్రద ఒకరితో ఒకరు పోటీడ్డారు.
"నాటు నాటు" పాట విషయంలో దర్శకుడు @ssrajamouli కి తాను పాట ద్వారా చెప్పే కథ రక్తి కట్టించడానికి ఒక బ్రహ్మాండమైన డ్యాన్స్ కావాలి, ఆ డ్యాన్స్‌ని సమర్థించగలిగే ఉత్సాహకరమైన పాట కావాలి.
సినిమా పాట సంగీతపరంగానో, సాహిత్యపరంగానో, రెంటిలోనో అత్యద్భుతంగా ఉంటే తప్ప గొప్ప పాట అవ్వదని నమ్ముతున్నారని చాలామంది చేసిన విమర్శలు చూశాకా నాకు తోచింది. కానీ, దర్శకుడు తాను చెప్పదలచుకున్నది చెప్పి, రంజింపజేయడానికి ఏది ఎంత అవసరమో అంతవరకూ వాడుకోవాలి. అదే ఈ మూడు పాటల్లో జరిగింది.
ఇదంతా సినిమా థియేటర్‌లో సంతోషంతో గంతులు వేస్తున్న ప్రేక్షకులకు తెలిసే చేస్తారా? అంటే అలా చెయ్యరు. కానీ, వాళ్ళను విజిల్స్ వేయించిన ఈ పాట వెనుక ఇలాంటి స్ట్రక్చర్ ఉందనీ, ఇంత ప్రణాళిక, కృషి ఉందనీ గమనించడం, తెలియజేయడం విమర్శకులకు శోభస్కరం.
చివరగా ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం రావడం సబబా? బేసబబా? అన్న ప్రశ్నకు నేను సమాధానం చెప్పను. ఆ పని మీకే వదిలేస్తున్నాను. బైదవే - మీరేం సమాధానం చెప్పుకున్నా అది మీ ఇష్టం. నా అభిప్రాయమైతే నూటికి నూరుపాళ్ళూ ఈ పాట అర్హమైనదే అని. #NaatuNaatuForOscars#RRRGoesGlobal
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
జీవితంలో కొన్ని విషాదాలు శాశ్వతం. కానీ ఆనందాలు ఎప్పటికీ తాత్కాలికమే.
- స్వరూప్ తోటాడ
సినిమా మ్యుజింగ్స్ పుస్తకం
సత్యమే శివమ్ వ్యాసం
"నగరాల చరిత్రల్లో మన కథలు కనీసం ఒక ప్రస్తావనగానైనా ధ్వనించకపోవచ్చు, కానీ ఆ చరిత్రలకు రక్తమాంసాల్ని, కాలం కరిగిపోయినా చెరిగిపోని గురుతుల్ని, నీడల్ని, రంగునీ, వాసనని ఇచ్చేవి మన జీవితాలే"
- స్వరూప్ తోటాడ,
సినిమా మ్యూజింగ్స్,
Hiroshima Mon Amour వ్యాసం
"యౌవనప్రాయంలో ఆశయాలు, కలలు, ఊహలు చిగుర్లు వేయటానికి వాస్తవాల అనుమతి అవసరం ఉండదు. కలల రంగుటద్దాల్లోంచి చూస్తే ప్రపంచం, భవిష్యత్తు అద్భుతంగానే కనిపిస్తాయి. ఓటమి ఈ ప్రపంచపు practicalityని పరిచయం చేసి నిజాన్ని చూపిస్తుంది"
- స్వరూప్ తోటాడ
సినిమా మ్యూజింగ్స్
The wild pear tree వ్యాసం
"ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మము రక్షించగా
తక్కినవి భాండారాన దాచి ఉంచనీ"
అన్నమయ్య "దాచుకో నీ పాదాలకు" అంటూ రాసిన కీర్తనలో పాదం ఇది. నాకెంతో ఇష్టమైన కీర్తన. 32 వేల కీర్తనలు రాసి ఒక్కటి చాలు నన్ను రక్షించేందుకు అంటున్నాడు మహానుభావుడు.
సంకీర్తనాచార్యత్వం ఒక పదవిగా అన్నమయ్య జీవితకాలంలో ఏర్పడి పెద తిరుమలాచార్యులకు అది సంక్రమించిందని వెల్చేరు నారాయణరావు భావించారు. తాళ్ళపాక వారి సంకీర్తనలు రాగిరేకులపై రాయించి తిరుమల ఆలయంలోని తాళ్ళపాక వారి అర అన్న సంకీర్తన భాండాగారంలో భద్రపరిచడానికి పెద తిరుమలయ్య ఆధ్వర్యం వహించారు.
రాగిరేకులపై చెక్కించి భద్రపరచడం ఏమీ సామాన్యమైన, సులువైన పని కాదు.
అంతేకాక, తదనంతర కాలంలో "భాండారం వద్ద అఖండ దీపారాధనలు, పూజా నివేదనలు ఘనంగా నిర్వహింపబడినట్లు భక్తులకు అతిరసాల ప్రసాదాన్ని వితరణ చేశారని" శాసనాలు చెప్తున్నాయట.
"కించిత్ భోగే భవిష్యతి" అని డాక్టర్ వేమూరి వెంకటేశ్వరరావు గారు ఒక అరవై ఏళ్ల క్రితం రాసిన కథను వి.బి.సౌమ్య గారు ఇంగ్లీష్ లోకి అనువదించారు.
సైన్స్ ఫిక్షన్ + హాస్యం కలగలిసి ఉండడమే కాదు కథలో ఉండే మలువు కోవిడ్ చూసొచ్చిన మనకు గొప్ప ఆశ్చర్యం కలిగిస్తుంది.
Dr. వేమూరి వెంకటేశ్వరరావు గారు తెలుగులో పాపులర్ సైన్స్ విషయంలో చేస్తున్న కృషి అనన్య సామాన్యం. 1960ల్లోనే ఈయన కంప్యూటర్ల గురించి తెలుగులో రాశారంటే నమ్ముతారా? తెలుగులో తెలుగువారు సైన్స్ గురించి చదువుకోవాలి అన్న ఆశయంతో ఎంతో చక్కని ఆసక్తికరమైన పుస్తకాలు రాశారు.
ఈయన రచనా శైలి ఎలా ఉంటుందో మచ్చు కోసం "రామానుజన్ నుండి అటూ ఇటూ" అన్న రచనలో పేజీలు ఇక్కడ పెడుతున్నాను చూడండి:
(ఇది ఎవరైనా పంచుకోగల విధంగా ఆయనతో నేను వికీసోర్సులో పెట్టించిన పుస్తకం)
చందమామ పత్రిక ఎలాగైతే నా చిన్నతనంలో తెలుగు వైపుకు మళ్ళించి, ఊహకు రెక్కలు తొడిగిందో, అలానే కౌమారానికి, యౌవనానికి మధ్య కాలంలో నన్ను తీర్చిదిద్దడంలో ఎంతో పనికివచ్చినది ఈ హాసం పత్రిక. ఈ అక్టోబరుకు హాసం పత్రిక ప్రారంభమై 20 ఏళ్ళు నిండి 21 ఏడు ప్రారంభమైంది. #అభిరుచి#తెలుగు#పత్రిక
ఇది ప్రారంభమైన ఏడాదికి కానీ నాకు పరిచయం కాలేదు. అప్పటికి నేను తొమ్మిదో క్లాసు చదువుతున్నాను. మా తాడేపల్లిగూడంలోని సత్యసాయి సేవాసమితిలో ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూంటే పాల్గొనడానికి వెళ్ళినప్పుడు, అక్కడ మా సీనియర్ ఒక అబ్బాయి (పదో తరగతి అన్నమాట అతను చదివేది) ఎదురుపడ్డాడు.
అతను ఆశ్చర్యపోయాడు నువ్వూ ఇక్కడికి వస్తావా అని. ఆ తర్వాత నన్ను కాసేపు ఇంటర్వ్యూ చేశాడు, ఇష్టమైన సినిమాలు, నచ్చే సంగీతం, పుస్తకాలేమైనా చదివావా అన్న టైపులో. అప్పుడు నాక్కూడా (అతనికి తన టైపు జనం ఉండరని గట్టి నమ్మకం కలిగినట్టుంది)