రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి గారి ఎన్నిక - విశేషాలు
ఫిబ్రవరి 11, 1977 భారతదేశ 5 వ రాష్ట్రపతి శ్రీ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఆకస్మికంగా మరణించారు. అప్పటికి ఎమర్జెన్సీ ఇంకా అమలులో ఉంది. తాత్కాలికంగా నాటి ఉపరాష్ట్రపతి శ్రీ BD జత్తి గారు రాష్టపతిగా ప్రమాణస్వీకారం చేశారు.
తరువాత కొంతకాలానికే సార్వత్రిక ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ ఓడిపోయి జనతాపార్టీ గెలిచి, మొరార్జీ దేశాయి గారు ప్రధాని అవ్వడం జరిగింది. ఆ ఎన్నికలో నంద్యాల నుండి ఎన్నికై నీలం సంజీవరెడ్డి గారు లోకసభ స్పీకర్ గా ఎన్నుకోబడ్డారు.
ఆ తరుణంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో అధికారపక్ష, విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఏకగ్రీవంగా భారతదేశ 6 వ రాష్ట్రపతిగా సంజీవరెడ్డి గారు ఎన్నుకోబడ్డారు. అప్పటికే ఆయన 1969లో రాష్ట్రపతిగా పోటీచేసి ఆ ఎన్నికలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.
రాష్ట్రపతి ఎన్నిక బరిలో నీలం సంజీవ రెడ్డి గారి ప్రస్థానం గురించి మీకు తెలియని విషయాలు
1. నీలం సంజీవరెడ్డి గారు రెండు సార్లు రాష్ట్రపతిగా పోటీ చేస్తే, రెండూ సార్లు పోటీకి ముందు లోక్సభ స్పీకర్ గా ఉన్నారు. నీలం సంజీవరెడ్డి గారు 1969లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా,
తిరిగి 1977లో అధికార - ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీ పడ్డారు. ఆ రెండు సార్లు పోటీ పడే సమయంలో లోక్ సభ స్పీకర్ గా ఉండి పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతిగా పోటీచేశారు.
2. అతి పిన్నవయస్కుడైన రాష్ట్రపతిగా నీలం సంజీవ రెడ్డిగారి రికార్డు
1977లో నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటికీ నీలం సంజీవరెడ్డి గారి ఎన్నికనగానే మొదట ఏకగ్రీవ ఎన్నిక గుర్తొస్తుంది అయితే అత్యంత పిన్న వయసులో (64 సంవత్సరాల రెండు నెలలు) రాష్ట్రపతి ఎన్నిక అయిన రికార్డు కూడా నీలం సంజీవరెడ్డి గారికి సొంతం.
64 సంవత్సరాల ఒక నెల వయసులో ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అయ్యి ఇప్పటి వరకు నీలం సంజీవరెడ్డి గారి పేరు మీద ఉన్న రికార్డు చెరిపేయబోతున్నారు.
3. ముగ్గురు ప్రధానులు, ముగ్గురు ఉప ప్రధానులు ప్రతిపాదించిన అభ్యర్థి నీలం సంజీవరెడ్డి.
1977లో అధికార, విపక్ష పార్టీలు రెండూ
నీలం సంజీవరెడ్డి పేరును అభ్యర్థిత్వాన్ని బలపరిచాయి. రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ప్రకారం 15 మంది ఓటర్లు సంజీవ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించగా 12 మంది ఓటర్లు బలపరిచారు. సంజీవరెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన వారిలో నాటి ప్రధాని మొరార్జీ దేశాయి తో పాటు
తర్వాతి కాలంలో ప్రధానమంత్రులైన చౌదరి చరణ్ సింగ్, ఏబీ వాజ్పేయి ఉన్నార.. అలాగే సంజీవరెడ్డి గారిని ప్రతిపాదించిన వారిలో లో బాబు జగ్జీవన్ రామ్, వై బి చవాన్, ఎల్కే అద్వానీ గార్లు తరువాతి కాలంలో ఉప ప్రధానులయ్యారు.
4. రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి గారి పోటీ - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఓటు
1967లో కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డి గారు, స్వతంత్ర అభ్యర్థిగా వి వి గిరి గారు రాష్ట్రపతి పదవికి పోటీ పడినప్పుడు - ఆంధ్రుడు అయినప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి అయినప్పటికీ
కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో నీలం సంజీవ రెడ్డి గారికి మెజారిటీ ఓట్లు రాలేదు. మొత్తం 285 (ఓట్ల విలువ 34, 000) ఓట్లలో వివి గిరి గారికి 131 ఓట్లు (ఓట్ల విలువ 16,375) నీలం సంజీవరెడ్డి గారికి 118 ఓట్లు (ఓట్ల విలువ 14,750) వచ్చాయి
5. 1977లో సంజీవరెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారంటే ఇంకెవరూ నామినేషన్ దాఖలు చేయలేదు అనుకుంటారు. కానీ ఆ సంవత్సరం రాష్ట్రపతి ఎన్నికకు సంజీవరెడ్డి గారితోపాటు మరో ఇద్దరు నామినేషన్ దాఖలు చేశారు. తగినంత మంది ఓటర్లు వారి పేర్లను ప్రతిపాదించక పోవడం వల్ల వారి నామినేషన్ చెల్లలేదు.
6. జూలై 25 - నీలం సంజీవరెడ్డి గారు 1977 జూలై 25 లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు ఆనాటినుండి నేటి వరకు కూడా కొత్త రాష్ట్రపతులందరూ జూలై 25వ తేదీన ప్రమాణస్వీకారం చేస్తున్నారు.
7. అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ - ఇద్దరు రాష్ట్రపతులు
ఇప్పటివరకూ రాయలసీమ నుండి ఇద్దరు రాష్ట్రపతులు కాగా,
ఇద్దరికీ అనంతపురం ఆర్ట్స్ కాలేజీ తో అనుబంధం ఉంది ఉంది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో అధ్యాపకుడిగా పని చేయ నీలం సంజీవరెడ్డి అదే కళాశాలలో చదువుకున్నారు
8. రాష్ట్రపతి న్నికల బరిలో నీలం సంజీవ రెడ్డి - ఇతర రికార్డులు
ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి (1977)
అతి చిన్న వయసులో రాష్ట్రపతి గా ఎన్నికైన వ్యక్తి
మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రతిపాదించిన/బలపరిచిన వ్యక్తి ఓటమి అవ్వడం(1969)
మొదటిసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రాష్ట్రపతి అవ్వడం
అత్యల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం(1969)
2సార్లు వేరే వేరే పార్టీల నుండి రాష్ట్రపతి పదవికి పోటీ పడటం
9. రాష్ట్రపతిగా నీలం సంజీవ రెడ్డి గారు - అనుకోకుండా అవకాశం
ఒక రకంగా చెప్పాలంటే శ్రీ పి.వి.నరసింహారావు గారు అనుకోకుండా ప్రధానమంత్రి అయినట్లే, సంజీవరెడ్డి గారు కూడా అనుకోకుండా రాష్ట్రపతి అయ్యారు. 1974 లో రాష్ట్రపతి అయిన ఫకృద్దీన్ అలీ అహ్మద్ గారు 1977లో అకాల మరణం చెందడంతో,
రాష్ట్రపతి ఎన్నిక సమాయనికి అధికారంలో ఉన్న జనతా పార్టీ అభ్యర్థిగా ఎన్నుకోవడానికి నీలం సంజీవ రెడ్డి గారికి మార్గం సుగమం అయింది. అలా కాకుండా 1979 జూలై వరకు ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు ఐదు సంవత్సరాలు పూర్తి కాలం రాష్ట్రపతిగా ఉండి ఉంటే,
1979 జూలై నాటికి జనతా పార్టీ ప్రభుత్వం పరిస్థితులలో అప్పటికి నీలం సంజీవ రెడ్డి గారి ఎన్నికకు రాజకీయ సమీకరణాలు ఎంత వరకు అనుకూలించేవనేది ప్రశ్నార్థకం.
10. నీలం సంజీవ రెడ్డి గారిని లోకసభ స్పీకరిని చేసిన హిందూపురం నియోజకవర్గం, రాష్ట్రపతిని చేసిన నంద్యాల నియోజకవర్గం.
ఎమర్జెన్సీ అనంతరం జరిగిన 1977 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లోని మొత్తం 42 లోక్సభ స్థానాలకు గాను 40 స్థానాలు కాంగ్రెస్ కూటమి కైవసం చేసుకోగా కేవలం నీలం సంజీవరెడ్డి గారు మాత్రమే జనతా పార్టీ తరఫున నంద్యాల నుండి ఎన్నికయ్యారు.
ఆ విజయమే ఆయనను రెండవసారి స్పీకర్ గా తరువాత రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంచుకోవడంలో దోహదపడింది.
అలాగే 1967 సార్వత్రిక ఎన్నికలలో సంజీవ రెడ్డిగారు హిందూపురం నుండి ఎన్నికై 67 నుండి 69 వరకు లోక్ సభ స్పీకర్ గా చేశారు
రాయలసీమలో పులగం పేరు తెలియని వారు ఉండరు. శనివారాల్లో, పండగ దినాల్లో ( ముఖ్యంగా సంక్రాంతి పండుగకు) సీమ ఇండ్లల్లో ఎక్కువగా పులగం చేసుకుంటూ ఉంటారు. అందరూ సాధారణంగా చేసుకునే వంటకమైనా, పులగానికి చాలా పెద్ద చరిత్ర ఉంది.
పులాక అనే సంస్కృత పదము నుండి పులగము అనే పేరు వచ్చింది.
పులాకము అంటే అన్నపు మెతుకు అని అర్థము. పెసర పులాకము / పెసర పులగాన్నే సంక్షిప్తంగా పులగం అంటున్నారు. బియ్యానికి, పొట్టుతో కూడిన పెసరపప్పు (పెసర బేడలు) కలిపి చేసే అన్నమే పులగం. పులగాన్ని ముద్గాన్నాము లేదా ముద్గలాన్నాము అని కూడా అంటారు.
ముద్గలు అంటే పెసలు అని అర్థం. అందుకే పెసర పులగానికి ముద్గాన్నము అని కూడా పేరు. పిండిపదార్థం (carbohydrates) (బియ్యం) , మాంసకృత్తులు(preoreins) (పెసలు) కలగలిపి చేసే పులగం రుచిపరంగానే కాక, ఆరోగ్య రీత్యా కూడా శ్రేష్టమైనది.
రాయలసీమలోని ప్రముఖ పట్టణాలలో అతి నూతనమైన పట్టణాలలో ఒకటి హిందూపురం (పుట్టపర్తి కూడా ఆ కోవలోకే వస్తుంది). హిందూపురం ఏర్పడేకంటే ముందు అక్కడ 'సూగూరు' అనే ఊరు ఉండేది. 18వ శతాబ్దంలో మరాఠా సర్దారు మురారి రావు గుత్తి కోట నుండి పరిపాలన చేసే కాలంలో,
వారికి, మైసూరు సుల్తానులకు నిత్యం యుద్ధాలు జరిగేవి. రాజ్యరక్షణకు, మైసూరు సుల్తానులను ఎదుర్కొనేందుకు మురారి రావు తండ్రి సిద్ధోజి నేతృత్వంలో పెద్ద సైనిక పటాలంతో ఈ సూగూరు పరిసరాల్లో చాలా కాలం ఉండేదట. సైనికులకు అవసరమైన సేవలు అందించేందుకు అనేక వృత్తుల వారు కూడా సూగూరుకు వచ్చి ఉండేవారు
సిద్ధోజీ, అతని సైన్యం సూగూరును వదిలిపెట్టి వెళ్లినా, వారు అక్కడే స్థిరపడినారు. తరువాత గుంతకల్ - బెంగళూరు రైల్వే లైను హిందూపురం మీదుగా వెళ్లడం వల్ల, బెంగుళూరుకు సమీపంగా ఉండటం వల్ల, కాలక్రమేణా హిందూపురం / సూగూరు వాణిజ్య కేంద్రంగా ఎదిగి, పెద్ద పట్టణం అయ్యింది.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకైక అదిశకంర పీఠం కడప జిల్లాలోని పుష్పగిరి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయ సముదాయం పుష్పగిరి. శైవమత కేంద్రంగా, నివృత్తి సంగమంగా, హరిహర క్షేత్రంగా, అదిశంకర పీఠంగా వెలసిల్లిన పుష్పగిరి
ఒకప్పుడు నిత్యం వేదపారాయణంతో మారుమోరోగిన అగ్రహారం. ఏనుగుల వీరాస్వామి కాశీ యాత్ర చరిత్రలోనూ, శ్రీ పోతులూరి వీరబ్రహేంద్ర స్వామి జీవిత చరిత్రలోనూ పుష్పగిరి అగ్రహారం ప్రస్తావన ఉంది.
వీరబ్రహేంద్ర స్వామి తన ప్రియశిష్యుడు సిద్దయ్య తో కలిసి పుష్పగిరి మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు వారిని అవహేళన చేసిన పుష్పగిరి బ్రాహ్మణులు స్వామివారి ఆగ్రహానికి లోనయ్యి, వారి ఇళ్లు తగలబడ్డ తరువాత తమ తప్పు తెలుసుకుని స్వామికి శిష్యులుగా మారినట్టు బ్రహ్మంగారి చరిత్ర చెబుతుంది.