రూపాయి దోశ - 5 రూపాయల దోశ
20 ఏళ్ల కింద మాట. మా ఊర్లో రమణమ్మ దోశలు (పేరు మార్చా) బాగా ఫేమస్. పొద్దున్నే రమణమ్మ దోశలంగట్లో దోశలు తినాలంటే అరగంటన్నా పడ్తాన్యాది. ఎప్పుడు సూడు జనాలు ఉంటాన్యారు. రమణమ్మ అంగట్లో మూడు రకాల దోశలు ఉంటాన్యాయ్. రూపాయి దోశ, రెండు రూపాయల దోశ, 5 రూపాయల దోశ.
రూపాయి దోశలకు ఎర్రకారం ఏచ్చే బొంబాయి సెట్నీ ఉండదు. బొంబాయి సెట్నీ ఏచ్చే ఎర్రకారం ఉండదు. ఎప్పుడన్నా బుద్దిపుట్టి రెండు ఏసినాదంటే ఆపొద్దు పప్పుల పొడి ఉండదు. ఆ సిన్న పెనం మీదనే రెండు ఒక రూపాయి దోశలు ఇరికీడం రమణమ్మ టాలెంట్
ఇంక రెండు రూపాయల దోశలు. పెనం మీద ఒకతూరి ఒకటే దోశ.
కారం, బొంబాయి సెట్నీ, పప్పుల పొడి అన్నీ ఎచ్చాది గానీ అన్నీ ఆంటీ ముట్టనట్టు ఉంటాయి. రోన్త నూనె జాచ్చి ఏచ్చాది.
ఇంగ 5 రూపాయల దోశలోళ్లు. ఈళ్లు మిగతా వాళ్ల మాదిరి వెయిట్ సెయ్యాల్సిన అవసరం ల్యా. ఊర్లో పెద్దపెద్దోళ్లు అంతా ఆడ్నించి 5 రూపాయల దోశలు తెప్పించుకుంటాన్యారు.
5 రూపాయల దోశలకు రమణమ్మ సేపరటగా నూనె, మళ్లా నెయ్యి పక్కన పెట్టింటాది. అయినా 5 రూపాయల దోశలోళ్లు ఈ నూనె నమ్మక స్టీల్ క్యారీలోనో, లోటాలోనో నెయ్యో, నూనో ఇచ్చి అంపిచ్చారు. దోశ చేసేప్పుడు నూనె, ఏలు మందాన ఎర్రకారం, బొంబాయి సెట్నీ, పప్పుల పొడి మళ్లా తీసేముందు సెంట్ కొట్టినట్టు
రెండు పక్కలా నెయ్యితో కాల్చిన ఆ దోశలు సూసి రూపాయి దోశలోళ్లు, రెండు రూపాయల దోశలోళ్ళు గుటకలు మింగుతాంటారు. ఎప్పుడూ కొనింది ల్యా కాబట్టి తిన్నీకి ఎట్లుంటాయో తెలీదు కానీ, సూన్నీకి మాత్రం పికాసో పాయింటింగులు అన్యట్టు ఉంటాన్యాయ్.
ఎట్టయినా 5 రూపాయల దోశ తినాల్ల అని బడికి పోనీకి ఇంట్లో ఇచ్చే పావలా, అర్ధ ఎత్తిపెట్టుకుని 5 రూపాయలు కూడబెట్టి ఒక మాంచి రోజు ఆ దోశ తిన్యా గదా .. అప్పటాల్నుంచి ఇప్పటి వరకు పది రూపాయల దోశ నుండి నూరు రూపాయల దోశ గునక తిన్యా కానీ ఆ 5 రూపాయల దోశంత బాగుండే దోశ మళ్లా తినింది ల్యా.
ఇప్పుడు అనుకుంటే రమణమ్మ దోశల అంగడి సమాజానికి అద్దమేమో అనిపిచ్చాది.
ఉన్య దాంట్లో రూపాయి దోశ గబా గబా తిని వాళ్ల వాళ్ల పనులకు పోయే పేద, దిగువ మధ్యతరగతి (రూపాయి దోశలోళ్లు)
#సీమపదం #సీమరుచులు #కారందోశ #karamdosa #Based_On_True_Events
5 రూపాయల దోశ తినలేక, ఆశ సంపుకోలేక, రెండు రూపాయల దోశకు తృప్తి పడలేక నిజానికి -ఆశలకు మధ్య నలిగిపోయే మధ్యతరగతి (రెండు రూపాయల దోశలోళ్లు)
లెక్క ఉంటే సాలు మాట సెల్లుబాట సేస్కోని, మిగతావాళ్ల కంటే ముందు ముందుకు దూసుకుపోయే ధనికవర్గం (5 రూపాయల దోశలోళ్లు)
ఇది తరతరాల కథ #fiction
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
